అక్టోబరు 22న బ్యాంకుల సమ్మె రెండు యూనియన్ల ప్రత్యేక శంఖారావం హైదరాబాద్-ప్రజాపాలన: ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా కన్సాలిడేట్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ అక్టోబరు 22న దేశవ్యాప్త సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య బీఈఎఫఐ) సమ్మె శంఖారావం పూరించాయి. ఆరు బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడం, కొన్ని బ్యాంకు శాఖలను కూడా మూసివేయడం, ఉద్యోగ భద్రతకు ముప్పు కల్పించడం వంటి నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం, బీఈఎఫఐ ప్రధాన కార్యదర్శి దేబశిష్ బసు చౌధురి సంయుక్త ప్రకటనలో తెలిపారు. రుణాల ఎగవేతదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, మొండి బకాయిల వసూలుకు అవకాశం కల్పించాలని కోరారు. పెనాల్టీలు, సర్వీసు చార్జీల భారాన్ని మోపడం ద్వారా కస్టమర్లను వేధించవద్దని, డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచాలని, అన్ని బ్యాంకుల్లోను తగినన్ని నియామకాలు చేపట్టాలని తాము కోరుతున్నామన్నారు. నాలుగు బ్యాంకు అధికారుల సంఘాలు ఈ నెల 26, 27 తేదీల్లో సమ్మె చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించాయని, బ్యాంకుల కన్సాలిడేషన్ ప్రక్రియ నిలిపివేయాలన్న డిమాండుతో పాటు వేతన సవరణ డిమాండు కూడా నోటీసులో ఉందని వెంకటాచలం అన్నారు. కానీ వేతన సవరణ చర్చల్లో ఎక్కడా ప్రతిష్టంభన లేదు గనుక అది సమ్మె డిమాండ్లలో చేర్చడం సమంజసం కాదని తాము భావిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలన్నీ కలిసికట్టుగా సమ్మె చేయాలన్న నిర్ణయాన్ని కూడా నీరుగార్చి ఆ నాలుగు సంఘాలు ప్రత్యేకంగా సమ్మె పిలుపు ఇచ్చినందు వల్ల తాము వేరుగా సమ్మె నిర్వహించాలని భావించినట్టు ఆయన తెలిపారు. పెద్ద బ్యాలెన్స్ షీట్ల ముసుగులో మొండిబకాయిలను తగ్గించి చూపాలన్న దురుద్దేశమే బ్యాంకుల కన్సాలిడేషన్కు మూలం అని భావిస్తున్నందున తాము ఆ అంశాన్ని కూడా తమ డిమాండ్లలో చేర్చినట్టు ఆయన వివరించారు.
అక్టోబరు 22న బ్యాంకుల సమ్మె లన: