పారమార్థిక జీవనంలో విజయ సాధనకు మానవుడు జ్ఞానవంతుడు కావాలి. ఆ విజ్ఞాన సముపార్జన- కర్మ వల్లనే అతడికి సాధ్యమవుతుంది. వ్యాసభగవానుడి 'మహాభారతం'లోని భగవద్గీతలో కర్మను 'యోగం'గా వర్ణిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. . 'అకర్మ' కూడా కర్మలో అంతర్భాగమే! మౌనం అనేది అకర్మే అయినా, అది శబ్దానికి సంబంధించిన అవశేషమని పెద్దలు చెబుతారు. ఉదారబుద్ధి గల ఒక వ్యక్తికి చనిపోయే ముందు ఓ ఆలోచన వచ్చింది. అన్నదాతల కోసం అతి పెద్ద జలాశయం నిర్మించాలని భావించాడు. నిధులతో పాటు అవసరమైన భూమిని వెంటనే సమకూర్చాడు. అతడి సంకల్పం నెరవేరేందుకు, కార్యభారాన్ని మరొక వ్యక్తి తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. గొప్ప కార్యాన్ని మొదట సంకల్పించి నిధులు చేకూర్చిన దాత - ఆ సత్కర్మ ఫలం అనుభవించడానికి అన్ని విధాలా అర్హుడే! ఎప్పటికైనా అతడు ఆ పుణ్యఫలం పొందుతాడని సనాతన ధర్మశాస్త్రాలు చెబుతాయి. కర్మయోగాన్ని జనక మహారాజు విశేషంగా ఆచరించాడు. ఆధ్యాత్మిక విజయానికి మూలం నిష్కామ కర్మ అని సూత్రీకరించాడు కృష్ణుడు. చేసిన కర్మకు ఫలం అనుభవించక తప్పదు. అది ఎవరూ తప్పించలేనిది. సామాన్యుడు మొదలు మహా యోగి వరకు ప్రతి వ్యక్తీ కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. కష్టాల నుంచి విడుదల పొందడమే (వి)ముక్తి అని పలువురు భావిస్తుంటారు. పారమార్థికంగా ముక్తి సాధించేందుకు సాధకులు భక్తి, జ్ఞాన, కర్మయోగాల్లో ఏదో ఒకటి ఎంచుకుంటారు. కర్మయోగం ప్రాధాన్యమే వేరు! భక్తి లేదా జ్ఞానం పొందడానికి అవసరమయ్యే సాధన సంపత్తి కర్మ ద్వారా కలుగుతుంది. అందువల్ల కర్మయోగం గొప్పదని పెద్దల మాట. జనక మహారాజుతో పాటు గార్గి, యాజ్ఞవల్క్యుడు కర్మ సిద్ధాంతాలు ఆచరించారు. బ్రహ్మవిద్యలో ఆరితేరిన ఘనురాలు గార్గి. ఆ బ్రహ్మవిద్యనే కాక అద్వైత వేదాంతాన్ని జనక చక్రవర్తికి బోధించాడు యాజ్ఞవల్క్యుడు. అద్వైతం అనే శబ్దాన్ని ఆయనే ముందుగా ప్రయోగించాడని ప్రతీతి. వేదాల్ని స్త్రీలూ పఠించవచ్చని ప్రతిపాదించిన సమతామూర్తి ఆయన. కర్మయోగాన్ని అనుష్టించిన ఆధునికుల్లో స్వామి వివేకానంద ముఖ్యులు. ఆ యోగాన్ని ఆయన ఓ మానసిక సాధనగా ప్రకటించారు. కర్మయోగ సాధనలో సమాజ శ్రేయస్సు ఇమిడి ఉండాలన్నది స్వామి సిద్ధాంతం. అటువంటి సాధనే బ్రహ్మజ్ఞాన సముపార్జనకు ఉపకరిస్తుందని ఆయన బోధనల సారాంశం! మానవజన్మ ఉత్కృష్టమైనది. మనుషుల్లో దైవాంశ ఉంటుంది. 'వస్తువుల్లో, ఇతరాల్లో ఏది సమున్నతమో అదే నేను' అంటాడు గీతాచార్యుడు. ఏది మహోన్నతమో దాన్నే లక్ష్యంగా చేసుకొని మనిషి జీవిత పరమార్గం సాధించాలని భగవానుడి ఉవాచ. పరమాత్మను తెలుసుకొనేందుకు మానవుడు సాగించే నిరంతర ప్రయత్నమే అతణ్ని ఉన్నత లక్ష్యం వైపు నడిపిస్తుంది. అదే సత్యాన్ని రామక ృష్ణ పరమహంస తన భక్తులకు బోధించారు. మనిషి ప్రవర్తనలో మంచి మార్పు రావడమే అతడు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాడనేందుకు నిదర్శనం. ఉత్తమ ప్రవర్తనను అతడు సొంతం చేసుకోవాలంటే, దానికి ఆధారభూతమైన కర్మయోగాన్ని ఆచరణకు తేవాలి. ప్రతి వ్యక్తీ కర్మ చేయాలి. అది నిర్ణీత ఫలమిస్తుంది. అన్ని కర్మఫలాలూ మనిషి ఆశించిన విధంగా ఉండవచ్చుఉండకపోవచ్చు. వాటిని యథాతథంగా స్వీకరించడమే కర్మయోగం. కర్మఫలాలన్నింటినీ భగవంతుడికి అర్పించడం విజ్ఞుల విధానం. నిష్కామకర్మ ఎటువంటి ఫలితాన్ని ఆశించకున్నా, అది రాక తప్పదని గ్రహించాలి. కోరకున్నా, సత్కర్మకు ప్రతిఫలం భక్తుడికి లభించి తీరుతుంది. అదే కర్మ సిద్ధాంత రహస్యం.
కర్మయోగి