భారత్ వ్యవసాయ ప్రధాన దేశం. సుమారు 50 శాతం పైగా ప్రజలకు (12 కోట్ల కుటుంబాలకు) ఈ రంగమే జీవనాధారం. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడచినా వ్యవసాయ రంగం పలు సమస్యలతో సతమతమవుతోంది. ఒక్క ప్రకృతి విపత్తు చాలు అన్నదాతల ఆశలను ఆవిరి కావడానికి. దేశంలో 50 శాతం పైగా రైతులు అప్పుల్లో మునిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇది 93 శాతమని 'సెస్' అధ్యయనం చాటుతోంది. తెలంగాణలో అది సుమారుగా 83 శాతం. అన్నదాతల అప్పులు పెరిగిపోతున్నాయి. పంట నష్టాల వల్ల రుణాలను తీర్చలేని అన్నదాత చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. 1995-2015 మధ్యకాలంలో సుమారు 3.10 లక్షల రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అంచనా. చివరకు వ్యవసాయ సంక్షోభం రైతులను రోడ్డెక్కించే పరిస్థితిని తీసుకొచ్చింది. కేంద్రం రైతులను ఆదుకోవడానికి అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో అన్నదాతల బతుకులు మాత్రం బాగుపడటం లేదన్నది నిష్ఠుర సత్యం. మూడేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' ఆచరణలో ఆశించిన లక్ష్యాలను సాధించలేక చతికిలపడింది. 2019 నాటికి దేశంలో 50 శాతం రైతుల్ని దీని పరిధిలోకి తేవాలన్నది ప్రధాని లక్ష్యం. గతంలో ప్రవేశపెట్టిన పలు బీమా పథకాలు రైతులకు మేలు చేయడంలో విఫలమయ్యాయి. 2015లో 20 శాతం పంటభూమి మాత్రమే బీమా పరిధిలో ఉండేది. పాత బీమా పథకాల్లో ప్రీమియం అధికంగా, నష్టపరిహారం పరిమితంగా ఉండేది. ప్రీమియంలో ప్రభుత్వ వాటా స్వల్పమే. కొత్త పథకం ఈ లోపాలను సరిదిద్దింది. బ్యాంకు రుణాలు తీసుకోనివారూ దీనిలో చేరవచ్చు. సత్వరం నష్టపరిహారం అందజేసేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు రిమోట్ సెన్సింగ్, స్మార్ట్ ఫోన్, డ్రోన్ వంటి పరికరాల వినియోగాన్ని ఈ పథకం ప్రతిపాదిస్తోంది. రైతుల ఆదాయాలు ఒడుదొడుకులకు లోనుకాకుండా, సేద్యాన్ని విడిచి పెట్టి ఇతర ఉపాధి మార్గాల వైపు వెళ్ళకుండా నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. మొదటి ఏడాది 201617లో 5.6 కోట్ల రైతు కుటుంబాలు ఇందులో చేరాయి. వీరిలో 3.7 కోట్ల కుటుంబాలు వివిధ బ్యాంకుల రుణగ్రహీతలు. 5.55 కోట్ల హెక్టార్ల భూమి ఈ పథకం పరిధి కింద నమోదైంది. మొదటి ఏడాది భూమి విస్తీర్ణం, రైతుల సంఖ్య విషయాల్లో అనుకున్న లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించింది. కానీ అర్హులైన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో బీమా సంస్థలు అనుసరిస్తున్న విధానాలు పలు విమర్శలు ఎదుర్కొన్నాయి. మొదటి ఏడాది బీమా కంపెనీలు రూ. 22,337 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసింది. ఇందులో రైతుల వాటా రూ.4,411 కోట్లు. మిగిలినది రాయితీ కింద కేంద్ర, రాష్ట్రాలు చెల్లించాయి. అదే ఏడాది బీమా సంస్థలు రైతులకు చెల్లించిన నష్టపరిహారం రూ.13,500 కోట్లు మాత్రమే. ఇది చెల్లించిన ప్రీమియంలో 60 శాతంకన్నా తక్కువ. ఈ రెండింటికి తేడా సుమారు రూ. 8,837 కోట్లు. ఇది బీమా సంస్థలకు స్థూల లాభమే అవుతుంది. దీంతో అర్హులైన చాలామంది రైతులకు నష్టపరిహారం సరిగ్గా చెల్లించలేదనే విమర్శలు వచ్చాయి. 2017-18, 2018-19 ఖరీఫ్ సీజన్ వరకు బీమా సంస్థలు చెల్లించిన నష్టపరిహారం 60 శాతంకన్నా తక్కువగానే ఉంది. బీమా కంపెనీల్లో పోటీతత్వం లోపించడం, చిత్తశుద్ధి, సామర్థ్యం లోపించడం ఈ పరిణామాలకు ముఖ్య కారణాలు. అయిదు ప్రభుత్వ, 13 అంతేతప్ప రాష్ట్రాలు, కోరల ప్రకారం రైతుకు పరిహారం చెల్లిస్తారు. ప్రైవేట్ బిమా సంస్థలు ఈ పథకాన్ని అమలుచేస్తున్నాయి. ఖరీఫ్ పంటకు బీమా చేసిన మొత్తంలో రెండు శాతాన్ని, రబీ పంటకు 1.5 శాతాన్ని, వ్యాపార పంటలకు అయిదు శాతాన్ని ప్రీమియంగా నిర్ణయిస్తున్నారు. పంట నష్టాన్ని బట్టి పరిహారం చెల్లిస్తారు. వాస్తవ పంట దిగుబడికి, గత ఏడు సంవత్సరాల పంట సగటు దిగుబడికి మధ్యగల తేడాను పంట నష్టంగా పరిగణిస్తారు. నష్టపరిహారాన్ని నిర్ణయించేటప్పుడు ఈ ఏడేళ్ళలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన రెండు సంవత్సరాలను మినహాయించి పండిన సగటు పంటను, రైతు ఎంచుకున్న నష్టం స్థాయి పూర్తి శాతంతో గుణిస్తారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన నష్టాలకు ఈ పథకం కింద నిబంధనల ప్రకారం రైతుకు పరిహారం చెల్లిస్తారు. అంతేతప్ప రాష్ట్రాలు, కేంద్ర బృందాల నివేదికలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల, కరవు తుపాను ప్రకటనల ఆధారంగా నష్టపరిహారం చెల్లించరు. ఈ పథకం కింద పరిహారం పొందిన రైతులకు 'స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్' కింద పంట నష్టంలో 33 శాతానికి సమానంగా సత్వర ఉపశమనం కోసం ఆర్థికసాయం లభిస్తుంది. . ఈ పథకం కొన్ని రైతు సంఘాలను అంతగా ఆకర్షించలేకపోవడానికి పలు కారణాలున్నాయి. