సగటు భారతీయ రైతు జీవన వైకుంఠపాళిలోని దాదాపు ప్రతి మూలమలుపులో మాటువేసి కాటేసే పెద్దపాము - రుణం. దేశంలో సగానికి పైగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి కునారిల్లుతు న్నారన్నది కఠోర యథార్థం. తామున్నది ప్రధానంగా సాగుదారుల కడగండ్లు పరిమార్చడానికేనంటూ దేశీయంగా ఎన్నోచోట్ల రాజకీయ పక్షాలు రుణమాఫీని ఎన్నికల పాచికగా మార్చేశాయి. ఇటీవలి అయిదు రాష్ట్రాల శాసనసభల ఎలెక్షన్ల ప్రచారఘట్టంలోనూ ఆ నినాదం మార్మోగింది. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే- మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్లలోని మొత్తం 424 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా పట్టు 294 స్థానాలనుంచి నేడు 153కు పడిపోయింది. తమకు కొమ్ముకాస్తున్న రైతాంగం రుణం తీర్చుకుంటున్నా మంటూ అధికారం చేపట్టిన వెంటనే ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో సేద్యరుణాల మాఫీని కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్ లోనూ అదే బాట పట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చెబుతున్నారు. అసోమ్ లో రైతు రుణమాఫీకి సిద్ధమైన భాజపా నేతాగణం, ఒడిశాలో గెలుపొందితే అక్కడా దాన్ని అమలుపరుస్తామంటోంది. రూ. 650 కోట్ల మేర గ్రామీణ వ్యవసాయ విద్యుత్ బకాయిల్ని రద్దు చేస్తున్నట్లు గుజరాత్ సర్కారు తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా రైతులందరి రుణాల్ని మాఫీ చేసేంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిద్రపోనిచ్చేది లేదంటున్న రాహుల్ గాంధీ- కేంద్రం ముందుకు రానట్లయితే సార్వత్రిక ఎన్నికల దరిమిలా అధికారం చేపడుతూనే తామే అందుకు స్వయంగా పూనుకొంటామని జాతికి అభయమిస్తున్నారు. మునుపటి రుణమాఫీల తాలూకు నికర ప్రయోజనం ఏ పాటిదో ప్రత్యక్షంగా ఎరిగిన ఎవరైనా ఈ రాజకీయ కోలాహలం మాటున పార్టీల అసలు రాష్ట్రాల అజెండాను ఇట్టే పోల్చుకుంటారు. రుణమాఫీతోనే రైతుల సకల సమస్యలూ అమాంతం తుడిచిపెట్టుకుపోవు! - ఇరవై ఎనిమిదేళ్ల క్రితం, అప్పులపాలైన రైతాంగానికి గొప్ప సాంత్వన ప్రసాదించేదిగా అభివర్ణిస్తూ- కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ప్రకటించిన రుణమాఫీ పరిమాణం సుమారు రూ. 10 వేలకోట్లు. రమారమి నాలుగు కోట్ల మంది రైతులకు మేలు చేకూర్చగల ఏకకాల మాఫీగా 2008-09 బడ్జెట్ లో యూపీఏ సర్కారు కనబరచిన చొరవ అంతిమంగా ఖజానాపై మోపిన వ్యయ భారం, ఇంచుమించు రూ.71 వేలకోట్లు. భూరి వ్యయంతో రైతుల్ని ఒడ్డున పడేశామన్న ప్రచార ఆర్భాటం
వ్యవసాయంలో సంస్కరణలు
