అన్ని దుర్మార్గాలకు మూలం మద్యం

అన్ని దుర్మార్గాలకు సమాజాన్ని ఈనాడు మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతల్లో అతి భయంకరమైనది మద్యపానం. ఇది మనిషిని సామాజికంగా, ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా గుల్లచేస్తుంది. నైతికంగా దిగజార్చుతుంది. మద్యానికి బానిసలైనవారు అనేకరకాల చెడులు, పాపాల్లో కూరుకుపోతారు. దిశ' హత్యాచార నిందితుల విషయంలో ఇదే రుజువైంది. తాగిన మత్తులో తామేం చేశామో తమకే తెలియదన్నారు. మనిషి మృగంగా మారడానికి మద్యం దోహదపడుతోంది. నిజానికి తాగుబోతులను సమాజం గౌరవించదు. సంఘంలో వారి పరపతి పడిపోతుంది. బంధుమిత్రులు, భార్యాబిడ్డలు అందరూ అసహ్యించుకుంటారు. అయినా ఈ దురలవాటుకు జనం బానిసలవుతున్నారు. ఈ ఇన్ని అనర్ధాలుండబట్టే అల్లాహ్ మద్యాన్ని నిషేధించాడు. ' విశ్వసించిన ప్రజలారా ! మద్యం, జూదం, బలిపీఠాలు, పాచికల జోస్యం - ఇవన్నీ అసహ్యకరమైన షైతాన్ పనులు. వీటికి దూరంగా ఉండండి. మీ జీవితం సార్థకం అవుతుంది. ( ఖురాన్ . 5 - 90) ఇందులో మద్యనిషేధానికి సంబంధించిన స్పష్టమైన ఆదేశం ఉంది. మద్యపానం అత్యంతనీచమైన, అసహ్యకరమైనదుర్మార్గమైన రాక్షసకార్యమని, దానికి దూరంగా ఉండక పోతే జీవితాలు సర్వనాశనమవుతాయని దైవం హెచ్చరించాడు. ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టి నిషేధాజ్ఞను ఉల్లంఘిస్తే దైవశిక్ష కోసం ఎదురుచూడవలసిందే. దురదృష్ట వశాత్తూ ఈనాడు చాలామంది దైవాదేశాలను, దైవప్రవక్త వారి హితోపదేశాలను పట్టించుకోవడంలేదు. నిజానికి దైవాదేశాలు, ప్రవక్త హితోపదేశాలు చెవిన పడగానే శిరసావహించడం, ఆదేశాలను ఆచరణలో పెట్టడం దైవ విశ్వాసుల లక్షణం . దాదాపు 1450 సంవత్సరాల క్రితం మద్యనిషేధానికి దుర్మార్గాలకు మూలం అవతరించబడిందన సంబంధించిన ఈ ఆదేశం అవతరించినప్పుడు, ' ఇకనుండి మద్యం నిషేధించబడిందని, దాన్ని తాగడంగాని , క్రయవిక్రయాలు జరపడంగాని నిషిద్ధమని ముహమ్మద్ ప్రవక్త స. సల్లం వారు మదీనా లో చాటింపు వేయించారు. ఈ ప్రకటన విన్నవెంటనే మదీనా వాసులు తమ ఇళ్ళల్లో ఉన్న సారాయిని వీధుల్లో కుమ్మరించారు. అలా పారబోసిన కుండలకొద్దీ సారాయితో మదీనా నగర వీధులు ఏరులుగా మారాయి. ఆసమయంలో మద్యం సేవిస్తున్నవారు తమనోటి దగ్గరి గ్లాసుల్ని విసిరికొట్టారు. అప్పటికే తాగినవారు నోట్లోకి వేళ్ళు జొప్పించి వాంతులు చేసుకున్నారు. ఈ విధంగా దైవాదేశాలను, దైవప్రవక్త వారి హితవులను తు. చ. తప్పక పాటించి తమ విశ్వాసం అచంచలమని చాటుకున్నారు. మరి ఈనాడు ప్రజలు మద్యాన్ని ఎందుకు మానలేక పోతున్నారు? ప్రభుత్వాలు మద్యాన్ని నిషేధించకుండా ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి? ప్రజారోగ్యానికి, నైతిక పతనానికి గొడ్డలిపెట్టుగా మారిన మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వాలు ఎందుకు పరిగణిస్తున్నాయి? 'మద్యంతాగి వాహనం నడపరాదు' అని ప్రచారం చేస్తున్న ప్రభుత్వాలు, అదే మద్యం అమ్మి ప్రభుత్వాలను ఎందుకు నడుపుతున్నాయి? ఇది ద్వద్వ వైఖరికాదా? సామాజిక బాధ్యత లోపించడం, దైవభీతి పాపభీతి లేకపోవడం, నైతిక విలువలు కొరవడడం, అడిగేవాడు, ప్రశ్నించేవాడు ఎవడూ లేడన్న అహంభావం, తాత్కాలికమైన ఇహలోక జీవితాన్నే సర్వస్వంగా భావించి, సాధ్యమైనంత ఎక్కువగా సుఖ భోగాలు జుర్రుకోవాలని భావించడం దీనికి కారణం. కనుక మానవులు దైవానికి భయపడాలి. ఆయన నిషేధించిన వాటి జోలికి పోకుండా, ధర్మమార్గంలో నడుస్తూ, బాధ్యతాభావంతో, జవాబుదారీతనంతో జీవితం గడిపితే, ఒక్క మద్యపానమేకాదు, ఈనాడు మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్త రుగ్మతలూ, సమస్త దుర్మార్గాలూ అంతమవుతాయి. సమాజం శాంతి భద్రతలతో, మానవీయ విలువలతో, సుభిక్షంగా అలరారుతుంది. ఏమంటారు? -


 


- యండి. ఉస్మాన్ ఖాన్ సీనియర్ జర్నలిస్టు


ఖాన్ సీనియర్ జర్నలిస్టు