హత్యలు, ఆ రోజు అనిషా.. హత్యలు, అత్యాచారాలు, హింస, దుర్మార్గాల పరంపర రోజు రోజుకూ పెరిగిపోతోంది. నిర్భయ... ఆసిఫా.. మానస.. దిశ.. లక్ష్మి... జాబితా చాలా పెద్దది. భువనగిరి జిల్లా హాజీ పూర్ వరుస దురాగతాలకు ఆర్నెల్లు కూడా గడవలేదు. వెలుగులోకి రాని, వార్తలకెక్కని అఘాయిత్యాలు ఇంకెన్నో... రేపు ఇంకెవరి వంతో..! దేశంలో ఇలాంటి దురాగతాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఒక ఘటన మరువకముందే మరో సంఘటన పునరావ ృతమవుతున్నది. డాక్టర్ దిశ అత్యాచారం, హత్యోదంతం దేశాన్ని అతలాకుతలం చేసింది. మానవ సమాజాన్ని తలవంపుల పాలు చేసింది. మానవతకు తూట్లు పొడిచింది. నాగరిక వ్యవస్థకు సవాలు విసిరింది. నవంబర్ 28 వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తన స్కూటీపై బయలు దేరిన డా. దిశ గురువారం తెల్లవారు జాము వేళ కాలిన బూడిదలో ఎముకల కుప్పగా మారింది. ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఉన్నత చదువులు చదివి, యుక్త వయసులోనే పశువైద్యురాలిగా మూగ ప్రాణులకు సేవ చేస్తున్న దిశ అర్ధాంతరంగానే తనువు చాలించింది. దీనికి కారణం ఎవరు ?. ' ఆ నలుగురే " అని యావద్దేశం గర్జించింది. మీడియా కోడై కూసింది. వాళ్ళను నడిరోడ్డుపై నరికి చంపాలని, బహిరంగంగా ఉరి తీయాలని, అంగాంగాలను వేరు చేయాలని అత్యధిక శాతం మంది డిమాండ్ చేస్తున్నారు. నిజమే.. వారు చేసిన నేరం అలాంటిదే.. డిమాండులో సహేతుకత ఉంది. న్యాయం ఉంది. స్వయంగా నిందితుల తల్లులు కూడా అదే మాటన్నారు. డా. దిశ చావుకు ముమ్మాటికీ వారే కారణం. కాని ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ' ఆ నలుగురి ' ని అలా తయారు చేసిన వ్యవస్థ మొదటి ముద్దాయి. ఆ రోజు మద్యాహ్నం నుండి ఆ నలుగురు లారీలు ఆపుకొని అక్కడే మద్యపాన సేవనంలో మునిగి తేలుతున్నట్లు తెలిసింది. మద్యం మత్తుతో పాటు, చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ వారికి కావలసినంత అశ్లీలాన్ని అందించి, కామ మృగాలుగా మారడానికి దోహద పడింది. మద్యం, అశ్లీలం వారిని కామ మృగాలుగా మార్చాయి. అసలే చదువు సంధ్యల్లేక, సరైన పెంపకం లేక అవారాగా, జులాయిల్లా తిరిగే వాళ్ళు పొట్టకూటి కోసం లారీ డ్రైవర్లుగా, క్లీనర్లుగా అవతారమెత్తి, మందు మత్తులో కళ్ళు నెత్తికెక్కిన క్రమంలో రాత్రిపూట ఒంటరి ఆడపిల్ల కంటికి కనిపించే సరికి దుర్మార్గులు ఒళ్ళు మరిచి పొయ్యారు. తాము కూడా ఒక అమ్మ కొడుకులమేనని, తమకూ అక్క చెల్లెళ్ళు, ఆడ పడుచులు ఉన్నారన్న ఇంగితాన్ని గాలికి వదిలారు. నిజం చెప్పాలంటే , పాపం మొదట్లో దిశ వాళ్ళను అమాయకంగా నమ్మింది. సహాయం చేస్తారని అనుకుంది. ఇది ఆమె చేసిన తప్పు. తరువాత అనుమానమొచ్చిన ప్పుడైనా పోలీస్ హెల్ప్ లైన్ కి ఫోన్ చెయ్యాల్సింది. అదీచేయ లేదు. ఫోన్ లో చెల్లెలితో మాట్లాడుతూ భయమేస్తోందన్నప్పుడైనా , చెల్లి సూచన మేరకు జన సంచారం అధికంగా ఉన్న టోల్ గేట్ వైపుకు వెళ్ళిపోతే బాగుండు. కాని అక్కడ అందరూ తననే గుచ్చిగుచ్చి చూస్తారని చెప్పి అటూ వెళ్ళలేదు. పురుష సమాజానికి మహిళల పట్ల ఉన్న అభిప్రాయానికి ఆమె మాటలు అద్దం పడుతున్నాయి. ఆసమయంలో ఆమెకు అసలు ఏమీ అర్థంకాని అయోమయ, భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఆ అనిశ్చితిలోనే ఆమె సరైన నిర్ణయం తీసుకోలేక పోయింది. సగటు ఆడపిల్లగానే ప్రవర్తించింది తప్ప, ఒక విద్యావంతురాలిగా మానసిక స్థిరత్వాన్ని ప్రదర్శించలేక పోయింది. సాయంత్రం ఆరు గంటలు దాటుతున్న సమయంలో యుక్త వయసు ఆడపిల్ల ఒంటరిగా టూ వీలర్ పై బయటికి వెళుతుందన్న విషయాన్ని తల్లి దండ్రులు కూడా సాధారణ విషయంగానే పరిగణించారు తప్ప, మరోలా భావించలేదు.
యండి. ఉస్మాన్‌ఖాన్ సీనియర్ జర్నలిస్టు