స్వామి నిఖార్పైన రాయలసీమ గ్రామీణ రచయిత. కథకుడిగా బయలుదేరి నవలలూ రాస్తూ, విమర్శకుడిగా కూడా ప్రసిద్ది చెందినవాడు. 3 జూన్ 1952లో అనంతపురం పాతవూరిలో పుట్టి పెరిగి అనంతపురం జిల్లాలో సింగల్ టీచర్ స్కూళ్లలో 2010 దాకా వుపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. 1987 నుంచి రచనా వ్యాసంగంలో వున్నాడు. 35 కు పైగా కథలు రాసాడు. వీరగల్లు, అద్దం ( తాత్విక కథలు) వెలువరించాడు. త్వరలో శూద్రపాదం కథాసంపుటి లిఖిత ప్రెస్ వాళ్ళు ప్రచురిస్తున్నారు. నవలాకారుడు గా గద్దలాడుతాండాయి, మీ రాజ్యం మీరేలండీ, రెండు కలల దేశం, శప్తభూమి లాంటి నవలలు రాశాడు. ఈ మధ్య కాలంలో విమర్శకుడిగా కూడా మారి సామాజిక సాహిత్య వ్యాసాలు రాసి పర్ స్పెక్టివ్ వారి ద్వారా పుస్తకంగా తెచ్చాడు. ఈ పుస్తకం ' రాయలసీమ సమాజం - సాహిత్యం' ద్వారా స్వామి రాయలసీమ వుద్యమ కారుడిగా కూడా గుర్తింపు పొందుతున్నాడు. . స్వామి గొప్ప కథకుడు. తన వెనుకబడిన కులానికి సంబంధించిన సాంస్కృతిక అంశాల్ని సృజిస్తూ 'అవశేషం' లాంటి కథ రాసినవాడే రాయలసీమ కరువు పరిస్థితులను యెత్తిపట్టిన 'వానర్యాలా' కథని కూడా రాసాడు. స్వామి కథలలో రాయలసీమ భౌతిక వాస్తవికత చిత్రించే కథలే యెక్కువ. సావుకూడు లాంటి కరువు కథ స్వామి మాత్రమే రాయగల్గింది. కరువు లో మానవసంబంధాలను ఆ కథ వొళ్లు గగుర్పొడిచేలా చిత్రిస్తుంది. స్వామి రాసిన 'నడక' కథ ఫాక్షన్ గ్రామాల్లోకి యెలా నడిచొస్తుందో వివరిస్తుంది. ఆ స్వామి కథలలో రాయలసీమ గ్రామీణ వివక్షలు బలంగా చిత్రింపబడ్డాయి. గ్లోబలైజేషన్ విధ్వంసం సృష్టించే పరిణామాలను 'తెల్ల దయ్యం అను గ్రామ వివక్ష కథ' గా రాసాడు. ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం 'నీళ్లు నీళ్లు అను గ్రామ వివక్ష కథ' రాసాడు. వీటితోపాటు స్త్రీ వాదాన్ని విమర్శిస్తూ, అది అగ్రవర్ణాల వారి పట్టణాల్లో వుండే స్త్రీ వాదమే గానీ పల్లెల్లో వుండే దళిత బహుజన స్త్రీల వాదం కాదని, సాలమ్మ కథా, 'హెచ్. సరస్వతి అను మాదిగ వివక్ష కథ' యిత్యాదివి రాసాడు. ఈ కథలన్నింటిలో స్వామి దళిత బహుజన వుద్యమాలను సమర్థిస్తాడు. కథలతో యెంత ప్రసిద్ధి పొందాడో తను రాసిన నవలలతో కూడా స్వామి అంతే ప్రసిద్ధి పొందాడు. ఆయన రాసిన నవలలన్నీ దళిత బహుజన నవలలే. గద్దలాడుతాండాయి నవల అనంతపురం జిల్లాలో పల్లెలు కరువు వల్ల యెంత నష్టపోతున్నాయో, యెలా వలసలెల్లిపోతున్నాయో మానవ సంబంధాలు యెంత ధ్వంసమైపోతున్నాయో వివరిస్తుంది. మీ రాజ్యం మీరేలండీ నవల నేరుగా బహుజన రాజకీయాలు గురించి చర్చ చేస్తుంది. రెండు కలల దేశం నవల చైతన్య స్రవంతి శిల్పంలో రాయబడింది. ఇందులో రెండు కలలు నక్సలిజం బహుజన వాదాలే. ఇటీవల తానా బహుమతి పొందిన నవల తన శప్తభూమి. శప్తభూమి