పంచ వర్ష ప్రణాళికా రూపశిల్పి నెహ్రూ

- (నిన్నటి సంచిక తరువాయి) అణు విస్పోటనం వల్ల మానవ జాతికి కలిగే ఫలితాల తొలి అధ్యయనాన్ని ప్రారంభించి, తాను “వినాశకర భయానక యంత్రాలు” గా పిలిచే, వాటి నిరోధానికి నిరంతరం దండెత్తారు. అణు అస్త్రాల పోటీ వల్ల దారితీసే అతి-సైనికీకరణ అభివృద్ధి చెండుతున్న దేశాలైన, తన దేశం వంటివి భరించలేనిదిగా భావించడం, ఆయన అణునిరాయుధీకరణకు వ్యతిరేకంగా ఉండడానికి ప్రధాన కారణం . భారత దేశ మొదటి ప్రధానమంత్రి మరియు విదేశాంగమంత్రిగా, జవహర్లాల్ నెహ్రూ నవ భారత ప్రభుత్వ విధానాలను, రాజకీయ సంస్క ృతిని మరియు శక్తివంతమైన విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర వహించారు. సార్వత్రిక ప్రాథమిక విద్యా పధకాన్ని ప్రారంభించి, దేశంలోని మారుమూల గ్రామీణ బాలలకు విద్య అందించే బృహత్తర కృషి చేసారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలైన అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మరియుఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్లు అభివృద్ధి చేసిన ఘనత నెహ్రూ విద్యా విధానానిదే. భారతదేశ ప్రత్యేక జాతుల, అల్ప సంఖ్యాక వర్గాల, స్త్రీల, షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యుల్డ్ తెగలకు సమాన అవకాశాలు మరియు హక్కులు కల్పించేందుకు విస్తృతమైన విధానాన్ని రూపొందించి స్థిరమైన చర్యలను నెహ్రూ చేపట్టారు. సమానత్వాన్ని నెలకొల్పాలనే నెహ్రూ ఆకాంక్ష, ఆయన స్త్రీలు మరియు అణగారిన వర్గాల కొరకు ప్రభుత్వ పథకాలు విస్తృతంగా రూపొందించి, వాటి అమలుకు ప్రయత్నించేలా చేసింది,కాని అవి ఆయన జీవిత కాలంలో పరిమితంగానే విజయవంతమయ్యాయి. ఈ శేర్వాని ధారణను నెహ్రూ వ్యక్తి గతంగా ఇష్ట పడడం దానిని ఉత్తర భారతదేశంలో నేటికి కూడా ప్రత్యేక సందర్భ వస్త్ర ధారణగా నిలిపింది. ఒక రకమైన టోపీకి ఆయన పేరును ఇవ్వడంతో పాటు, ఆయన ప్రాధాన్యతనిచ్చిన కోటుకు కూడా నెహ్రూ కోటు అనే పేరునిచ్చి గౌరవిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వరంగ సంస్థలు, జ్ఞాపక చిహ్నాలు నెహ్రూ స్మృతికి అంకితం ఇవ్వబడ్డాయి. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలలో ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ముంబై నగరానికి దగ్గరలో నున్న జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ భారీ సరుకు రవాణాకు, రాకపోకలకు అనువుగా నిర్మించ బడిన ఆధునికమైన పోర్ట్ మరియు డాక్. ఢిల్లీ లోని నెహ్రూ నివాసము నెహ్రూ జ్ఞాపకార్థ మ్యూజియం మరియు గ్రంధాలయంగా సంరక్షించ బడుతోంది. నెహ్రూ కుటుంబ భవనాలైన ఆనంద్ భవన్ మరియు స్వరాజ్ భవన్లు నెహ్రూ జ్ఞాపకార్ధం మరియు కుటుంబ వారసత్వంగా కాపాడబడుతున్నాయి. 1951 లో ఆయన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీసు కమిటీ ద్వారా నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించ బడ్డారు. ప్రధానిగా ఉన్న కాలంలోనే స్టీలు పరిశ్రమలు, పెద్ద పెద్ద కర్మాగారాలు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణాలు జరిపి, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన “ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి.) లు, పరిశోధన సంస్థలు” ఏర్పాటుకు తీవ్ర కృషి చేసి. యు.ఎస్. మరియు యు.ఎస్.ఎస్.ఆర్.లు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో భారత దేశాన్ని తమ మిత్ర దేశంగా చేసుకోవడానికి పడ్డ పోటీనుంచి తెలివిగా బయటకు తెప్పించి, అలీన విధానాన్ని ప్రతిపాదించి, యు.ఎస్.మరియు యు.ఎస్.ఎస్.ఆర్. దేశాల నాయకత్వంలో ఉన్న వ్యతిరేక కూటముల మధ్య, తటస్థ వైఖరి అవలంబించే దేశాలతో అలీనోద్యమాన్ని స్థాపించిదాని మూలధన ఏర్పాటుకు సహకారం అందించి అఖండ భారతాన్ని ప్రగతి పథంలో నడిపించిన ధీరోదాత్తుడు ,ఆధునిక భారత అభివృద్ధి మాంత్రికుడు . మే 27 వ తేది 1964వ సంవత్సరంలో పండిట్ నెహ్రూ భౌతికంగా మనకు దూరమయ్యారు. హిందూమత కర్మల ననుసరించి యమునా నది ఒడ్డున గల శాంతివన్లో నెహ్రూ అంత్య క్రియలు జరుప బడ్డాయి, వందల వేల మంది సంతాపం ప్రకటించడానికి ఢిల్లీ వీధులలో మరియు అంత్యక్రియా స్థలం వద్ద గుమికూడారు. ఆయన దేశాభివృద్ధికి పడిన శ్రమ, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్ర శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ను అగ్రస్థానానికి చేర్చాలన్న ఆయన అభిలాష, దేశం కోసం యావదాస్తిని కర్పూరంలా అర్పించిన ఆయన నిస్వార్ధత ఇవన్నీ ఆయనను భారతీయుల గుండెల్లో చిరకాలం కొలువుండేలా చేశాయి.


కాళంరాజు వేణుగోపాల్ పెద్ద నాగులవరం


మార్కాపురం ప్రకాశం జిల్లా 8106204412