సమ్మెసర్కారు తకరారు

| తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన సుమారు నెల రోజుల తర్వాత ఆదరా బాదరాగా ఒక కమిటీ వేసి పరిష్కరించే అధికారాలు ఇవ్వకుండా నియంతృత్వం తో నలభై ఎనిమిది వేల కార్మికులను విధుల నుండి తొలగిస్తునట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి బాధ్యతా రహితంగా ప్రవర్తించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన కార్మికుల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరి గర్హనీయం. కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, ఆయా ఉద్యోగాల్లో చేరే వారు యూనియన్ లో చేరమని సంతకం చేయాలని ప్రకటించటం ద్వారా మనం ప్రజాస్వామ్యంలోనే వున్నామా? అనే సందేహం కలుగుతోంది. భవిష్యత్తు లో ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్ లని సైతం నిషేదిస్తామని ప్రకటించినా ఆయం లేదు. అసలు ఆర్టీసి నష్టాలకు కారణాలు అన్వేషించ కుండా వాస్తవాస్తవాలు పరిశీలించకుండా ప్రవర్తించటం దేనికి సంకేతాలు ఇస్తున్నట్లు? దీర్ఘ కాలంగా పనిచేస్తున్నా యాభై వేలు దాటని జీతాలతో పని చేస్తున్న కార్మికుల వేతన సవరణ సహేతుకమైనది . ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోతే కేవలం కండక్టర్ నే శిక్షించి ఇంక్రిమెంట్ కోసేసే దుష్ట సంప్రదాయాన్ని పునః పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. బస్సు బాగా రద్దీ గా వున్న సమయంలో శిక్ష లో వెసులు బాటు వుండాలి. ప్రయాణికులను పెనాల్టీ డబ్బుల రూపంలో వేసి కండక్టర్ ఇంక్రిమెంట్ కోసి సర్వీస్ మొత్తం లో కోల్పోయే వేతనం భారీగా వుంటుంది. మొత్తం ఇరవై ఒక్క డిమాండ్స్ లో ఆర్థిక సంబంధం లేని వాటిని అయినా పరిష్కరించకుండా ఒకే ఒక్క బూచి నష్టాల్లో వుందని చెబుతూ ఆర్టీసి కార్మికుల దే తప్పన్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్ప తప్పదు. కార్మికులను గడీ ల్లో వెట్టి కార్మికులు గా చూస్తున్నారు. కార్మికుల , యాజమాన్య జీతభత్యాల తేడా భారీగా వుంది. రాజకీయ అవినీతి ఆర్టీసి లో మెండు. బస్ బాడీ యూనిట్ ఆర్టీసి కి వున్ననూ కమీషన్ల కోసం ప్రైవేట్ ఇండస్ట్రీ లకి ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రతి డిపో కి డీజిల్ ఏజెన్సీ ఇస్తే తక్కువ ధరకే ఆర్టీసి కి లభిస్తుంది కానీ ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నించదు. ప్రభుత్వం ప్రయాణీకులకు ఇచ్చే సబ్సిడీలను చెల్లించరు. కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ ని యాజమాన్యం వాడుకుని చెల్లించక తప్పుకు తిరుగుతుంది. ప్రైవేట్ బస్సులు స్టేజ్ క్యారియర్ గా తిరుగుతున్నా రవాణా శాఖ పట్టించుకోదు. ఒకే నంబర్ ప్లేట్ తో సర్వీసులు తిరుగుతూ పట్టుబడ్డ సంఘటనలు చాలానే వున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో చాలావరకు రాజకీయ నాయకులు నడుపుతున్నవేనని అందరికీ తెలిసిందే. యాజమాన్య, రవాణా మంత్రి పరిధుల్లో పరిష్కారం జరగాల్సినవి సైతం ముఖ్యమంత్రి దాకా వెళ్తుండటం వల్ల అసలు కాబినెట్ మంత్రులు ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాచరిక వ్యవస్థ దిశగా తెలంగాణ అడుగులు పడుతున్నాయి. ఎన్నికల వేళ చేసిన హామీలు నెరవేర్చ లేక పోగా ఉన్న ఉద్యోగాలు పీకేసమని ప్రకటించే స్థాయికి వెళ్ళారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఎక్కడ వేసిన గొంగళి చందాన వున్నాయి. సొంతూరు కి మాత్రమే ముఖ్యమంత్రి లా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదు. రైతు బంధు అటకెక్కింది. హుజూర్ నగర్ ఎన్నిక దరిమిలా సూర్యాపేట జిల్లాకే రైతు బంధు నిధులు విడుదల చేసారు. అవసరార్థం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం మన జాలదు. ఈ రోజు ఆర్టీసి కార్మికుల సమ్మె సకల జనుల సమ్మె దిశ గా మార్చక పోతే తెలంగాణ లో సామాన్యుడి బతుకు ప్రశ్నార్థకం అవుతుంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, గజిటెడ్ సంఘాలు, కుల మత సంఘాలు సంయుక్తంగా సమ్మె చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. మరో తెలంగాణ పోరు అనివార్యం. తెలంగాణ పోరు కి నాయకత్వం వహించ గల రాజకీయ పార్టీలకి భవిష్యత్తు లో మంచి ఫలితాలు ఖాయం. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ని సవ్య దిశలో పయనింప జేసి గద్దె ని కూల్చే దాకా విశ్రమించజాలదు. ప్రజాస్వామ్యయుతంగా సకల జనులు మళ్ళీ మహా పోరు చేయక తప్పదు. రాజ్యం విసిరిన మెతుకులతో నోరు మూసుకున్న మేధావులను వదిలేసి నయా నాయకత్వంలో ఉద్యమం రూపు దిద్దుకోవాలి. ఆరెస్సెస్ నుండి ఆర్ఎయు దాకా ఎవరు కలిసి వచ్చినా కలుపుకు పొమ్మన్న ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ మళ్ళీ రాజుకోవాలి. -


గిరి ప్రసాద్ చెలమల్లు 201 క్లాసిక్ ఏవెన్యూ మియాపూర్ హైదరాబాద్ 500049