(నిన్నటి సంచిక తరువాయి) ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మన చట్టాలు ఉన్నాయి. వాటిలో సమూల మార్పులు తేవలసిన అవసరం ఉంది. ఢిల్లీలో ఒక ఘటన జరిగితే.. ఇలాంటి ఘటన మున్ముందు జరగకూడదని నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే శిక్షలు పడాలని కోరుకున్నాం. 4 నెలల్లో తీర్పు నివ్వాలి, 4 నెలల్లో శిక్ష వేయాలని ఈ చట్టం చెబుతోంది. కానీ ఏడేళ్లయినా నిర్భయ దోషులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే ఉపశమనం కలిగేలా చట్టం రావాలని తల్లిదండ్రులు, ప్రతి మహిళ, సమాజం ఎదురు చూస్తోంది. దిశా చట్టం: ఈ పరిస్థితులలో ఈ దిశగానే మన రాష్ట్రం కూడా ఆలోచించింది. దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ బిన్ యాక్ట్ 2019కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. ఈ చట్టానికి దిశా అని పేరు పెట్టారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారం రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్ కేసుపై తీర్పు వస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించారు. ఇక యాసిడ్ దాడులు, వేధింపులు, చిన్నారులపై అత్యాచారం, మహిళలు, సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపులు తదితర నేరాలకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తారు. ఇక సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే కఠిన చర్యలు తప్పవు. అలాంటి వారిపై సెక్షన్ 354 (ఇ) కింద చర్యలు తీసుకుంటారు. మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. అంతేకాదు పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్) కింద చర్యలు తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. పోస్కో చట్టం కింద ఇప్పటివరకూ ఉన్న 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ ఉన్న శిక్షను ఏడేళ్లకు పెంచారు. ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి. దీనికోసం చట్టాలు మరింత గట్టిగా బలపడాలి. ఒక నేరం జరిగినప్పుడు, రెడ్ హ్యాండెడ్ గా నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు.. ఎక్కువ రోజులు ఎదురుచూడకుండా మనసు దిటవు చేసుకొని కఠిన శిక్షలు అమలు చేస్తే నేరం చేయాలన్న వారి గుండెల్లో దడ మొదలవుతుంది. ఇలాంటి ఘటనలు జరిగితే కొన్ని దేశాల్లో అయితే దోషులను కాల్చేస్తారు. మన దేశంలో చట్టాలను సవరించి, అంగీకార యోగ్యమైన పద్దతిలో బలమైన చట్టాలను తీసుకురావాలి అని అందరు బలంగా కోరుకుంటున్నారు .ఆ దిశగా “దిశా చట్టాన్ని” తీసుకురావడానికి జగన్ ప్రభుత్వం క ృషి చెయ్యడం చాలా గొప్ప విషయం. అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఏ రకమైన శిక్షపడితే బాధిత మహిళకు, ఆ కుటుంబానికి ఉపశమనం లభిస్తుందో, రెండోసారి ఆ సంఘటన జరగకుండా భయాన్ని ఎలా నెలకొల్పాలో బలంగా ఆలోచించి కొంచెం కఠిన చట్టాన్ని తయారు చేసి పకడ్బందీగా అమలు చేస్తే తప్ప సేచ్చగా బతికే రోజులు రావు. మరణ శిక్ష ఉంటుందనే భయం ఉంటేనే తప్ప వ్యవస్థలో మార్పులు రావు. ఈ దిశగా అడుగులు వేసే క్రమంలో, నిర్భయ చట్టం నుంచి దిశా చట్టం వరకు మనం తగిన పాఠాలు నేర్చుకోవాలి. వాటిని మార్చి సమాజానికి అనుకూలంగా , తొందరగా నిర్ణయాలు అమలు జరిగే వ్యవస్థను తీసుకొని రావాలి. కావాల్సిన వనరులు సమకూర్చి సిబ్బందిని ఏర్పాటు చేసి కట్టు దిట్టంగా అమలు చేస్తే అందరు ఎదురు చూసే రోజులు రావచ్చు .ఆ దిశగా అడుగులు బలంగా పడాలని కోరుకుందాం. శాఖాహారమే
కాళంరాజు వేణుగోపాల్ గణిత ఉపాధ్యాయుడు,మార్కాపురం 8106204412