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులు సహజంగానే ఈ పథకంలో సభ్యులవుతారు. రుణాలు తీసుకోని రైతులను త రైతులను తప్పనిసరిగా సభ్యులుగా చేర్పించడానికి తగిన ప్రయత్నాలు కానీ జరగడం లేదు. వారందరూ సాధారణంగా కౌలు రైతులే. వ్యవసాయ భూములు వీరి పేరున లేకపోవడం వల్ల రుణాలకు వీరు అర్హులు కారు. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ఈ పథకం అమలుకావడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో కౌలురైతులు సభ్యులు కాలేకపోతున్నారు. రైతుల బ్యాంకు ఖాతాల నుంచి వాయిదా ప్రీమియం మొత్తాన్ని వారికి తెలియకుండా తీసుకోవడాన్ని రైతు సంఘాలు తప్పుపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సిబ్బంది బీమా చేసిన పంటకు బదులు వేరొక పంటకు బీమా చెల్లించడం వల్ల రైతుకు ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోతుంది. ఇదంతా బ్యాంకులను అడ్డం పెట్టుకొని బీమా సంస్థలు ఆడుతున్న నాటకమని రైతు సంఘాలు చెల్లించలేదనే ఆరోపిస్తున్నాయి. నష్ట పరిహారం లెక్కించే తీరూ సంతృప్తికరంగా లేదని ఆరోపిస్తున్నాయి. పంట దిగుబడి నిర్ణయించడానికి రైతు బీమా చేసిన వ్యక్తిగత భూమి కాకుండా, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవడం రైతు సంఘాలకు ఆమోదయోగ్యంగా లేదు. ఈ విషయంలో గ్రామాన్ని కాకుండా, రైతు బీమా చేసిన పంట భూమిని యూనిట్ గా పరిగణించడం వాషింగ్ ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడం శ్రేయస్కరం. ప్రతి గ్రామంలోను నాలుగు పంట కోత ప్రయోగాలు జరపాలని ఈ పథకంలో నిర్దేశించారు. ఇంత భారీ కార్యక్రమాన్ని అమలు చేయడానికి రాష్ట్రాల్లో తగినంత సిబ్బంది లేదు. నష్ట పరిహారం అందజేసేటప్పుడు ప్రైవేటు బీమా సంస్థలు, పలు కారణాలు చూపించి తక్కువ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. గతంలో వరదలు సంభవించిన యూపీ, బిహారు, అసోమ్ లో రైతులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. డ్రోను పరికరాలను ఉపయోగించకపోవడం, క్షేత్రస్థాయిలో అధికారులకు స్మార్టుఫోన్లు ఇవ్వక పోవడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడం వల్ల రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోంది. నకిలీ విత్తనాల వల్ల వాటిల్లుతున్న నష్టాన్ని, ఏనుగులు, అడవి పందులు, ఎలుగుబంట్లు పంటలకు చేస్తున్న నష్టాన్ని ఈ పథకం పట్టించుకోవడం లేదు. పథకం అమలు తీరులోనూ పారదర్శకత లోపించింది. దీనిపై రైతులకు అవగాహన కొరవడటంతో పథకంలో చేరుతున్న రైతుల సంఖ్య తగ్గింది. 2016-17లో 5.53 కోట్లమంది చేరగా, 2017-18లో 4.79 కోట్ల మంది మాత్రమే చేరారు. 2016-17లో 5.55 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమి ఈ పథకం కిందకు రాగా, 2017-18లో 4.75 కోట్ల హెక్టార్లు మాత్రమే చేరింది. అంటే 20 శాతం తగ్గింది. 2018-19లో దేశంలోని మొత్తం సాగుభూమిలో 50 శాతం ఈ పథకం కిందకు తేవాలన్నది లక్ష్యం. ప్రభుత్వం చెబుతున్న లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు లేవు. రైతులకు పరిహారం అందించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వారి అభ్యర్థనల్లో చాలావరకు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో పథకంలో చేరేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయం మన నాగరికతకు చిహ్నం. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిదీ. రైతులేనిదే జన జీవనం లేదు. అటువంటి అన్నదాత కంటతడి పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదు. నేడు వ్యవసాయరంగం పలు ఆటుపోట్లకు గురవుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలి కాలంలో జాతీయాదాయంలో 55 శాతంగా ఉన్న వ్యవసాయరంగం నేడు కేవలం 14 శాతం వద్ద కొట్టుమిట్టాడుతోంది. ప్రకృతి వైపరీత్యాలు హరిత విప్లవం ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే వారికి అన్ని విధాలా అండదండలు అవసరం. ఈ దిశగా ప్రభుత్వాలు ముందుకు కదలాలి!
రైతాంగాన్ని ఆదుకోని యోజన