వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. సముద్ధరిస్తామని విధాన కర్తలు ఏమేమి ప్రకటిస్తున్నా రైతులకు అందుతున్న సాయం అంతంత మాత్రమే. కేంద్రం ఇటీవల వివిధ పంటలకు కనీస మద్దతు ధరను 10 శాతం మేర పెంచి ఎంతో మేలు చేస్తున్నట్లు చాటుకొంది. దీనితోపాటు పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నా మని, 2022కల్లా రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలన్న లక్ష్య సాధనలో ఇవి అంతర్భాగాలని వివరించింది. ప్రభుత్వానికి చెందిన కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) ఇటీవల ప్రచురించిన నివేదికను చూస్తే గత రెండేళ్లలో రైతు ఆదాయాలు పెరగడం మాట అటుంచి తరిగిపోతున్నాయని తేలుతుంది. రైతు కుటుంబాల వినియోగ వ్యయం పడిపోతోంది. 2011-12 మొదలుకొని 2015-16 వరకు రాష్ట్రాల వారీగా, పంటల వారీగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాధించిన ధరలు ఉత్పత్తి విలువ శీర్షికతో సీఎఓ నివేదికను వెలువరించింది. వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుండగా ఆదాయాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం తీసుకున్న చర్యలు తాత్కాలిక ఉపశమనం కలిగించేవే తప్ప రైతులను ఉద్దరించేవి కావని సీఎఓ నివేదిక బట్టి స్పష్టమవుతోంది. వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు సంస్థలు, మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలివేయకుండా ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సీఎఓ నివేదిక ప్రకారం 2014-16 మధ్య కాలంలో పంటల ధరల పతనం మొదలై ఇప్పటికీ కొనసాగుతోంది. 2011-12తో పోలిస్తే ఈ పతనం చాలా తీవ్రంగా ఉంది. 2014-15 ధరలతో పోల్చినా 2015-16లో ధరల తగ్గుదల ఎక్కువే. అనుబంధ కార్యకలాపాలను మినహాయిస్తే వ్యవసాయంలో నష్టాలు రూ. 53,987.26 కోట్లుగా నివేదిక గణించింది. 2015-16లో గోధుమ, పండ్లు కూరగాయల ధరలు పెరగబట్టి కానీ, లేకుంటే ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉండేది. పశువులు, చేపల పెంపకం తదితర అనుబంధ కార్యకలాపాల వల్ల ఎక్కువ ఆదాయం రావడం అక్కరకొచ్చింది. 2015-16లో అదనపు విలువ సమకూర్చిన ఉత్పత్తులు పాలు (రూ. 68,921 కోట్లు), మాంసం (రూ.31,434 కోట్లు), గుడ్లు (రూ.2,917 కోట్లు), చేపలు (రూ.26,675 కోట్లు). వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాలతోపాటు పప్పుగింజల సాగు విస్తీర్ణం కానీ, దిగుబడి కానీ పెద్దగా పెరగలేదు. అయినా పంటల విలువ తగ్గిపోవడం గమనించాల్సిన అంశం. మరోవైపు హెక్టారుకు, క్వింటాకు ఎరువులు, విత్తనాలు తదితరాల ఖర్చు మాత్రం పెరిగిపోయింది. వ్యవసాయ ఖర్చులు, జీవన వ్యయం పెరుగుతున్న మేరకు పంట | ధరలు పెరగడం లేదు. ఫలితంగా ఆదాయాలు పడితున్నాయి. గ్రామీణ, పట్టణ కుటుంబాలు పిల్లల చదువుసంధ్యలపై ఏటా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ, ఆ మేరకు ఆదాయాలు పెరగడం లేదు. పంటల విలువ పెరిగినప్పుడు గ్రామీణుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది యావత్ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో ఉరికిస్తుంది. లేదంటే అది తన సత్తాకు తగిన వృద్ధి రేట్లను సాధించ జాలదు. ప్రస్తుతం అత్యధిక గ్రామీణులకు వ్యవసాయం తప్ప ఇతర అనుబంధ కార్యకలాపాల్లో రాబడి వచ్చే అవకాశం లేదు. ఏతావతా సరైన జీవనోపాధి లేక ఆదాయాలూ పెరగక జనం అప్పుల మీదనే బతుకు బండి నెట్టుకుపోవాల్సి వస్తోంది. నేడు అత్యధిక చిన్న, సన్నకారు, మధ్యతరహా రైతులు రుణగ్రస్తుల య్యారనేది చేదు వాస్తవం. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉండటంతో అటు కోరలు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రాలు కానీ రైతు సమస్యలకు తమకు తాముగా సంపూర్ణ పరిష్కారం చూపగల పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఉపశమన చర్యలతో సరిపెట్టేస్తున్నాయి. వ్యవసాయ రంగాన్ని ఉద్దరించాలంటే భారీ పెట్టుబడులు కావాలి. కానీ సేద్యం ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రం స్వతంత్రించి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఆ స్తోమత ఎటూ లేదు. ఈ పరిస్థితిలో 2022కల్లా రైతు ఆదాయాలను కేంద్రం ఎలా రెట్టింపు చేయనుందో అర్థం కావడం లేదు. కేంద్రం ఎంత సేపటికీ మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తుందే తప్ప భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేయడం లేదు. ఆహార ధాన్యాలను వదలి ఇతర రకాల పంటలు పండించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రైతుల ఆదాయాలు పెరుగుతాయి. అంతేతప్ప పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం దేశమంతటా పనిచేయదని గ్రహించాలి. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై అతిగా ఆధారపడటమూ మంచిది కాదు. ఉదాహరణకు చేపల పెంపకాన్ని విరివిగా ప్రోత్సహిస్తే నీటి వినియోగమూ | విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా వ్యవసాయానికి సాగునీటి కొరత ఏర్పడుతుంది. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు ప్రోత్సహించడం వల్ల స్వల్పకాలంలో ఆదాయాలు పెరిగినా పలు కారణాల వల్ల దీర్ఘకాలంలో పరిస్థితి వేరుగా ఉండవచ్చు. ఉదాహరణకు పట్టణాలు విస్తరిస్తున్న కొద్దీ పాలకు గిరాకీ పెరిగే మాట నిజమే. అయినా మహారాష్ట్రలో ఇటీవల పాలు, కూరగాయల ఉత్పత్తిదారులు ఆందోళనకు దిగడం చూస్తే అంతా మనం అనుకున్నట్లు జరగదని అర్థమవుతుంది. సరైన ప్రణాళిక లేకుంటే అనుబంధ కార్యకలాపాల వల్ల అనుకోని నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి విధానకర్తలు వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల గురించి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర కార్యాచరణ చేపట్టాలి..
సంక్షోభంలో వ్యవసాయం