ముంబయి-ప్రజాపాలన:పరిమితి మించిన ఏటీఎం లావాదేవీలు నిర్వహించినప్పుడు బ్యాంకులు ఖాతాదారులపై చార్జీలు విధిస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని బ్యాంకులు లావాదేవీలు విఫలమైనా దాన్ని లావాదేవీగానే పరిగణించి చార్జీలు విధిస్తుండేవి. తాజాగా ఈ తరహా లావాదేవీలు విఫలమైనప్పుడు ఖాతాదారులపై ఎలాంటి చార్జీలు విధించారాదని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్జీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు స్థానిక గ్రామీణ బ్యాంకులు సహా అన్ని రకాల వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తాయి. ఆ లావాదేవీలు ఏమిటంటే.. హార్డ్ వేర్ వైఫల్యం: వినియోగదారుడు ఏటీఎంను ఉపయోగిస్తున్నప్పుడు యంత్రంలోని హార్డ్ వేర్ విఫలమైలావాదేవీ నిలిచిపోతే.. దాన్ని లావాదేవీగా పరిగణించరాదు. సాఫ్ట్ వేర్ వైఫల్యం: ఏటీఎం సాఫ్టవేర్లో ఏదైనా సమస్య తలెత్తి లావాదేవీ విఫలమైతే.. దానికి ఎలాంటి చార్జీ విధించరాదు. సమాచార వైఫల్యం: కొన్నిసార్లు సమాచార వైఫల్యం కారణంగా లావాదేవీ నిలిచిపోతుంది. వాటిని కూడా లావాదేవీగా పరిగణించరాదు. ఏటీఎంలో నోట్ల లేకపోవడం: వినియోగదారుడు కోరిన మేరకు ఏటీఎం కరెన్సీ నోట్లను అందించకపోతే.. లావాదేవీ వైఫల్యంగా పరిగణించాల్సిందే. దానికి ఎటువంటి చార్జీని విధించరాదు.తప్పు ఏటీఎం పిన్: వినియోగదారుడు ఏటీఎం పిన్ను తప్పుగా ఇస్తే.. దాన్ని కూడా లావాదేవీగా పరిగణించరాదు. కార్డు యాక్టివేషన్: డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను యాక్టివేట్ చేసేందుకు ఒక్కోసారి ఏటీఎంల ద్వారా తొలి లావాదేవీ జరపాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎలాంటి చార్జీని విధించరాదు. బ్యాలెన్స్: ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మొత్తం ఉందో పరిశీలించుకోవడానికి ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదు. ఆ సేవలను ఖాతాదారులకు పూర్తిగా ఉచితంగా అందించాలి. చెక్ బుక్ విజ్ఞప్తి: ఏటీఎం ద్వారా కొత్త చెక్ బుక్ కోసం ఖాతాదారుడు చేసే విజ్ఞప్తిని ఉచిత లావాదేవీగానే పరిగణించాలి. పన్నుల చెల్లింపులు: ఏటీఎం ద్వారా ఖాతాదారుడు తన పన్నులను చెల్లిస్తే.. ఆ లావాదేవీని ఉచితంగానే పరిగణించాలి. నిధుల బదిలీ: ఖాతాదారుడు తన ఖాతాలో ఉన్న మొత్తాన్ని వేరే అకౌంట్లోకి పంపించేందుకు వినియోగదారుడు ఏటీఎంను వినియోగిస్తే.. దాన్ని ఉచిత లావాదేవీగానే పరిగణించాలి.