మనిషి మనుగడకు ప్రాణాధారమైన గాలితోపాటు చల్లని నీడనిచ్చి సేదతీర్చే వృక్షాల్లాంటివే పటుతర ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా! రాజకీయ చీడపీడలు సోకి వ్యవస్థలు గుల్లబారిపోకుండా కాచుకోవడం- ప్రజాతంత్ర బాధ్యత. రాజకీయంగా పాలనపరంగా పోలీసులపై పెరిగిపోతున్న ఒత్తిళ్లను ఉపేక్షిస్తే ప్రజాస్వామ్య పునాదులే బీటలువారిపోతాయని పోలీసు పరిశోధన అభివృద్ధి సంస్థ నాలుగు దశాబ్దాలనాడే విస్పష్టంగా హెచ్చరించింది. అదెంత వాస్తవమో కళ్లకు కట్టిన నేపథ్యంలో- దురాజకీయ కబంధ హస్తాలనుంచి పోలీసు వ్యవస్థను తప్పించేందుకు సర్వోన్నత న్యాయపాలిక విస్పష్ట ఆదేశాలు జారీచేసి పుష్కరకాలం దాటింది. నాటి చరిత్రాత్మక తీర్పు స్ఫూర్తిని కొడిగట్టించడానికి ఇన్నేళ్లుగా సాగుతున్న కపట నాటక విన్యాసాలకు తెరదించుతూ సుప్రీంకోర్టు తాజాగా చేసిన న్యాయ నిర్ణయం సంస్తుతిపాత్రమైనది. పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) నియామక వ్యవహారమంతా తమ చెప్పుచేతల్లోనే ఉండేలా- 2006లో 'సుప్రీం' ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించాలని కోరుతూ పంజాబ్, కేరళ, పశ్చిమ్ బంగ, హరియాణా, బిహార్ రాష్ట్రాలు న్యాయపాలికను ఆశ్రయించాయి. రాజకీయ ఒత్తిళ్లనుంచి పోలీసు అధికారులకు రక్షణ, ప్రజా ప్రయోజనాల పరిరక్షణలే లక్ష్యంగా డీజీపీల ఎంపిక, నియామక సరళి ఉండేలా గత ఆదేశాలున్నాయన్న సుప్రీంకోర్టు- అయిదు రాష్ట్రాల విజ్ఞప్తుల్ని టోకున తోసిపుచ్చింది. పోలీసు సంస్కరణలకు సంబంధించి నిరుడు జులై తొలివారంలో ఇచ్చిన ఆదేశాలు తు.చ. తప్పక అమలు కావాలనీ గిరిగీసింది. ప్రస్తుత డీజీపీ పదవీకాలం ముగియడానికి మూణ్నెళ్ల ముందే రాష్ట్రాలు సీనియర్ అధికారుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను పంపించాలని- మిగిలిన పదవీకాలం, మంచి రికార్డు, పోలీసు దళాలకు సారథ్యం వహించగల విస్తార అనుభవం ప్రాతిపదికన యూపీఎస్ సీ నిర్ణయించే ముగ్గురినుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒకర్ని ఎంచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. దుర్రాజకీయ చీకటి కోణాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకంగా అత్యున్నత నియామకాలు సాగడం- ఆయా వ్యవస్థల సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది! ప్రజాతంత్ర దేశంలోనైనా పోలీసు వ్యవస్థ అంటే- సామాజిక భద్రతా సాధనం. అవినీతి నేతల మోచేతి నీళ్లు తాగుతూ అధికార పరమపద సోపానాల్ని అవలీలగా అధిరోహించడంలో పోలీసు బాసులు పోటీపడుతుండటానికి, ఘోర నేరాలకు పాల్పడ్డవాళ్లూ బోర విరుచుకుని తిరుగుతుండటానికి గల సంబంధం- దేశీయంగా వ్యవస్థ రాజకీయంగా పుచ్చి, నైతికంగా చచ్చిందనడానికి