పాన్-ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు

ముంబయి-ప్రజాపాలన:ఐటీ రిటర్నులు దాఖలు చేసే వారు గాని, ఐటీ పరిధిలోకి రాకపోయినా పాన్ కార్డు తీసుకుని ఉన్న వారు గాని పాన్ నంబర్‌ను ఆధార్ నంబర్ తో అనుసంధానం చేసుకునేందుకు గడువు తేదీని డిసెంబరు 31 వరకు పొడిగించారు. వాస్తవానికి ఈ గడువు తేదీ సెప్టెంబరు 30. మరో రెండు రోజుల్లో ఈ గడువు ముగియనున్న సమయంలో ప్రభుత్వం దీన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా మంది పాన్ నంబర్ తో ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకుని ఉండవచ్చు. ఒకవేళ ఇప్పటికీ చేసుకుని ఉండకపోతే మాత్రం తొందరపడక తప్పదు. ఆ గడువు దాటిపోతే మాత్రం మీ పాన్ నంబర్ “ఇనాపరేటివ్”గా (పనిచేసే స్థితిలో లేనిది) మారిపోతుంది. ఏ లావాదేవీకైనా పాన్ నంబర్ రాయాల్సివచ్చినా దాన్ని ఇవ్వలేని విషమ పరిస్థితి ఏర్పడుతుంది. నిబంధన ఏం చెబుతోంది? - ఆదాయపు పన్ను చట్టం 139 ఎఎ సెక్షను అనుబంధంగా ఉన్న సబ్ సెక్షన్ (2) ప్రకారం ఆధార్లో అయితే అనుసంధానం కాని పాన్ నంబర్లన్నీ “చెల్లుబాటులో లేనివి”గా మారిపోవాలి. కాని 2019 ఫైనాన్స్ బిల్లు ఆ నిబంధనకు సవరణ ప్రతిపాదించింది. ఆ సవరణ ప్రకారం పాన్ నంబర్ ఇనాపరేటివ్ గా మాత్రమే మారుతుంది. అంటే ప్రభుత్వం అధికారిక లావాదేవీలకు వేటికీ ఆ నంబర్ ను అధీకృతమైనదిగా గుర్తించదన్న మాట. అలాంటి పరిస్థితే ఎదురైతే ఆ వ్యక్తి పాన్ బదులుగా ఆధార్ నంబర్ వేసి ఆ లావాదేవీని పూర్తి చేయవచ్చు. అలా ఆధార్‌తో ఎప్పుడైతే లావాదేవీ వచ్చిందో వెనువెంటనే కొత్త పాన్ జారీ అయిపోతుంది. ఇలా చేయండి... ఆదాయ పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ లోకి వెళ్లండి. అందులో పాన్-ఆధార్ లింక్ ఆప్షన్ ఎంచుకోండి. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ నిర్దేశిత ప్రదేశాల్లో టైప్ చేయండి. నేమ్ యాజ్ పర్ ఆధార్ అన్న దగ్గర మీ పేరు టైప్ చేయండి. ఆ దిగువనే ఉన్న "ఐ హావ్ ద ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్” అని ఉన్న దగ్గర బాక్స్ క్లిక్ చేయండి. ఆ దిగువనే ఉన్న "ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటైల్స్ విత్ యుఐడిఏఐ” అని ఉన్న దగ్గర బాక్స్ క్లిక్ చేయండి. తర్వాత మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నర కావాచా కోడ్ దిగువన ఉన్న బాక్స్లో టైప్ చేయండి. తర్వాత "లింక్ ఆధార్” ఆప్షన్ క్లిక్ చేయండి. మీ అభ్యర్ధన యుఐడిఏఐకి పంపడం జరిగింది అనే సందేశం స్క్రీన్ మీద వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ లో మీ పాన్-ఆధార్ అనుసంధానం స్టేట్సను పరిశీలించుకుంటే సరిపోతుంది. ఇంకెందుకాలస్యం. వెంటనే మీ కంప్యూటర్ తెరిచి ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ లోకి వెళ్లి ఈ తతంగం పూర్తి చేసుకోండి. మనశ్శాంతిగా ఉండండి. ఇంకా ఆలస్యం చేస్తే మాత్రం మీ పాన్ పని చేయకుండా పోతుంది.