“అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు ఆడ పిల్ల పుట్టాలి”. అనే సూక్తి మాదిరిగానే మనం మరో సెంటిమెంట్ మాటలను కూడా నిత్యం వింటుంటాం. అదేంటంటే...”ఊరి రుణం” మాట. " పుట్టిన ఊరి రుణం తీర్చుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. లేకుంటే నాకెందుకు ఈ రాజకీయాలు. ప్రజా సేవకే నా జీవితం అంకితం. పుట్టిన ఊరికి ఏదో ఉపకారం చేయాలనేదే నా తపన. కోరిక. అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చాను. సేవ చేస్తున్నాను. ఊరిని అభివృద్ధి చేయటమే నా ధ్యేయం”. ఈ మాటలు నిత్యం మనం వింటుంటాం. ఈ ఉద్దేశం మంచిదే. కాదనేది లేదు. స్వాగతించాల్సిందే. కానీ ఈ వాఖ్యలు ఆచరణలో ఎలా ఉన్నాయి ?. చెప్పే మాటలు , చేసే ప్రణాళికలు ఆచరణలోకి వస్తున్నాయా అనేదే పరిశీలించాల్సిన అంశం. ఇదే తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అభివృద్ధి గురించి నిత్యం వళ్లించే మాటలు. ఇందులో భాగంగానే రకరకాల ప్రణాళికలు, పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రణాళికలు, పథకాల అమలు క్షేత్రస్థాయిలో ఎలా అమలు జరుగుతుందో పరిశీలించాల్సిన అవసరం ఉంది. మచ్చుకు కొన్ని అంశాలను పరిశీలించటానికి " కేస్ స్టడీ” గా వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం లోని పెద్దకోడెపాక గ్రామాన్ని పరిశీలిస్తే అభివృద్ధి డొల్లతనం తేటతెల్లం అవుతుంది. ప్రణాళికలు కాగితాల్లో తప్ప ఆచరణలో లేదని తేలిపోతుంది. అయితే ఇక్కడ పెద్దకోడెపాక గ్రామాన్ని పరిశీలించటానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే మాజీ స్పీకర్ దత్తత తీసుకున్న గ్రామం. వందశాతం ఓడిఎఫ్ గా ప్రకటించసడిన గ్రామం. దీనికి తోడు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామం. అభివృద్ధి వైపు చాలా స్పీడుగా దూసుకుపోతున్న గ్రామంగా చెప్పుకుంటున్నా గ్రామం. అందుకోసమే ఈ గ్రామాన్ని " కేస్ స్టడీ” గా పరిశీలిస్తే అభివృద్ధి ఏ మేరకు ఉందో అర్థం అవుతుంది. అరచేతిలో స్వర్గం చూపటం ఎలా ఉంటుందో చూపటానికి ఈ గ్రామం ఉదాహరణగా నిలుస్తుంది. మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం... మూడువేల ఓటర్లు మించని, సుమారు నాలుగున్నర ఐదు వేల జనాభా కలిగిన గ్రామం పెద్దకోడెపాక. ఈ గ్రామం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో ఉన్నప్పటికీ భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలో ఉంది. తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ప్రభుత్వం లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే మదుసుదనాచారి అసెంబ్లీ స్పీకర్ గా ప్రతినిధ్యం వహించారనేది గమనించాల్సిన అంశం. అప్పటి మాజీ స్పీకర్ ఈ పెద్దకోడెపాక గ్రామాన్ని దత్తత గ్రామంగా స్వీకరించిన విషయాన్ని కూడా గమనించాలి. ఇదే నేపధ్యంలో రెండోదఫా అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వం లోనూ ఈ గ్రామం అధికార పార్టీ గ్రామపంచాయతీగానే ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వ పథకాలు, ప్రణాళికల అభివృద్ధి మాటల్లో ఉన్నట్లుగా చేతల్లో లేదనేది గమనించాల్సిన అంశం. 