అడ్డుకట్ట (నిన్నటి సంచిక తరువాయి) ఇలాంటివన్నీ సినిమాల్లో చూసిన తర్వాత, పేపర్లలో చదివిన తర్వాత, ప్రజలకు అసలు భారత న్యాయస్థానాల్లో ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో? అనే అనుమానం మనసులను తొలిచి వేసే అంశం. అసలు దేశంలో ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయనేదే ఆ సందేహం. ఆ సందేహాన్ని నివృత్తి చేసింది. కేంద్ర న్యాయశాఖ. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ను న్యాయశాఖ విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం దేశంలోని జిల్లా కోర్టులు, కింది కోర్టుల్లో సుమారు 2.91 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయి. అందులో 21.90 లక్షల కేసులు పదేళ్లకు పైగానే పెండింగ్ లో ఉన్నట్టు ఆ రికార్డులు చెబుతున్నాయి. దేశంలోని జిల్లా కోర్టులు, కింది కోర్టుల్లో సుమారు 22లక్షల కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న మాటవాస్తవమేనా? అంటూ అన్నా డీఎంకే ఎంపీ జి.హరి కేంద్ర న్యాయ శాఖను ప్రశ్నించారు. అలాగే, పదేళ్ల కు పైగా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించాల్సిందిగా దేశంలోని 24 హైకోర్టుల చీఫ్ జస్టిస్ లను కేంద్ర ప్రభుత్వం కోరింది వాస్తవమేనా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన న్యాయశాఖపై డేటాను బయట పెట్టింది. కేంద్ర న్యాయశాఖ ఇచ్చిన 'నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్' ప్రకారం అత్యధికంగా (829128) యూపీలో ఎక్కువ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో బీహార్ (320971), మహారాష్ట్ర (236674) నిలిచాయి. అత్యంత తక్కువ కేసులు పెండింగ్ లో ఉన్న రాష్ట్రంగా సిక్కిం రికార్డులకు ఎక్కింది. అక్కడ కేవలం రెండు కేసులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. అంతకంటే ఘనంగా చెప్పాలంటే అండమాన్ నికోబార్ లో అసలు కేసులే పెండింగ్ లో లేవు. దేశంలోని కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం వివిధ ప్రక్రియలను అవలంభిస్తున్నట్టు న్యాయశాఖ పార్లమెంట్ కు తెలిపింది. కోర్టుహాళ్ల సంఖ్య పెంచడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం ద్వారా కేసులను త్వరగా క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.
-పులవర్తి ప్రభు,సీనియర్ జర్నలిస్టు,విజయవాడ