ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం కేంద్ర మంత్రి మండలిలో హోంశాఖ మంత్రి గానూ, ఉప ప్రధానమంత్రి గానూ బాధ్యతలను నిర్వహించి, దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేసి, అవసర మైన చోట బలప్రయోగం చేపట్టి అనేక సంస్థానాలను భారతదేశములో విలీనం కావడానికి గట్టిగా క విచేసి తన నిరుపమాన ధైర్య సాహసాలతో ఈ రోజు మనం చూస్తున్న అఖండ భారత దేశాన్ని ఆవిష్కరింప జేసిన మహనీయుడు , ధీరోదాత్తుడు , ధైర్య శాలీ , భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయి పటేల్ జన్మదినం అక్టోబర్ 31 . అప్పటి నిజాం నవాబు హైదరాబాదును పాకిస్తానుకు అప్పజెప్పుతుంటే ఆపరేషన్ పోలో పేరున మిలిటరీ చర్య జరిపి హైదరాబాదు రాజ్యాన్ని భారత్ లో కలిపిన ధీశాలి. ఈయన లేకుంటే హైదరాబాదు పాకిస్తానులో కలిసేది లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండేది అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు . హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా జాతి మొత్తం జరుపు కుంటుంది . సర్దార్ వ్యక్తిగతం : సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్ లోని నాడియాలో జన్మించాడు. ఇతను పదవ తరగతి 22 ఏళ్ల వయస్సులో పాస్ అయ్యారు. ఆ వయసుకి చాలా మంది కాలేజిలో చదువుకుని ఉద్యోగాల వేటలో ఉంటారు. నాదియాడ్, పెట్లాడ్, బోర్సాడ్ లోని స్కూళ్ళలో ఆయన క్లాసులకు హాజరు అయ్యారు. పట్టుదలతో చదివి న్యాయశాస్త్రం అభ్యసించి గొప్ప లాయర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇతని భార్య పేరు ఝవెర్బా. 1904లో ఆయనకు ఒక కుమార్తె - మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు. 36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసాడు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో, తర్వాత అహ్మదాబాద్కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని, ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవాడు గాంధీ నాయకత్వంలో : ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహా నికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1946 లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి . ఎన్నికలలో గెలిచినవారు అధ్యక్ష పదవి తో పాటు ప్రధాన మంత్రిగా కూడా పనిచేయాలని తీర్మానించారు. కయ్యారు. ఆ ఆ : ఒకే ఒక మం మంత్రి చేయుటలో మీ అభిప్రాయాన్ని చెప్పమని కోరగా ఆయన తల దించుకొని మౌనంగా ఉండిపోయాడు .దీనితో నెహ్రూకి ప్రధాన మంత్రి కావాలని ఉంది అని అర్థం చేసుకున్న గాంధీ సర్దార్ కు చిన్న కాగితం మీద ఎదో రాసి ఇవ్వగా ఆయన పోటీ నుండి తప్పుకున్నారు. ఇది చాలు ఆయన గొప్పదనం ఏమిటో చెప్పడానికి. గాంధీ గారికి ఆయన ఇచ్చే విలువ ఏమిటో తెలుసు కోవడానికి. రాజకీయ జీవితం: 1917 అహ్మాదాబాద్ మున్సిపాలిటికి మొదటి సారి కౌన్సిలర్ గా ఎంపికయ్యారు. ఆ తరువాత దరియపూర్ సీటుకి పోటీ చేసి , ఒకే ఒక్క ఓటు తేడాలో గెలిచారు. 1924 లో అహ్మదాబాద్ మున్సిపాలిటికి ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వాన్ని 5 లక్షలు కేటాయించమని ఆయన అభ్యర్ధన చేసారు. కాని ఎప్పుడైతే ప్రభుత్వం నిరాకరించిందో, మరి కొంత మంది సహకారం తీసుకుని 21 ఎకరాల స్థలం తీసుకొని కొత్త హాస్పిటల్ ని నిర్మించారు. ఇదీ ఆయన పట్టుదల భారత దేశానికి కేవలం రెండే రెండు ఆరోగ్య పరిశోధన కేంద్రాలు ఉండేవి. ఒకటి పూణే, ఇంకొకటి కరాచి. అలాంటివి మరి కొన్ని లేబోరేటరీలు ఉండటం వల్ల దేశంలోని రోగాలను నిరోధించవచ్చు అని సంకల్పించాడు. 