అభివృద్ధికి దూరంగా గిరిజనం

(నిన్నటి సంచిక తరువాయి) ఈ అయిదేళ్లలో హక్కులు గుర్తించడానికి క్షేత్రస్థాయి కమిటీలను నియమించకపోవడం తో తెలుగు రాష్ట్రాల్లో అటవీ హక్కుల అమలు ప్రక్రియ అగమ్యగోచరంగా మారింది. సిఫార్సులపై ఉదాసీనత జాతీయ స్థాయిలో గిరిజనుల అభివృద్ధికి నేటికీ ఓ సమగ్ర జాతీయ విధానం అమలు లోకి రాకపోవడం విచారకరం. యూపీఏ ప్రభుత్వం 2006లో జాతీయ గిరిజన విధాన ముసాయిదాను రూపొందించింది. ఆ విధానంపై దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో అభిప్రాయాలనూ సేకరించారు. తరవాత 2013లో కేంద్ర ప్రభుత్వం గిరిజనుల ఆర్థిక, సామాజిక, విద్య, ఆరోగ్య స్థితిగతులను అధ్యయనం చేసి ప్రత్యేక జాతీయ గిరిజన అభివృద్ధి విధానం తీసుకొచ్చేందుకు ప్రొఫెసర్ వర్గీనియస్ ఖాకా నేత ృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. గిరిజనులు అనుభవిస్తున్న దుర్భర స్థితిగతులను వెల్లడిస్తూ ఆ కమిటీ సమగ్ర నివేదికను 2014లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. తరవాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం సదరు నివేదికను పక్కన పెట్టి, సమగ్ర జాతీయ విధానం అమలు విషయాన్ని పూర్తిగా విస్మరించింది. గిరిజనులను ఓటు బ్యాంకుగా చూసే ధోరణిని ప్రభుత్వాలు విడిచి పెట్టాలి. నిస్సహాయ గిరిజన సమూహాలు (వీవీజీటీ)గా గుర్తించిన 75 గిరిజన తెగల స్థితిగతులు, అవసరాలు, అభివృద్ధిపై దృష్టి సారించాలి. దేశంలో గిరిజనులు సేకరించే వెదురు, తేనె, ఔషధ మొక్కలు వంటి అనేక వ్యవసాయ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల మొత్తం విపణి విలువ సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ క్రయ విక్రయాలు, ఎగుమతుల్లో మధ్య దళారులు, వాణిజ్య సంస్థలతో పోలిస్తే గిరిజనులు సంపాదించేది నామమాత్రమే! గిరిజన సహకార మార్కెటింగ్ వ్యవస్థలను ఎక్కడికక్కడ బలోపేతం చేయాలి. ఆ వ్యవస్థలు తయారు చేసిన ఉత్పత్తులను స్థానికంగానే 'ప్రాసెస్' చేసి బయట మార్కెట్‌కు విక్రయించే విధానాలను అందిపుచ్చుకోవాలి. గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో 'పెసా' చట్టం నిర్దేశించిన గ్రామసభలనూ భాగస్వాములను చేయాలి. గిరిజన ప్రాంతాల్లో అవసరాలను గ్రామసభల ద్వారా గుర్తించి ప్రాధాన్య క్రమంలో మౌలిక వసతులను కల్పించాలి. గ్రామసభలను బలోపేతం చేయడం ద్వారానే గిరిజనులను ఆర్థికంగా, రాజకీయంగా సాధికారత బాట పట్టించవచ్చు. గిరిజన ప్రాంతాల భౌగోళిక, సామాజిక, సంప్రదాయ సంక్లిష్టతలతో నిమిత్తం లేకుండా అభివృద్ధి నమూనాలను అమలు చేస్తూపోతే, వాటివల్ల ప్రయోజనం ఉండదన్న విషయం గుర్తించాలి! -


బళ్ళారి నాగేశ్వర్