నవయుగ వైతాళికుడు గురజాడ

“దేశమును ప్రేమించుకున్నా దేశమును ప్రేమించు మనా మంచి యన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవోయ్” ఈ గేయం వినగానే మనకు గుర్తుకు వచ్చే పేరు గురజాడ అప్పారావు. 1910 లో గురజాడ రాసిన ఈ గేయం ఇప్పటికీ కూడా ప్రజల నాల్కలపై తిరుగుతుంది. దేశ భక్తిని ఇంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పిన మరొక కవి లేడంటే అతిశయోక్తి కాదు. సమాజంలో మనుషులు మెలగవల్సిన విధానాన్ని ఈ గేయం తెలియజేస్తుంది. ప్రజలలో దేశభక్తిని పెంపొందించేలా సందేశాత్మకంగా రాసిన గేయం ఇది. దేశమంటే కేవలం మట్టి మాత్రమే కాదని దేశమంటే మనుషులని దేశభక్తికి సరియైన నిర్వచనం ఇచ్చిన మహా మేధావి గురజాడ. యువతలో దేశభక్తిని రగిల్చిన కలం యోధుడు గురజాడ. ఇది ఏ కాలానికైనా చక్కని సందేశం ఇచ్చే గీతం ఇది. అందుకే గురజాడ దేశభక్తి గీతం సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతం అని “శ్రీ శ్రీ” అన్నారు. గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 న విశాఖపట్నం జిల్లా రాయవరం గ్రామంలో వెంకటరామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. మెట్రిక్యూలేషన్ చదువుతుండగానే గురజాడలో కవిత్వ శక్తి వికసించింది. 'కన్యాశుల్కం' నాటకం ఆయనకు విపరీతమైన పేరును తెచ్చింది. తెలుగు కవిత్వ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన 'ముత్యాల సరాలు'ను రాశాడు. ఇది గురజాడ లోని వైజ్ఞానిక దృక్పధాన్ని వ్యక్తీకరిస్తుంది. సామాజిక జీవితాన్ని శాస్త్రీయ కోణంలో ఆలోచించిన గొప్ప రచయిత ఆయన. ఆధునిక కవిత్వానికి నూతన ఒరవడి చుట్టిన యుగకర్త గురజాడ. వ్యావహారిక భాషను సాహిత్యంలో ప్రవేశపెట్టిన రుగు భాషకు వెల ఉద్యమశీలి అతడు. వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు తన సహాధ్యాయి, మిత్రుడు అయిన గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి తెలుగు భాషకు వెలుగు జాడగా నిలిచాడు. . “మతములన్నియు మాసిపోవును జ్ఞాన మొక్కటి నిలిచి వెలుగును అంత స్వర్గ సుఖంబులన్నవి యవని విలసిల్లున్" భవిష్యత్ లో మతములు, కులాలు నశిస్తాయని జ్ఞానం మాత్రమే చిరకాలం నిలిచి ఉంటుందని ఆశించాడు గురుజాడ. కులం వల్లనో, మతం వల్లనో ఏ మనిషి మరొక మనిషికి లోకువ కాకూడదు అంటారు గురజాడ. తన రచనల ద్వారా వర్ణ వ్యవస్థను నిరసించాడు. మంచి చెడ్డల ప్రాతిపదికగా మనుషులలో రెండే కులాలు ఉన్నాయన్నారు. “మంచి యన్నది మాలతే మాలనే అగుదన్" అని మంచి వైపు నిలబడటానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. మానవుడే మాధవుడు అని నమ్మిన మానవతావాది, హేతువాది గురజాడ అప్పారావు. పూర్ణమ్మ కవితలో డబ్బు మానవ సంబంధాలను ఎంతకు దిగజారుస్తుందో చక్కగా తెలియచేశారు. “కాసుకు లోనై తల్లి తండ్రీ నెనరూ న్యాయం విడనాడి” పుత్తడి బొమ్మ పూర్ణమ్మను డబ్బులకు ఆశపడి కూతురు అని కూడ చూడకుండా ఒక ముసలి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పూర్ణమ్మ ఒక కరుణ రసాత్మకమైన గేయం. ఇది చదివితే కళ్ళు చెమ్మగిల్లుతాయి. 