నచ్చిన ఫ్రీ టివి ఛానల్ చూడడం మీహక్కు

  •  (గత సంచిక తరువాయి) ఇంతవరకు సామాన్య వినియోగ దారుని ఎమ్.ఎస్.ఒ లు ఏవిధంగా ఏమార్చి వారి వ్యాపార ధోరణిని, వర్గ ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటూ మెజారిటీ బడుగు బలహీన వర్గాల ప్రయోహనాలకు, వారి ఆకాంక్షలకు అద్దంపట్టే కొదోగొప్పో తటస్థ చానళ్ళు ప్రసారాలకు మోకాలొడ్డుతున్నాయో చర్చించు కొన్నాం . అలాగే అదే దారిలో నడిచే మెజారిటీ చానల్స్ కూడా వారి వారి మైనారిటీ స్వప్రయోజనాలకు పెద్దపీట, మెజారిటీ బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలు ప్రతిబింబించే ప్రసారాలకు చిన్నపీట వేస్తూ కొండొకచో అసలు పీటే పీకేస్తూ వారి ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయనుటలో సందేహంలేదు. ఆంధ్రాలో ఎ.బి.ఎన్, టి.వి5 వంటి కొన్ని చానల్స్ తటస్థంగా ఉండకుండా ఒక వర్గానికి కొమ్ముకాసాయనే అపవాదును మూటకట్టుకున్నాయి. ఈ తరహా చానల్స్, పత్రికలు వాటి వర్గ ప్రభావిత సంచలన కధనాలతో, తటస్థ మెజారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తున్నామనే భ్రమలు కల్పించాయి. అవికూడా గత ప్రభుత్వ వర్గాలలోని పెద్దలు లేదా వారి అనుయాయ వర్గాలలకు చెంది, వారికే అనుకూల మీడియాగా ముద్రపడటం వల్ల , స్వతహాగా వారికి అనుకూలంగా ఉండే ప్రభుత్వ పెద్దలు, అధికార వర్గాలతో ఆరేసి ఏడేసి వందల కోట్ల ప్రభుత్వ ప్రకటనలను కైవశం చేసుకుని వారికి మరింత వంతపాడుతూ రెట్టించిన కథనాలతో రెచ్చిపోతూ మరింత బలపడినాయి. అదే సమయంలో తటస్థంగా ఉన్న ఇతర చానళ్ళకు ఏ విదమైన ప్రభుత్వ ప్రకటనలు అందని సందర్భంలో కనీసం సంఘీభావం ప్రకటించకుండా, వారి గుత్తాధిపత్యంతో మోకాలడ్డాయి. ఐతే సీన్ రివర్బై, ఈ కల్పిత కథనాలను, పసలేని ప్రభుత్వ అనుకూల మీడియా విధానాలను సహనంతో భరించి వీక్షించిన ప్రజలు వారి విజ్ఞతకు పదును పెట్టి అదను చూసి, పసలేని ప్రసారాలను ప్రక్కన బెట్టి, అదే ప్రభుత్వాన్ని పంచలోకి పంపించేసారని ప్రజలు గాఢంగా నమ్మారు. ప్రభుత్వం మారినా కూడా ఈ కోవకి చెందిన మీడియా, వారి పాత ప్రభుత్వ సాహచర్యం వదలలేక అదే ధోరణిని ప్రదర్శించి నూతన ప్రభుత్వాన్ని, ఇరుకున పెట్టే కథనాలతో అనతి కాలంలోనే చికాకు పెట్టేస్తున్నాయనే అపవాదును మూట కట్టుకున్నారు. ఈ ధోరణి నాటి ఎన్.టి.ఆర్ కి పదవీచ్యుతి గావించు సందర్భంలోను, అలాగే కొంతకాలానికి ప్రజారంజకంగా పాలనలోకి వచ్చిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాంలోనూ మనం కళ్ళకు కట్టినట్లు చూసాం. నేడన్నింటా ఆలోచనలకు చురుకుగా పదునుపెట్టే యువతదే ప్రభావం! పదే పదే పంటిక్రింద రాయిలాంటి పసలేని రాతలు కోతలు, తనని అందలం ఎక్కించిన తన ప్రజలకి చేరుతుంటే చూస్తూ తీరిగ్గా ఓర్చుకోవడానికి, “నాటి వై.