నిదర్శనం. వృత్తిధర్మానికి నిబద్దమైన వాళ్లకు, తమ అనుచిత ఫర్మానాలను పాటించని వాళ్లకు చీటికి మాటికి బదిలీ బహుమానాలు ఇచ్చే క్షుద్ర రాజకీయం గజ్జె కట్టిందంటూ 1996లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు- కీలెరిగి వాత పెట్టేలా విస్పష్ట ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర డీజీపీలకు నిర్ణీత పదవీకాలం, పోలీసుల పనిపోకడల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో భద్రతా కమిషన్, రోజువారీ శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలనుంచి దర్యాప్తు విధుల్ని వేరు జులై చేయడం వంటి కీలక సూచనల్ని అప్పటికి మూడు దశాబ్దాల క్రితమే జాతీయ పోలీసు సంఘం అందించింది. వాటి అమలులో అలవిమాలిన జాప్యాన్ని తీవ్రంగా పరిగణించిన 'సుప్రీం' న్యాయపాలిక- సునిశితమైన ఏడు ఆదేశాలతో రక్షక భట వ్యవస్థ సాకల్య ప్రక్షాళన క్రతువుకు తనవంతుగా బాటలు పరచింది. యూపీఎస్సీ జాబితానుంచే డీజీపీ నియామకం, డీజీపీ, ఐజీ, ఇతర సీనియర్ అధికారులకు కనీస పదవీకాలం, రాష్ట్ర స్థాయిలో భద్రతా కమిషన్లు, నియామకాలు- బదిలీల నిమిత్తం ప్రత్యేక బోర్డు వంటివి నాటి ప్రభావాన్విత ఆదేశాల్లో కొన్ని! మూడు నెలల వ్యవధిలోగా అన్ని రాష్ట్రాలూ తన ఆదేశాల్ని అమలు చెయ్యాలని 'సుప్రీం' స్పష్టీకరించినా, అడ్డమైన కొర్రీలతో వాటిని అడ్డుకొనేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు బారులు తీరాయి. 2006నాటి ఉత్తర్వుల స్పూర్తిని మరింత తేటతెల్లం చేస్తూ 2018 జులైలో సవివరంగా 'సుప్రీం' స్పందించినా- వాటికి కట్టుబాటు కష్టమన్న రాష్ట్రాలకు తాజాగా చుక్కెదురైంది! తప్పు చేస్తే దేశాధ్యక్షుడి కూతురినైనా ఉపేక్షించని వృత్తినిబద్ధత అమెరికాలో పోలీసు వ్యవస్థ సొంతం. ప్రజాదరణ మెండుగాగల అధ్యక్షుడు బిల్ క్లింటనను సైతం నైతిక నిందారోపణలపై బోనెక్కించడంలో అక్కడి న్యాయ వ్యవస్థ ఘనత బహుధా ప్రశంసనీయం. ప్రజాజీవనంలో క్షీణ విలువలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై జన విశ్వాసాన్నే కదలబారుస్తున్న దశలో బ్రిటన్ చురుకుగా స్పందించి, లార్డ్ నోలన్ కమిటీ సూచనలు స్వీకరించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ తరహా వ్యవస్థాగత సంస్కరణలు నిరంతరం ఎండమావిని తలపిస్తున్న దేశం మనది. జన శ్రేయస్సాధకంగా పోలీసు యంత్రాంగాన్ని రూపాంతరీకరించేందుకు ఏం చేయాలో లా కమిషన్, రెబీరో కమిటీ, పద్మనాభయ్య కమిటీ, జస్టిస్ మలీమత్ కమిటీ వంటివెన్నో విలువైన సూచనల్ని పూసగుచ్చాయి. పౌరుల సంతృప్త స్థాయి ఆధారంగా పోలీసుల పనితీరును మదింపు వెయ్యాలని జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సు చేసింది.
‘సుప్రీం’ కంచె