'కన్యక'లో స్త్రీల మీద పెత్తనం చేసే రాజుల దురహంకారాన్ని ప్రశ్నిస్తాడు గురజాడ. ఆత్మ గౌరవానికి ప్రాధాన్యతను ఇచ్చి ఆత్మ త్యాగానికి సిద్ధపడ్డ కన్యక ఆత్మ గౌరవానికి ప్రాధాన్యతను ఇచ్చి ఆత్మ త్యాగానికి సిద్ధపడ్డ కన్యక ముందు రాజు గర్వం మంటగలిసి పోతుంది. - తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాటకం కన్యాశుల్కం. 1892లో మొదటిసారి కన్యాశు ల్కం ప్రదర్శన చేశారు. ఇందులో ఆడవాళ్ళ అధోగతికి కారణమైన సామాజిక స్థితిగతులను ప్రస్తావించారు. వాడుక భాషను ఉపయోగించి వ్యవస్థలోని యజమాని వేశ్య వృత్తి వంటి ప్రవర్తనను నాటకంలో నాటక ప్రదర్శన చేసి సాహిత్యం ద్వారా సామాజిక పరివర్తనకు కృషి చేసిన మహాకవి గురజాడ. పితృస్వామ్య కుటుంబ వ్యవస్థలోని యజమాని అహంకారపూరిత ప్రవర్తనను నాటకంలో చూపించాడు. కన్యాశుల్కము, వేశ్య వృత్తి వంటి దూరాచారాలపై విమర్శే ఈ నాటకానికి ప్రధాన కథా వస్తువు. కన్యాశుల్కం నాటకం రాసి వంద సంవత్సరాలు దాటిన ఇందులోని గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలగు పాత్రలు ఇంకా ప్రజల మదిలోన మెదులుతూనే ఉన్నాయి. కన్యాశుల్కం నాటకం కన్నడం, తమిళం, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ మొదలగు భాషల్లోకి అనువావాదం చేయబడింది. గురజాడ రచనలు ఎక్కువగా స్త్రీల సమస్వల చుట్టే తిరిగాయి. సాంఘిక దూరాచారాలను, మూఢ విశ్వాసాలను, వర్ణ వ్యవస్థను, వేశ్యావృత్తి, బాల్య వివాహాలు మొదలగు వాటిని తన రచనల ద్వారా తీవ్రంగా ఖండించిన అభ్యుదయ కవి గురజాడ. స్త్రీలకు ప్రశ్నించే తత్వాన్ని గురజాడ రచనలు నేర్పాయి. సారంగధర, కొండుబట్టీయం, బిల్హణీయం, నీలగిరి పాటలు, సుభద్ర, లవణ రాజు కల, కాసులు, సత్యవతీ శతకం, మీ పేరేమిటి, దిద్దుబాటు, మెటియో, సంస్కర్త హృదయం, మతము- విమతము మొదలగు రచనల ద్వారా సాహిత్యాన్ని సంఘ సంస్కరణకు ఉపయోగించిన కవి శేఖరుడు గురజాడ అప్పారావు. అనారోగ్యం కారణంగా గురజాడ 1915 నవంబర్ 30 న తుదిశ్వాస విడిచారు. తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడది ఒక ప్రత్యేక యుగం. తెలుగు భాషాభిమానులకు, సాహితీవేత్తలకు గురజాడ అడుగుజాడలు అనుసరణీయం. 'గురజాడ 1915లో చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు” అని 'దేవులపల్లి కృష్ణ శాస్త్రి' అన్నాడు. గురజాడ తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయుడు. అభ్యుదయ భావాలు కి అభ్యుదయ భావాలు కలిగిన కవులకు, రచయితలకు మార్గదర్శి , తెలుగు రచనా రంగంలో తనదైన ముద్ర వేసిన నవయుగ వైతాళికుడు గురజాడ.


కందుకూరి భాస్కర్ 9703487088