ఎస్” కున్నంత సహనం "నేటి వై.ఎస్.” కి బహుశ ఉండకపోవచ్చు. అవసరం మేర ఆత్మరక్షణ చర్యలెవరికైనా ఆమోదయోగ్యమే! తత్పలితమే నిన్న మొన్నటి అరకొర ఆపివేతల డిమర్మమని మీడియా వర్గాల భోగట్టా! చానళ్ళకు ప్రజాస్వామ్యంలో ప్రజలనాడిని ప్రతిబింబించే ఒకప్పటి పక్షపాత రహిత జరిగే మీడియా నేడు తన ఒరిజినల్ ఉనికిని కోల్పోయి కిరాయి అవతారమెత్తుతూ వస్తూవుంది . అది అభివృద్ధి చెందుతున్న ఈ దేశ పురోగమనానికి గొడ్డలి పెట్టు. ప్రభుత్వాలు చేసే మంచి పనులను మంచిగాను, చెడ్డవాటిని చెడ్డగాను వ్రాయగలిగే నిస్పక్షపాత వైఖరిని విడనాడకుండా ఉండే పాత్రికేయులకు యాజమాన్యాలు స్థానం కల్పించి నైతిక సైర్యాన్నివ్వాలి. తటస్థ మీడియా బ్రతికి బట్టకట్టడానికి దశాబ్దాల క్రితమే ప్రభుత్వాలు సైతం ఎన్నో రాయితీలు కల్పించెడివి. నేడు ఆ విశాల దృక్పదం దుర్బిణీ వేసి వెతికినా దృగ్గోచరం కాదు! నేటి ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వాలకు, పెయిడ్ మీడియా వల్ల జరిగిన భంగపాటును గుర్తుంచుకొని, “బాకాసురుల” మోళీలకు మోకరిల్లి, ప్రజాధనంతో ప్రజల ప్రయోజనార్థమిచ్చే ప్రకటనల విషయంలో కొందరికే పట్టం కట్టకుండా, చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా, అన్ని తెలుగు చానళ్ళను సమదృష్టి తో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది గతానుభవ సారం! కార్పొరేట్ల అధీనంలో నడిచే పెద్దపత్రికలు/ చానళ్ళు, ఎలాగూ బడుగు బలహీన వర్గాల వాణిని వినిపించలేవనేది మందికి తెలిసిన మర్మమే! ఐతే చాలా వరకు చిన్న పత్రికలు చానళ్ళు ఆ వక్ష తెలిసిన మేధావుల మదిలోనుండే పుట్టాయని, విస్మరింపబడ్డ వర్గాలకు ఇసుమంతైనా ఊరట కలిగిస్తాయని, అదే ప్రజల నమ్మకం, నిజంకూడా! ఇంచుమించు ఇదే నినాదంతో నేడు అధికారంలోకి వచ్చి, అన్నింటా బడుగు బలహీన వర్గాలకు 50% కేటాయింపులనే సంచలన జి.ఏ.లను విడుదల చేస్తూ, పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తాం అని పాలనకొచ్చిన ప్రభుత్వాల ఆశయాలు అభినందనీయం. ఆదిశగా ఇంకా అడుగులు ముందుకు వేయాలని ఆకాంక్ష! అంతేకాదు, అదేస్పూర్తితో అన్ని తెలుగు ఫ్రీ న్యూస్/ నాన్ న్యూస్ చానళ్ళను ఎమ్.ఎస్.ఓలు వారి వారి నెట్ వర్క్ కేబుళ్ళలోను, అలాగే డి.టి. హెచ్. ఆపరేవటర్లు తెలుగు రాష్ట్రాలకనుగుణంగా తెలుగు ఫ్రీ చానళ్ళకు పెద్దపీట వేసి, వారి వారి బేసిక్ పేకేజీలలోనే విధిగా ప్రసారం జరిగే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసయకోవాలని తెలుగు రాష్ట్రాల సగటు ట.వి. ప్రేక్షకుడి సామాన్యకోరిక కూడా! రచయిత:


పొలమూరి ప్రసాదరావు. సామాజిక సాంకేతిక పర్యావరణ విషయ నిపుణులు.