40శాతం కూడా మరుగుదొడ్లు నిర్మాణం కాని ఈ గ్రామాన్ని వందకు వందశాతం ఓడిఎఫ్ గ్రామంగా ప్రకటించుకోవటం హస్యస్పదం కాకా ఏమవుతుందో ప్రజాప్రతినిధులకు, అధికారులకే తెలియాలి. ఈ 40 శాతం సైతం పూర్తిగా నిర్మాణమై వినియోగంలో లేవంటే అతియోశక్తి లేదు. దీంతో పాటు శ్మశాన వాటిక నిర్మాణం సైతం మరిచారు. నిధులు ఉన్న నిర్మించాలనే చిత్తశుద్ధి కనిపించటం లేదు. కనీసం పనులు కూడా ప్రారంభించడానికి పూనుకోవటం లేదు. ఇక ఎస్సీ కమ్యూనిటీహాల్ నిర్మాణం సైతం మాటలకే పరిమితమైందనేది బహిరంగ రహస్యమే. అప్పట్లో మాజీ స్పీకర్ హయాంలో ఎస్సీ కమ్యూనిటీహాల్ నిర్మాణానికి నిధులు మంజూరు ప్రకటన చేశారనేది గమనించాల్సిన అంశం. శివాలయం అభివృద్ధి 80 లక్షల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెప్పినప్పటికీ కేవలం కంఫౌండ్ వాల్ కే పరిమితమైంది. ఇది కూడా అసంపూర్తిగానే దర్శనమిస్తుంది. ఈ నిధులన్ని ఏ పక్కదారి పట్టాయా...? మాయమైనాయా అనేది విచారణ చేస్తే అసలు గుట్టు రట్టవుతుందనేది గమనించాలి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు కుంటుపడింది. ఎస్సీ కాలనీకి చేరలేదు. దళిత వాడలకు తాగునీరు అందించడంలో చిత్తశుద్ధి కనిపించటం లేదనటానికి ఇదే సాక్ష్యంగా నిలుస్తుంది. ఎస్సీ కాలనీల్లో సిసి రోడ్లు నిర్మించాల్సి ఉండగా కేవలం గ్రావెల్సతోనే సరిపెట్టడం బహిరంగ రహస్యం. ఇక ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలు ఈ గ్రామంలో ఆర్బాటం ఎక్కువ పని తక్కువ అన్న చందంగా మారిందనటంలోనూ సందేహం లేదు. ఒకరకంగా ఈ 30 రోజుల ప్రణాళిక కేవలం చెట్లు నాటడం , తొలగించటానికే పరిమితమైందంటే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఇందులో భాగంగా నే జంగిల్ కటింగ్ ( గుంపు చెట్ల తొలగింపు ) పనిని రెండు చోట్ల ప్రణాళిక నిధుల ఖర్చు గా చూపించారనేది బహిరంగ ఆరోపణగా ఉంది. అయితే ప్రచార ఆర్భాటంగా పని చేసినట్లుగా కనిపించినప్పటికీ ఈ గ్రామంలో ప్రాధాన్యత కలిగిన పనులను మాత్రం ఒదిలేశారనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇంకుడు గుంతల నిర్మాణం మరిచారు. ఇది కీలకమైందని అంటూ గొప్పగా మాటలు చెప్పే నేతలు 30 రోజుల ప్రణాళికలో వీటిని మరిచారు. ఒక్కో వార్డు సభ్యుని పరిధిలో ఇంచుమించు వంద వరకు ఇంకుడు గుంతలకు అవకాశం ఉన్నప్పటికీ కొత్తగా ఒకటి కూడా నిర్మించలేదనేది గమనించాల్సిన అంశం. 40 శాతం కూడా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాని గ్రామాన్ని ఓడిఎఫ్ గ్రామంగా ప్రకటించబడి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న గ్రామం భవిష్యత్ లో అవసరమైతే ఉత్తమ గ్రామ పంచాయతీగా కూడా అవార్డు తీసుకున్న ఆశ్చర్యం లేదేమో...!
రాజేందర్ దామెర , సీనియర్ జర్నలిస్ట్ - వరంగల్ ,