విలువలతో కూడిన జీవితమే విజయానికి సోపానం


విలువలతో కూడిన జీవితం విజయ పథంలో ముందుకు సాగాలంటే మానవులు కొన్ని విలువలు పాటించాలి. మంచీ చెడుల పట్ల విచక్షణ కనబరచాలి. నిజానికి ప్రతి ఒక్కరిలో ప్రాధమికంగా ఈ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. కావలసిందల్లా వాటిని వెలికితీసి నిత్యజీవితంలో ఆచరణలో పెట్టగలగడమే. అంటే జీవితంలోని అన్ని రంగాల్లో విలువలు పాటించగలగాలి. ఉద్యోగ రంగమైనా, వ్యాపార రంగమైనా, విద్యారంగమైనా, సామాజిక రంగమైనా,సాంస్క ృతిక రంగమైనా,ఆర్ధిక రంగమైనా, ఆధ్యాత్మిక రంగమైనా ,రాజకీయ రంగమైనా ప్రతి విషయం లో వీటిని ఆచరించాలి. సాధ్యమైనంతవరకు, శక్తివంచన లేకుండా విలువలతో కూడిన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. ఎట్టిపరిస్థితి లోనూ తమను తాము గొప్పగా, ఇతరుల్ని తక్కువగా భావించకూడదు.మనతో ఏకీభవించని వారిపట్ల కూడా సద్భావనతోనే మెలగాలి. ఎందుకంటే అభిప్రాయ బేధాలన్నవి మానవ సమాజంలో సహజం. దాన్ని భూతద్దంలో ఎంతమాత్రం చూడకూడదు. అలా చేయడం విలువలకు వ్యతిరేకం అవుతుంది. జీవితంలో ఏది సాధించాలన్నా ఈనాడు ధనమే ప్రధానమైపోయింది. మంచీ చెడు,న్యాయం అన్యాయం, విలువలు అని మడి కట్టుకుంటే ఈ ప్రాపంచిక పరుగు పందెంలో వెనుక బడి పోవడం ఖాయమన్న భావన బలపడింది. బాగా డబ్బు గడించి విలాసవంతమైన జీవితం గడుపుతున్నవారితో పోల్చుకొని నిరాశకు గురవుతూ ఉంటాం. ఇదే దురాశకు దారితీసి, జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది. చట్టసమ్మతమైన, ధర్మబద్ధమైన మార్గంలో ఎంత సంపాదించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అది ఆమోదయోగ్యమే. అయితే సంపాదనే లక్ష్యంగా కారుణ్య అడ్డమైన గడ్డికరుస్తూ దొడ్డిదారుల్లో సంపాదించాలనుకుంటే తరువాత చేదు అనుభవాలను రుచి చూడవలసి ఉంటుంది. ఇలా సాధించిన సంపాదనా, సోపానాలు కేవలం తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. అంతేకాదు, అది జీవితంలో అశాంతికి, అభద్రతకు, అపజయాలకు కారణమవుతుంది. పేరు ప్రఖ్యాతుల కోసం, అధికారం , సదాల కోసం సంపాదనకు వక్రమార్గాలు అవలంబిస్తే ఖచ్చితంగా మనశ్శాంతి దూరమవుతుంది. విజయం దరిచేరినట్లు అనిపించినా అది నీటి బుడగతో సమానం. అసలు విజయం , నిజమైన శాంతి సంత ృప్తి నైతిక విలువలతోనే సాధ్యం. ఇహలోక విజయమైనా, పరలోక సాఫల్యమైనా విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా మంచి చెడుల విచక్షణా జ్ఞానంతో, ధర్మబద్దమైన జీవితం గడిపితేనే.. అందుకే ముహమ్మద్ ప్రవక్త స.సల్లం వారు మానవ జీవితంలో నైతిక విలువలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు. 'నైతికత,మానవీయ విలువల పరంగా మీలో ఎవరు ఉత్తములో వారే అందరి కన్నా శ్రేష్టులని, ప్రళయ దినాన విశ్వాసి కర్మల త్రాసులో ఉత్తమ నడవడి కన్నా బరువైన, విలువైన వస్తువు మరొకటి ఉండదని ' అన్నారాయన. ప్రజల్ని ఎక్కువగా స్వర్గానికి తీసుకుపోయే కర్మలు : దైవభీతి, నైతిక విలువలే ' అని ఉపదేశించారు. కనుక నిత్య జీవితంలో అనైతికతకు, అక్రమాలకు,అమానవీయతకు తావులేకుండా సాధ్యమైనంత వరకు, శక్తివంచన లేకుండా విలువలతో కూడిన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే సమాజంలో ఆదరణ, గౌరవం లభిస్తాయి. దేవుడు కూడా మెచ్చుకుంటాడు. మంచి ప్రతి ఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. -


యండి. ఉస్మాన్ ఖాన్