మనిషి - మానవత్వం

ఈనాటి మానవుడు విద్యా, విజ్ఞానాల పరంగా ఎంత ప్రగతి సాధించినా , నైతిక, సామాజిక, ఆధ్యాత్మికతల పరంగా తిరోగమనంలోనే పయనిస్తున్నాడు. నేడు సమాజంలో శాంతి, సామరస్యం, మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయి. ఎటుచూసినా అశాంతి, అలజడులు, అభద్రతాభావం, అమానవీయం తాండవ మాడుతున్నాయి. మనిషి మనిషిని చంపడం, చాలామంది కలిసి ఒక్కరిని కడతేర్చడం సర్వసామాన్యమైంది. సంకుచిత మనస్తత్వం, కులతత్వం, మతోన్మాదం, మూకోన్మాదం దేశంలో పెచ్చరిల్లుతోంది. మంచి, మానవత్వం, మానవీయ విలువలు మంటకలిసి పోతున్నాయి. నిజానికి మానవత్వానికి మించిన ధర్మం మరొకటి లేదు. మానవత్వాన్ని మంటగలుపుతూ, ధర్మాన్ని రక్షిస్తున్నామనుకోవడం కంటే మూరత్వం మరొకటి లేదు. దేవుని పేరుతో దానవత్వం మానవతకు వ్యతిరేకం. భువిపై మానవ ఉనికి మానవత్వాన్ని కాపాడడానికేనని ధర్మం చెబుతోంది. మానవీయ విలువల కోసం పాటుబడే వారికి ప్రతిఫలం ప్రసాదించే దైవం, మానవత్వాన్ని ఖూనీ చేసేవారిని ఊరికే వదలడు. ఎప్పుడైతే మానవుడు సాటిమనిషి గురించి ఆలోచించడం, అతని యోగక్షేమాలు పట్టించుకోవడం, సత్సంబంధాలు నెరపడం మానేశాడో అప్పుడే సమాజం పెడద్రోవ పట్టింది. మానవ హృదయంలో అతి పవిత్రంగా ఉండవలసిన మానవత్వానికి తుప్పు పట్టింది. ఆ హృదయంలో స్వార్ధం పురుడు పోసుకొని ఉన్మాద లక్షణాలు ప్రస్పుటమయ్యాయి. తత్ఫలితంగా మానవ సమాజంలో అనేక అవ లక్షణాలు చోటుచేసుకున్నాయి. శాంతి భద్రతలు కరువై పొయ్యాయి. న్యాయం ప్రియమైపోయింది. కులతత్వం పెచ్చరిల్లింది. మతోన్మాదం పడగవిప్పిం ది. తీవ్రవాదం, ఉగ్రవాదం జూలు విదిల్చాయి. మతం, మానవతావాదం మంటగలిశాయి. శాంతి, సామరస్యం, సహజీవనం, ప్రేమ, మానవీయతలకు విఘాతం కలిగింది. నిజానికి మత విశ్వాసం మాన వులు శాంతియుతంగా, సామరస్యంతో సహజీవనం చేయడానికి దోహదపడాలి. మనుషుల మధ్య విద్వేషాలు సృష్టించడానికి అది సాధనం కాకూడదు. భిన్నత్వంలో ఏకత్వం గల మనదేశంలో సర్వమానవ సహిష్ణుతాభావం, పరస్పర సదవగాహన, సద్భావన జన సామాన్యంలో అంతర్వాహినిలా ప్రవహించాలి. సహనం, సంయమనం, సహజీవనం లాంటి సుగుణాలు జనించాలి. కులమతాలు వేరైనా మానవత రిత్యా మనదంతా పరస్పరం రక్త సంబంధమన్న పచ్చినిజాన్ని గుర్తించాలి. ఒకరినొకరు, ఒకరి మతాన్నొకరు గౌరవించుకుంటే మనుషులమధ్య, మనసుల మధ్య దూరాలు, వైరాలు తగ్గి మతసామరస్యం వెల్లివిరుస్తుంది. శాంతి, మానవీయత పరిఢవిల్లుతాయి. విశ్వమానవ సౌభ్రాతృత్వం ఆవిష్కృతమవుతుంది. సంఘ శ్రేయోభిలాషులు, ఆధ్యాత్మిక పెద్దలు, సామాజిక కార్యకర్తలు, మంచిని, శాంతిని, మానవతను కాంక్షించే ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నిలిచి , కలిసి కృషి చేయడం ఈనాటి తక్షణ అవసరం. -


యండి. ఉస్మాన్ ఖాన్ సీనియర్ జర్నలిస్టు