ప్రజలకు దక్కని ఆహార హకు)

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో నేటికీ అభాగ్యులు, అన్నార్తుల ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. కడుపు నింపుకోవడానికి పట్టెడు మెతుకులు సైతం కరవై 'అన్నమో రామచంద్రా' అంటూ దీనంగా ఎదురుచూసే బతుకులకు ఆహార భద్రత చట్టం ఎండమావిగానే మిగులుతోంది. దేశంలో ఆహార భద్రత చట్టం అమలు తీరుతెన్నులను సమీక్షించిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిష్కియాపరత్వంపై ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితులకు అద్దం పడుతోంది. జాతీయ ఆహారభద్రత చట్టం అమలులో భాగంగా ఏర్పాటైన హరియాణా రాష్ట్ర ఆహార సంఘం కనీస మౌలిక సదుపాయాలను ఏర్పరచుకోవడంలో విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం అమలులోకి తెచ్చిన సంక్షేమ చట్టంపట్ల తన బాధ్యతలు విస్మరించింది. కాలయాపన చేస్తూ నిర్లిప్తంగా ఉండిపోయింది. ఈ వైనంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించి మందలించడం- పేదల ఆకలి కేకలపై మిగిలిన రాష్ట్రాలూ తీరు మార్చుకోవాల్సిన అవసరాల్ని తెలియజెబుతోంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న కోట్లాది పేదల ఆకలి బాధలు తీర్చడానికి ఉద్దేశించిన జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయడంలో కొన్ని రాష్ట్రాలు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయనీ న్యాయస్థానం ఆక్షేపించింది. ఆ తీర్పులో రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తావనా ఉండటం గమనార్హం. వీటితోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఝార్ఖండ్, బిహార్, ఛత్తీస్ గఢ్ గ్లూ ఉన్నాయి. రాజ్యాంగంలోని 256 అధికరణాన్నీ న్యాయస్థానం ప్రస్తావించింది. పార్లమెంటు రూపొందించిన శాసనాల అమలుపై రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించే విషయంలో వెనకంజ వేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్య భావన, సమన్వయస్ఫూర్తి ఆవశ్యకతను ఇది వెల్లడిస్తోంది. పార్లమెంటు రూపొందించిన చట్టాలను అమలు చేయడంలో రాష్ట్రాలు కాని, కేంద్రపాలిత ప్రాంతాలు కాని విఫలమైనప్పుడు కేంద్రం తగిన చర్యలకు ఉపక్రమించాలి. అలా కానిపక్షంలో ప్రజల సమస్యలకు పరిష్కారం లభించే మార్గమేమిటన్న విషయాన్ని కేంద్రం ఆలోచించాలి. ఎంత సమున్నత ఆశయంతో రూపొందించిన సంక్షేమ పథకమైనప్పటికీ, దాన్ని అమలు చేయనట్లయితే ప్రయోజనం నెరవేరదు. న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, పౌర సరఫరాల మంత్రిత్వశాఖలకు సూచించినప్పటికీ స్పందన లేకపోయింది. దాంతో ఆహార భద్రత చట్టం అమలుకు నిబంధనలు రూపొందించి, ఫిర్యాదుల పరిష్కారానికి స్వతంత్ర అధికారాలున్న యంత్రాంగాన్ని ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాజాగా ఆదేశించింది. రాష్ట్రాలు సైతం ఏడాదిలోగా యంత్రాంగాలను ఏర్పాటుచేసి తీరాలని న్యాయస్థానం ఆదేశించింది. దరిమిలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత హడావుడి పడుతున్నాయి. దీని ఫలితంగానైనా ఆహార భద్రత కల సాకారమవుతుందా అన్నది చూడాలి.దేశంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్, ప్రజాపంపిణీ వ్యవస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకుతెస్తూ 2013లో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలులోకి తెచ్చారు. దాని ప్రకారం కిలో మూడు రూపాయల చొప్పున అయిదు కేజీల బియ్యం ; రెండు రూపాయలకు గోధుమలు, రూపాయికి చిరుధాన్యాలైన జొన్న, మొక్కజొన్నలు అందజేస్తారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో లబ్దిదారులైన కుటుంబ సభ్యులందరికీ ఇది వర్తిస్తుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నారులకు రోజూ ఉచితంగా చిరుధాన్యాలు అందిస్తారు. ఈ బిల్లును 2011లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ, 2013 జులైలో రాష్ట్రపతి అత్యవసరాదేశం(ఆర్డినెన్సు) రూపంలో సెప్టెంబరు 12 నుంచి అమలులోకి వచ్చింది. చట్టం అమలుకు 2014 అక్టోబరు వరకు రాష్ట్రాలకు కేంద్రం గడువు విధించింది. కేవలం 11 రాష్ట్రాల్లోనే అది అమలులోకి వచ్చింది. నేడు దేశంలోని 75 శాతం గ్రామీణులకు, 50 శాతం పట్టణ జనాభాకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలే ఆసరాగా ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంటల సాగు విస్తీర్ణం దిగుబడులు పెరగకపోవడంతో ఆహారపంపిణీలో వ్యత్యాసాలు తలెత్తుతున్నాయి. ఆహారధాన్యాల అందుబాటు అనేది కుటుంబం నివసిస్తున్న స్థానిక మార్కెట్ ధరలకు అనుగుణంగా కొనుగోలు చేసే సామర్థ్యం మీద, చాలినన్ని ధాన్యాలు పండించుకునేంత భూమి, ఇతర సేద్యపు వనరుల మీద ఆధారపడి ఉంటుంది. ఆకలికి, పౌష్టికాహార లోపానికి కారణం, ఆహార కొరత మాత్రమే కాదు... పేదరికం వల్ల దాన్ని పొందలేని స్థితి కూడా అని ఐక్యరాజ్య సమితికి చెందిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కుల సంఘం స్పష్టీకరిస్తోంది! ఆహారధాన్యాల ఉత్పత్తిని వర్షపాతం, ఉష్ణోగ్రతల్లోని వ్యత్యాసాలు ప్రభావితం చేస్తుంటాయి. అననుకూల పరిస్థితుల్లో పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వర్షాభావం వల్ల నేలలు ఎడారులుగా మారుతున్నాయి. లవణీయత పెరుగుతోంది. అవి క్రమక్షయానికి గురవుతున్నాయి. పట్టణీకరణ వల్ల వ్యవసాయ భూములు నిరుపయోగంగా పడిఉంటున్నాయి. మరోవైపు సాగునీటి కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. భారత్ సహా అనేక దేశాలను ఆహారం అందుబాటు, సరఫరా సమస్యలు తరుముతున్నాయి. భూగర్భ జలాలను విపరీతంగా తోడివేయడం సరికొత్త సమస్యలకు ఆజ్యం పోస్తోంది. చైనా, అమెరికా అఫ్ఘానిస్థాన్, ఇరాన్ తదితర దేశాల్లోనూ దాదాపు ఇదే దుస్థితి తాండవిస్తోంది. అల్జీరియా, ఈజిప్ట్, ఇరాన్, మెక్సికో దేశాలూ నీటి ఎద్దడి కారణంగా ఆహార ధాన్యాలను అధికంగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.