గిరిపుత్రులకు అండ దండలు

స్వాతంత్ర్యానంతరం దేశం లో గిరిజనుల అభివృద్ధికో సం ప్రభుత్వాలు చెప్పింది ఎక్కువ... చేసింది తక్కువ! అం దుకే గిరిపుత్రులు ఎవరికీ పట్టని వర్గంగా మిగిలిపోయారు. ఉభయ తెలుగు రాష్ట్రాల జనాభాలో సుమారు 15 శాతంగా ఉన్న (2011 జనాభా లెక్కల ప్రకారం) అడవి పుత్రులు- అభివృద్ధి లెక్కల ప్రకారం అట్టడుగున ఉన్నారు. దారిద్ర్యం, అక్షరాస్యత, కనీస మౌలిక సదుపాయాలు, వ్యాధి నిరోధక టీకాల ప్రాతిపదికన మిగిలిన వర్గాలతో పోలిస్తే గిరిజనులు దుర్బర దుస్థితిని అనుభవిస్తు న్నారు. పౌష్టికాహార లోపాల కారణంగా వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువు లేక గిరిజన మహిళలు, బాలలు ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారు. విభజనానంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభు త్వాలు గిరిజనుల బాగోగుల పట్ల కొంత క్రియా శీలంగా స్పందిస్తున్నాయి. సమ్మిళిత అభివృద్ధి వ్యూహా లకు సాన పెడుతూ ఇరు రాష్ట్రాలూ పురోగమిస్తు న్నాయి. గిరిజనుల అభివృద్ధికి ఉద్దేశించిన నిధులను మరే ఇతర కార్యక్రమాలకూ మళ్ళించకుండా, నిర్దేశిత కాలావధిలోగా వినియోగించకపోయినా ఆ నిధులు మురిగిపోకుండా ఇరు ప్రభుత్వాలూ ఎసీ ఉప ప్రణాళిక దన్నుగా ముందడుగు వేస్తున్నాయి. అయితే శ్రీకాకుళం, విశాఖ, ఖమ్మం జిల్లాల్లో గిరిజనం భూమి పట్టాలకు సంబంధించి అతి పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. రెవిన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా వారి సమస్య పరిష్కారం కావడం లేదు. మరోవంక సేద్య అవసరాలకోసం రుణ లభ్యత గిరిపుత్రులకు తీవ్ర సమస్యగా ఉంది. వ్యవస్థాగత రుణ సదుపాయాలు లేకపోవడంతో 40 శాతానికి పైగా గిరిజనం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. దారుణమైన వడ్డీలు చెల్లించలేక, తీసుకున్న అసలు కట్టే స్తోమత లేక వడ్డీ వ్యాపారుల విషవలయంలో చిక్కి గిరిజనులు కొట్టుమిట్టాడుతున్నారు. బ్యాంకుల ద్వారా అడవి పుత్రులకు రుణాలు చెల్లించే వెసులుబాట్లపై ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన దృష్టిపెట్టాల్సి ఉంది. కర్ణాటకలో గ్రామ్ వికాస్ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక బృందాలు, స్వచ్చంద సేవాసంస్థల (ఎస్ హెల్త్ ఎకీఓ) భాగస్వామ్యంతో ఆదివాసులకు వ్యవస్థాగత రుణ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ తరహా కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలూ అంది పుచ్చుకోవాల్సి ఉంది. పండించిన పంటను మార్కెట్లకు తరలించే రవాణా సదుపాయాలు కనీస మాత్రంగానైనా లేకపోవడం గిరిజనుల పాలిట శాపంగా మారుతోంది. కొండకోనల నుంచి పంటను విపణులకు తరలించే సదుపాయాలు కల్పించడంతోపాటు- వివిధ పల్లెలు, గ్రామ సమూహాలు కేంద్రంగా పంటను నిల్వ చేసుకునే సదుపాయాలు కల్పించాలి. అవసరమైతే గ్రామ స్థాయిలోనే పంటను విక్రయించుకునేందుకు తగిన వ్యవస్థాగత ఏర్పాట్లు చేయాలి. మరోవంక సేద్య విధానాలు, పంట నిల్వ, అటవి పర్యావరణ పరిరక్షణ వంటివాటికి సంబంధించి శాస్త్రీయ పద్ధతులను అందిపుచ్చుకొనేలా గిరిజనుల్లో అవగాహన పెంచాలి. అడవుల పరిరక్షణ గిరిజనానికి ప్రాణాధారం. కాబట్టి చొరవగా, ' స్వచ్ఛందంగా ముందుకొచ్చి అటవీ భూములను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను అడవి బిడ్డలకు ఎరుకపరచాలి. మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు కొరవడి, ఉపాధి అవకాశాలు లేక గిరిజన యువత ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అడవి పుత్రుల నిస్సహాయతను అవకాశంగా భావిస్తున్న కొందరు దళారులు వారిని 'గంజాయి' సాగు దిశగా ప్రేరేపిస్తున్న ఉదాహరణలూ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఉద్యాన పంటలను ప్రోత్సహించడం తోపాటు నైపుణ్యాభివృద్ధికి బాటలు పరవడం ద్వారా గిరిజన యువతకు కొత్త అవకాశాలను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక వనరులను సమర్థంగా ఉపయోగించుకునే పద్ధతులను గిరిజనానికి నేర్పించాలి. అందుకోసం అవసరమైతే ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించి గిరిజన బాలలకు పాఠశాల స్థాయినుంచే శిక్షణ ఇవ్వాలి. అడవుల్లో కార్చిచ్చు చెలరేగినప్పుడు ఏం చేయాలి, ఉద్యాన వనాల నిర్వహణ; విత్తన సేకరణ, నిల్వ: వర్షపు నీటిని మెరుగ్గా ఉపయోగించుకోవడం వంటి అంశాలపై గిరిజనులకు శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలి.. గిరిజన ఉప ప్రణాళికలోని అయిదు శాతం నిధులను అడవి బిడ్డల గ్రామసభల పాలన పరిధిలోని పంచాయతీలకు కేటాయించడం ద్వారా మహారాష్ట్ర గవర్నర్ ప్రశంసలు అందుకొన్నారు. రాజ్యాంగబద్దం గా తనకు దఖలుపడిన అధికారాలను మహారాష్ట్ర గవర్నర్ క్రియాశీలంగా ఉపయోగించుకున్న తీరు మిగిలిన రాష్ట్రాలకూ ఆదర్శప్రాయమనడంలో సందేహం లేదు. గిరిజన సంక్షేమంతో ముడివడిన పథకాల నిర్వహణకు ఆ నిధులను ఉద్దేశించారు. ఆయా జిల్లాల్లో నిధుల వినియోగం . తీరుతెన్నులను కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. గిరిజన గ్రామాలను స్వయంపోషకాలుగా తీర్చిదిద్దే కృషి మహారాష్ట్రలో ప్రశంసనీయంగా సాగుతోంది. గిరిజన గ్రామాల్లో యువతను నైపుణ్యవంతంగా తీర్చిదిద్దేందుకు మరికొన్ని రాష్ట్రాలూ కంకణబద్దమై ముందుకు సాగుతున్నాయి. అడవిబిడ్డల సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన తాజా గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. వారి అభివృద్ధికి ఈ గణాంకాలే ప్రాతిపదిక కావాలి. గిరిజనుల పురోభివృద్ది క్రమంలో లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగేందుకు ప్రభుత్వాలకు ఇప్పుడు కావాల్సింది స్థిరమైన సంకల్పం... మొక్కవోని దీక్ష!


బళ్ళారి నాగేశ్వర్ గిరిజన వేదిక సంపాదకులు