మరో రకంగా చెప్పాలంటే శపించబడిన భూమి రాయలసీమ నే. ఈ నవలకు మూలకథ బ్రౌన్ పరిష్కరించిన మెకంజీ గొప్ప కైఫయిత్ ఆధారంగా రాయబడిన 'ది అన్నాల్స్ ఆఫ్ హండే అనంతపురం'. పదిహేడో శతాబ్దంలో అనంతపురం కేంద్రంగా హండే రాజాస్ పరిపాలన విశేషాలే యిందులోని కథ. మీ రాజ్యం మీరేలండీ నవల కథ కూడా అనంతపురం చుట్టూనే జరిగింది. స్వామి స్థానిక చరిత్రలో నుంచి కథలను స్వీకరించి వాటిని తన కల్పనా చాతుర్యంతో తీర్చిదిద్దుతాడు. స్వామి లోని సృజన కళగా రూపాంతరం చెందింది. ఆయన ముంది. వాక్యంలో రాయలసీమ గరుకుతనముంటుంది. కథాకథనంలో ద ృశ్యచిత్రీకరణ పాఠకుడిని కట్టిపడేస్తుంది. స్వామి వచనం చదువుతూంటే ఆయన మాట్లాడుతూన్నట్లు వుంటుంది. రాయలసీమ మాండలికం మరీ ముఖ్యంగా అనంతపురం యాస పచ్చి పచ్చిగా కళ్లకు కడుతుంది. ఒక్కొక్కసారి స్వామి కథనంలో మాంత్రికి వాస్తవికత పాఠకుడికి అబ్బురం కలిగిస్తుంది. కథలో నైనా నవలలో నైనా స్వామి వాక్యం తనదైన సంతకంతో కనిపిస్తుంది. ఆ కథలో నైనా నవలలైనా స్వామి రాయలసీమ గ్రామీణవాది. బహుజన సిద్ధాంతవాది. అవసరమైన చోటల్లా కమ్యూనిస్టులలోని డొల్లతనం సహజ లక్షణంగా బట్టబయలుచేస్తుంటాడు. స్వామి మార్మికవాది కూడా. ఆయన నవలలలో మహిమలూ అభూత విషయాలూ విరివిగా వస్తుంటాయి. అయితే సారంగా చూసినప్పుడు స్వామి సమాజంలో అభ్యుదయాన్ని ఆకాంక్షించే రచయిత. అట్టడుగు వర్గాల వారికి మెరుగ్కెన జీవితం కావాలని కోరి రచనలు చేసే వ్యక్తి. 2012 దాక స్వామి కేవలం రచయిత మాత్రమే. ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం ఆయన రాయలసీమ వాదిగా మారాడు. రాయలసీమ యెదుర్కుంటున్న నీటి సరఫరా వివక్ష స్వామి ని వుద్యమ కారుడిగా మార్చింది. రాయలసీమ నీటివాటాలో అన్యాయం జరిగిందని ఆయన వుపన్యాసాలు యిస్తూ వూరూరూ పాదయాత్రలో కూడా పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో నుంచే కొత్త కథలు రాసాడు. శప్తభూమి నవల కూడా రాయలసీమ చారిత్రికంగా యెదుర్కుంటున్న అభద్రతల అన్యాయాల వివక్షల మీదనే రాసాడు. పదిహేడో శతాబ్దంలో రాయలసీమ స్థానిక హండే రాజుల చేతుల్లో నుంచి బ్రిటిష్ వారి చేతుల్లోకి చేరి అప్పటి నుంచి ఇప్పటి వరకు యెంతటి వివక్ష కూ పరాధీనతకు గురైందో శృభూమి నవలలో వివరించాడు. కథ రాసినా నవల రాసినా తన నేల గురించి మాత్రమే రాసాడు. తన మాతృభూమి యెదుర్కుంటున్న అన్యాయాల గురించి కలత చెంది వుద్యమ కారుడిగా మారాడు. రచయిత కార్యకర్త గా కూడా మారడం ఒక గొప్ప పరిణామం. అది అతడి నిబద్దతను సూచిస్తుంది. బహుజన రచయితగా స్వామి, అస్థిత్వ వాదాన్ని మరీముఖ్యంగా ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని కూడా తనదైన శైలిలో ముందుకు తీసుకొని పోతూన్న నిజమైన భూమిపుత్రుడు. -
జి. వెంకటకృష్ణ