దేశంలో మహిళలపై రెండు నిమిషాలకో నేరం జరుగుతోందని జాతీయ నేరగణాంక సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. ఇంటా బయటా రక్షణ కరవై వరస సంఘటనలు చోటు చేసుకుంటుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహిళల సంక్షేమం కోసం తీసుకొచ్చిన గృహహింస నిరోధక చట్టానికి తగిన ప్రచారం కల్పించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. గ ృహహింస నిరోధక చట్టం సెక్షన్ 11(ఎ) ప్రకారం క్రమం తప్పకుండా చట్టంపై టీవీ, పత్రికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం నిర్వహించాల్సి ఉంది. 2005లో చట్టం వచ్చినా ప్రభుత్వాలు ప్రచారానికి సంబంధించి ఎలాంటి వీడియో, ఆడియో కార్యక్రమాలను రూపొందించలేదు. దీన్ని సవాలు చేస్తూ న్యాయశాస్త్ర విద్యార్థి ఒకరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కె.విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014-17 మూడేళ్ల కాలంలో గృహహింస చట్టం కింద 10,960 ఫిర్యాదులందాయి. కౌన్సెలింగ్ ద్వారా 3,605 కేసుల్లో రాజీ కుదిరింది. సమగ్ర విచారణ నివేదికలు (డీఐఆర్) 492 తయారయ్యా యి. కేవలం 158 కేసుల్లోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1,445 కేసుల్లో తుది ఉత్తర్వులు వెలువడ్డాయి. మరో 2,805 కేసుల్లో 18 ఏళ్ళలోపు బాలికలు 91 మంది గృహహింస నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాల్యవివాహాలు కొనసాగుతున్నాయనడానికి ఈ ఫిర్యాదులు తిరుగులేని దాఖలా. 35 ఏళ్లలోపు వయసుగల 4,317 మంది యువతులుబీ 45 ఏళ్లలోపు వయసుగల 1,880 మంది మహిళలు, 45 ఏళ్లు దాటినవారు 1,171 మంది స్త్రీలు మూడేళ్ల కాలంలో ఫిర్యాదు చేసినట్లు తేలింది. గృహహింస తీవ్రత ఏపీలో అధికంగా ఉన్నట్లు గణాంకాలు చాటు తున్నాయి. మహిళల వయసు, సామాజిక వర్గం, విద్య, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, వృత్తి ఉద్యోగంతో సంబంధం లేకుండా గ ృహిణులు, కార్మికులు, అన్ని వర్గాల మహిళలు దీని బారిన పడినట్లు స్పష్టీకరించింది. ఉన్నత విద్యావంతులైన మహిళలు 1,873 మంది గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. అలాగే ఇంటర్ చదివిన 1,923 మంది, పదోతరగతి లోపు విద్యార్హత గల 2,291 మంది బాధితులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయిదో తరగతి వరకు చదువుకున్న వివాహితులూ 1,350 మంది పోలీసు రాణా తలుపు తట్టారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గృహహింస అనే తేడా లేకుండా గృహహింస సాగుతోంది. గ్రామీణ ప్రాంతాలో 2,100 కేసులు, పట్టణ ప్రాంతాల్లో 3,500 కేసుల తెలంగాణ దాకా నమోదయ్యా యి. ఉద్యోగినులు 1,338 మంది, మహిళా వ్యాపారవేత్తలు 291, గ ృహిణులు 3,781 మంది బాధితులుండగా, కార్మిక మహిళలు 2,375 మంది సమస్య , ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. బాధిత మహిళల్లో 5,408 మంది భౌతిక హింసకు గురైనట్లు ఫిర్యాదులున్నాయి. సూటిపోటి మాటల ద్వారా 4,974 మంది గృహిణులు మానసిక హింసకు గురయ్యారు. అరిక విషయాలతో 4,940 మంది, లైంగిక కారణాలతో 1,359 మంది మహిళలు బాధపడుతున్నట్లు నివేదిక స్పష్టీకరించింది. అనేక కేసుల్లో తీర్పు ఆలస్యం కావడం బాధితులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో మొత్తం 10,960 కేసులకు గాను, కేవలం 456 కేసుల్లో మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. 