1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. సంఘ సేవలో : 1928లో బార్డోలీలో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది. గాంధీ మొదలు పెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 3,00,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించు కున్నారు. గుజరాత్ లో మద్యపానం, అస్పృశ్యత,కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేసారు. రాజ్యాంగ రచనలో : రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కరు ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించాడు. ఏప్రిల్ 1947లో ఒకానొక అల్లర్ల జరుగుతున్న సందర్భంలో ఆయన ఒక చిరస్థాయిలో నిలిచిపోయే వ్యాఖ్యలు చేసారు. “మనం సౌబ్రాతుత్వ దేశంగా మారినా, స్వేచ్చ వాదం, కలుపుగోలుతనం, రాజ్య వ్యక్తిత్వం ఉన్న జాతిగా మారలేకపోతున్నాం. దేశం కొత్త సమాజాన్ని , కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంది, అంతే కాని తుప్పు పట్టిన ఆలోచనలని కాదు” . తన పేరుని వాడుకునే వాళ్ళు ఎవ్వరైనా ఆయన దూరంగా ఉంచేవారు. ఆఖరికి సొంత కుటుంబ సభ్యులను కూడా. తాను పాలన లో ఉన్నంత కాలం డిల్లీ కి దూరంగా ఉండమని కొడుకుని కోరుతూ ఉత్తరం రాసారు. ఉత్తరం వ్రాయడమే కాదు పూర్తిగా దూరంగా ఉంచి అందరికీ ఆదర్శ ప్రాయుడయ్యాడు. స్టాట్యూఆఫ్ యూనిటీ: దేశానికి తొలి సంమంత్రిగా పనిచేసి దాదాపు 562 కు పైగా సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన ఉక్కుమనిషి” సర్దార్ వల్లభాయ్ పటేల్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చిరస్మరణీయంగా నిలిచేలా ,దేశానికి ఆయన చేసిన సేవలను భావి తరాలు కలకాలం గుర్తించేలా చేయడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినదే స్టాట్యూఆఫ్ యూనిటీ. దీనిని తెలుగులో ఐక్యతా ప్రతిమ లేక ఐక్యతా విగ్రహం అని అంటారు. దీని ఎత్తు 182 మీటర్లు.. అంటే 600 అడుగులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన ప్రాజెక్టుగా పరిగణించిన ఈ విగ్రహం తయారీకి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం దాదాపు రూ. 2,990 కోట్లు. స్మారక కట్టడాన్ని గుజరాత్ లోని నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు 3.32 కిలోమీటర్ల దూరంలో సాధుబెత్ నదీ ద్వీపం లో నిర్మించారు. మొత్తం ఎత్తు భూమట్టం నుండి దాదాపు 240 మీటర్లు కాగా అందులో బేస్ లెవల్ 58 మీటర్లు, అక్కడ నుండి విగ్రహం ఎత్తు 182 మీటర్లు . విగ్రహ ఛాతి భాగంలో నదీ తీరానికి 500 అడుగుల ఎత్తున ఒక అద్భుత మైన గ్యాలరీని ఏర్పాటు చేసారు. సందర్శకులు ఒకే సారి 200 మంది నిలబడి చూచేందుకు వీలుగా ఉండడమే కాకుండా వింధ్యా సాత్పురా పర్వతాల అందాలను , 212 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన సుందర మైన సర్దార్ సరోవర్ డ్యాం , 12 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన గరుడేశ్వర్ రిజర్వాయర్ అందాలను తిలకించవచ్చు. ఈ విగ్రహ ఏర్పాటుతో పాటు విజిటింగ్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్, గార్డెన్ హెటల్ , అమ్యూజ్ మెంట్ పార్క్ ,రీసెర్చ్ ఇన్ స్టిట్యూ ట్ లాంటివి కూడా అందుబాటులో ఉండేటట్లుగా అలాగే భారీ రెస్టారెంట్లు , పార్కులు,విలాసవంతమైన సూటల్లు ఏర్పాటు చేసినారు. అలాగే 5 కిలో మీటర్ల బోటు షికారు కేంద్రం ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణ .ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన హంగులన్నిటినీ భారీ ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పటేల్ 143 జయంతి సందర్భంగా 2018 అక్టోబర్ 31 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంబించి జాతికి అంకితం చేసారు. ఇప్పటివరకు దాదాపు ముప్పయి లక్షలకు పైగా సందర్శకులు సందర్శించినారు. కేవలం టికెట్ రూపేణా దాదాపు 70 కోట్లు వసూలు అయి చక్కటి పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతుంది. కేంద్ర మంత్రిగా కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతను దేశానికి చేసిన గొప్ప సేవలు , చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి. భారత దేశం ఐక్యంగా ఉండాలని కల కనడమే కాక తన లక్ష్యం కోసం ఎదురొడ్డాడు,పోరాడాడు.మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం అతను దేశానికి చేసిన సేవలను గుర్తించి భారతరత్న బిరుదును మరణానంతరం ప్రకటించి గౌరవించింది. విగ్రహాలు, స్థూపాలను సర్దార్ వ్యతిరేకించారు. కాని, ఆయన పేరు మీద కట్టిన నిర్మాణానికి దాదాపు మూడు వేల కోట్లు ఖర్చు అయినాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ స్తూపంగా ఇది గుర్తింపు పొందింది. ఇదే ఆయనకు మనం ఇస్తున్న ఘనమైన నివాళి .
కాళంరాజు .వేణుగోపాల్ మార్కాపురం ప్రకాశం 8106204412