మాటున అప్పట్లో కాంగ్రెస్ మహాకుంభకోణానికి అంటుకట్టిందని అయిదేళ్లనాటి 'కాగ్' నివేదిక కుండ బద్దలుకొట్టింది. నేరుగా రైతులకు అందాల్సిన ప్రయోజనాల్ని పెద్దయెత్తున దళారులు, సూక్ష్మరుణ సంస్థలు మింగేయడం, బ్యాంకు ఖాతా పుస్తకాల్లో కిరికిరీలు ముమ్మరించడం- మాఫీ పేరిట లెక్కకు మిక్కిలి అవకతవకల్ని బట్టబయలు చేశాయి. 2014 ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల రుణమాఫీ హామీని దరిమిలా తమిళనాడు, యూపీ, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, రాజస్థాన్ అందిపుచ్చుకొన్నాయి. వివిధ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించిన లక్షా 77 వేలకోట్ల రూపాయలకు పైగా రుణమాఫీలో ఇంకా రూ.68 వేలకోట్ల దాకా అమలుకావాల్సి ఉండగా- కొత్తగా మరిన్ని రాష్ట్రాల చేరికతో పద్దువిస్తరిస్తోంది. రాష్ట్రాలు పోటాపోటీగా సేద్య రుణాలు రద్దు చేస్తూపోతే ఆ భారం రూ.2.7 లక్షల కోట్లకు చేరుతుందని ఆర్థిక సర్వే నిరుడే మదింపు వేసింది. రాష్ట్రాల ఆర్థికలోటును ఇంతలంతలు చేస్తున్న రుణమాఫీ కేవలం తాత్కాలిక ఉపశమనమే. సమస్య లోతుపాతుల జోలికి పోని రుణమాఫీ పేరిట ప్రచారజోరు- ప్రైవేటు వ్యాపారుల అధికవడ్డీ ఉచ్చులో చిక్కి విలవిల్లాడుతున్న అసంఖ్యాక కౌలురైతులు, సాగుదారులపట్ల క్రూర పరిహాసమే! గత యూపీఏ ప్రభుత్వ రుణమాఫీ తరవాతా రోజుకు 46మంది అభాగ్య రైతుల అర్ధాంతర మరణాలు కొనసాగిన వైనాన్ని నేర గణాంకాల సంస్థ సోదాహరణంగా ధ్రువీకరించింది. రాష్ట్రాలవారీగా మాఫీ హామీలు ముమ్మరిస్తున్నా, 1995-96 లగాయతు మూడు లక్షల మందికి పైగా సాగుదారులు బలవన్మరణాలకు పాల్పడ్డారంటున్న అధికారిక గణాంకాలు ఎలుగెత్తుతున్నదేమిటి? శాస్త్రీయ పద్దతిలో లెక్కించి ముట్టజెబుతున్నామంటున్న అరకొర కనీస మద్దతు, ప్రయోగాల దశ దాటని పంటల బీమా రక్షణ, ఎండమావిని తలపిస్తున్న గిట్టుబాటు, ప్రకృతి ప్రకోపాలతో సతమతమవుతున్న అన్నదాతకు- రుణమాఫీ ఒక్కటే ఆయువు పోయలేకపోతోంది. తనంత తానుగా పరిస్థితిని చక్కదిద్దుకోలేని నిస్సహాయ రైతన్నకు- విపణి శక్తుల కుహకాల నుంచి, చీడపీడల నుంచి ఇతరత్రా ఎన్నడూ ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వ యంత్రాంగమే కాచుకోవాలి. భిన్న వాతావరణ ప్రాంతాలు కలిగిన భారత్ లో దేశీయావసరాలు, ఎగుమతి అవకాశాలకు తగ్గట్లు వివిధ పంటల గరిష్ఠ దిగుబడులు సాధ్యపడేలా సమర్థ కార్యాచరణ, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అర్థవంతమైన సమన్వయం సాకారం కావాలి. స్వామినాథన్ మేలిమి సిఫార్సుల స్ఫూర్తికి గొడుగుపడుతూ రైతుకు జీవనభద్రత చేకూర్చాలి. నష్టజాతక వ్యవసాయంపట్ల విరక్తితో పెచ్చరిల్లుతున్న వలసల్ని నిలువరించి, లాభదాయక సేద్యం వైపు యువతరం దండిగా ఆకర్షితమయ్యేలా సమస్త విధి విధానాలు, నవ్యావిష్కరణలు, ప్రయోగాలు పదునుతేలాలి.