1,493 కేసుల్లో కోర్టు తుది ఉత్తర్వులు వెలువరించింది. మిగిలిన కేసులన్నీ న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్నాయి. కేవలం 60 రోజుల్లోనే 66 కేసులను పరిష్కరించగా, 175 కేసులకు అంతకన్నా ఎక్కువ సమయం పట్టింది. ఏడాదికి పైగా పెండింగ్ లో ఉన్న కేసులు 1,686 ఉన్నాయి. గృహహింసకు పలురకాల కారణాలున్నట్లు పోలీసు విచారణలో తేలింది. అదనపు కట్నం కోసం 5,068 మంది మహిళలను భర్తలు వేధిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. మద్యం సేవించి భార్యలను హింసిస్తున్న సంఘటనలు 4,254 నమోదయ్యాయి. 5,740 మంది గృహిణులు పలురకాల వేధింపులు ఎదుర్కొంటుండగా, భర్త అనుమానం కారణంగా 1,950 మంది స్త్రీలు హింసకు గురవుతున్నారు. గృహహింస కేసుల నమోదులో హైదరాబాద్ మహానగరం దేశంలోనే రెండో స్థానంలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ గతంలోనే వెల్లడించింది. వరకట్న మరణాల్లో హైదరాబాద్ మూడో స్థానం రావడమూ ఆందోళన కలిగించేదిగా ఉంది. గ ృహహింస కేసులు ఒక్క ఏడాదిలోనే 25 శాతం, వరకట్న చావులు 15 శాతం పెరగడం కలచివేస్తోంది. 2014 అక్టోబర్ లో తెలంగాణ పోలీసుశాఖ 'షీ టీమ్స్'ను ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చురుగ్గా తీసుకుంటోంది. 2010-2015 మధ్యకాలంలో దేశరాజధాని ఢిలీలో 13,350 గృహహింస కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 8,489 కేసులు, విజయవాడలో 4,878, ముంబయిలో 2,916, బెంగళూరులో 2,835 కేసులు దాఖలయ్యాయి. వరకట్న మరణాలు దిల్లీలో 326, హైదరాబాద్లో 170, బెంగళూరు 267, ముంబయి 98, విజయవాడలో 86 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ పోలీసులు చురుగ్గా పనిచేస్తూ, జరిగిన సంఘటనలన్నీ కేసులు నమోదు చేస్తుండటం వల్ల అధిక సంఖ్యలో తేలింది. అదే సమయంలో నిరపరాధిని కాపాడటానికి, బాధితులకు భరోసా కల్పించడానికి పాటుపడుతున్నారు. దంపతుల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల గొడవలు పిల్లల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2005లో గృహహింస నుంచి మహిళలకు రక్షణ చట్టం తీసుకొచ్చింది. చట్టాలెన్ని ఉన్నా, కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలపై వేధింపులు, గృహహింస కొనసాగుతూనే ఉంది. నిర్భయ ఘటన తరవాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 2015లో 'సఖి ఒన్ స్టాప్' కేంద్రాలను ఏర్పాటు చేశాయి. బాధిత మహిళలకు ప్రత్యేక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఎన్నిచేసినా మహిళలపై అఘాయిత్యాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే కేసులనూ సఖి కేంద్రాలకు పంపుతున్నాయి. ఈ కేంద్రాలను ఆశ్రయిస్తున్న మహిళలకు అవసరమైన న్యాయసహాయం అందించడం, రక్షణ, వైద్యసాయం, పునరావాసాన్ని కల్పిస్తున్నారు.
కన్నీరు తుడవని చట్టం