ఇంగ్లీషు మీడియం కోసం జగన్ అడుగులు

విద్య లక్ష్యం విద్యార్థి సమగ్రాభివృద్దే రాజ్యంగ విరుద్ధమనే వాదన మాతృభాషపై మోడీ కామెంట్స్ ఇంగ్లీషు మీడియమే అన్ని పాఠశాలలలో అమలు చేయబోతున్న నేపథ్యంలో ఈ అంశంపై వివిధ రకాలుగా చర్చ సాగుతోంది. సమకాలీన పరిస్థితులు, వాటి ప్రభావాల వల్ల ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. రాజ్యాంగ పరంగా , రాజ్యంగ స్పూర్తితో ఇప్పటికే అమలులో ఉన్న చట్టాలు ఈ విషయమై ఏమి చెబుతున్నాయనేది కూడా ఈ సందర్భంలో పరిశీలించాల్సిన అంశం.విద్య లక్ష్యం విద్యార్థి సమగ్రాభివృద్దే తప్ప కేవలం ఉపాధి యంత్రం కాదు. విద్య ఉపాధి అవకాశాలకు ఆధారమని ప్రయివేటు పాఠశాలలు, తల్లిదండ్రులు భావించవచ్చు. అందుకోసం ఏ నిర్ణయమైన అనుసరిస్తామంటే ప్రస్తుత భారత రాజ్యంగం మాత్రం అందుకు అనుమతించదు. ఇంగ్లీషు మీడియం అవసరం అని భావిస్తే దేశమంతా దానిపై చర్చజరగాలి. మరో వైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి ఆరు తరగతుల వరకు బోధనను ఇంగ్లీషు మాధ్యమంలోకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తరువాత ప్రతి సంవత్సరం నుంచి ఒక్కో తరగతిని ఇంగ్లీషు మీడియంలోకి మార్చేందుకు నిర్ణయించింది. వివిధ యాజమాన్యాల కింద ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు/ఉర్దూను తప్పనిసరి సబ్జెక్ట్ గా అమలు చేయాలని ఆదేశించింది. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్య కమిషనర్‌ను ఆదేశించింది. ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్స్ అభివృద్ది, ఇంగ్లీషులో బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ, తదితర అంశాల్లో ఎస్సీఈఆర్టీ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇంగ్లీషులో ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మదింపు చేసి, ఆ మేరకు శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది వేసవిలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇంగ్లీషులో బోధనా నైపుణ్యం పెంపొందించేలా ఎక్కువ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంగ్లీషు టీచింగ్ సెంటర్లు, జిల్లా ఇంగ్లీషు సెంటర్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే ఇంగ్లీషు మీడియం పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. బోధనా మాధ్యమం మారుస్తున్న నేపథ్యంలో కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అంచనా వేయాలని, తదుపరి ఉపాధ్యాయుల నియామకాల్లో ఇంగ్లీషు నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అదేశించింది. మిగతా రాష్ట్రాల ఆలోచనలు వినాలి. ప్రాథమిక స్థాయి మాధ్యమభాషపై సంబంధిత నిపుణులతో అధ్యయనం చేయించాలి. రాజ్యాంగంలో ఆర్టికల్ 350(ఎ, బి) లకు సవరణలు జరగాలి. అప్పటిదాకా ప్రస్తుతం ఉన్న నియమాల ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలలో ప్రాథమిక విద్య మాతృభాషలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. చట్టాలలోని లొసుగుల ఆధారంగా ప్రయివేటు పాఠశాలలకు ఇంగ్లీషు మీడియం అనుమతులను ఇవ్వడాన్ని అరికట్టాలి. ఇచ్చిన అనుమతులను వచ్చి రద్దుచేయాలి. తృతీయ భాషగా ,ఒక సబ్జెక్టు గా ఉన్న ఇంగ్లీషును ఎలా ఆధునిక పరిస్థితులకు తగ్గట్టుగా మెరుగుపరుచుకోవాలో ఆలోచించాలి. ఎనిమిది సంవత్సరాలు ఒక సబ్జెక్ట్ గా ఇంగ్లీషును శాస్త్రీయంగా అవసరమైనంత నేర్చుకోవడం పై దృష్టి పెడదాం.ఒక సబ్జెక్ట్ గా ఇంగ్లీష్ ను చదివి ఆ భాషలో నైపుణ్యం తోపాటు, వివిధ రంగాలలో గొప్ప స్థాయికి ఎదిగినవారు మన కళ్ళముందు చాలా మంది ఉన్నారు. పూర్తిగా ఇంగ్లీషు మీడియంలో చదివిన వేలాదిమంది నిరుద్యోగులు కూడా మనకళ్ళముందే ఉన్నారు. మాతృభాషతో జీవిద్దాం. అవసరమైనంత ఆంగ్లం వినియోగి ద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొన్న ఇంగ్లీషు మాధ్యమ నిర్ణయం ఇక్కడి అధిక సంఖ్యాకులైన తెలుగుభాష పరిస్థితి సమస్యనెదుర్కొనేలా చేస్తుంది. అల్పసంఖ్యాక భాషలు ఇంక లెక్కలో కూడా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి నచ్చిన ధోరణిలో వాళ్ళు భాషల విషయంగా నిర్ణయాలు తీసుకొం టూ వెళితే అనేక భాషలతో కూడిన, సమాఖ్య వ్యవస్థగా సాగుతున్న భారతదేశంలో ఉత్తరోత్తర సంక్లిష్ట సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఈ విషయంగా రాజ్యాంగంలో అనేక జాగ్రత్తలు తీసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమిళం, కన్నడ, ఒరియా, ఉర్దూ తదితర భాషా మాధ్యమాలలో కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో పాఠశాలలు నడుస్తున్నాయి. ఆయా రాష్ట్రల లో అనేక తెలుగు పాఠశాలలు కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మాతృభాషలో ఆయా వర్గాలు చదువుకోవడాన్ని నిరా కరిస్తే రేపు ఆయా రాష్ట్రాలలోని తెలుగువారు కూడా తెలుగు మాధ్యమంలో చదువుకొనే హక్కు నిరాకరించబడే పరిస్థితులు ఎదురవుతాయి. (మిగతారేపు) -


పులవర్తి ప్రభు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు,విజయవాడ