యోహాన్ నాస్తిక్/హైదరాబాద్-ప్రజాపాలన:సహాయం చేయాలనే మనసు వుండాలే కానీ అందుకు ధనిక పేద తారతమ్యాలు లేవని నిరూపిస్తున్నాడు ఎం ఎం అహ్మద్ అనే చిరు కార్మికుడు, యిటువంటి మానవీయ సహాయం (ధార్మిక కార్యక్రమం అనకండి) చేసిన మొదటి వ్యక్తిగా కాదు పరిచయం చేస్తున్నది. ఇటువంటి మానవతావాదులను సామాజిక హీరోలను ఎంతమందిని ఎన్నిసార్లు పరిచయం చేసినా తప్పు కాదు. రద్దీగా వున్న లక్షీ కా ఫూల్ చౌరస్తా దగ్గర ఒక ప్రభుత్వ అన్నపూర్ణ క్యాంటీన్ ముందు ఈవ్యక్తి చేతిలో ఓ ఇరవై పైగా పేపర్ ప్లేట్స్ పట్టుకుని తనకన్నా బీదవారికి పంచడం గమనించిన నేను ఆసక్తితో అతని వద్దకు వెళ్ళి విషయం అడిగితే ఏం లేదు సార్, నాకు వారంలో రెండు, మూడు సార్లు నాకన్నా బీదలైన వారికి యిలా ఆకలి తీర్చడం చాలా సంతోషంగా వుంటుంది. పైగా ఖర్చు కూడా వందా నూట యాభై మించదు. ఆ ఐదు రూపాయలు కూడా లేకుండా అక్కడకు వచ్చి నిలబడి నిరాశతో ఆకలిని దాచుకొని వెనక్కు వెళ్ళి పోయిన వాళ్ళను గమనించిన తరువాత నాకు ఈ ఆలోచన వచ్చింది. వీలు కుదిరినప్పుడు ఇలా చేయడం నాకు గొప్ప సంతృప్తిని కలిగించే విషయం వినయంగా చెప్పాడు. భయ్యా మీ ఫోటో తీసుకోవాలని చెప్పగా వద్దని చాలా మొహమాట పడిపోయాడు. చివరకు నా బలవంతం మీద తన ఫోటో తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. క్షణం తీరిక లేని ఈ బిజీ జీవితాలలో ఒక అల్పదాయ వర్గానికి చెందిన వ్యక్తి నిరాశ యలైన తనకన్నా పేదవారి పట్ల చూపిస్తున్న వితరణ ఎంతోమందకి ఆదర్శం. సలాం..ఎం ఎం అహ్మద్ భాయ్ !!!!