' జాతి భద్రత పేరిట సమస్త భారతీయుల 'నెట్టింట్లో' నిఘా కుంపట్లు రాజే యడం సమంజసమేనా?'- కేంద్ర ప్రభుత్వానికి పౌర సమాజం సంధిస్తున్న సూటి ప్రశ్న ఇది. స్మార్ట్ ఫోన్ నుంచి సమాచారం నిల్వ చేసే సాధనం దాకా దేన్నైనా అధీనంలోకి తీసుకొని పరిశీలించే అధికారాన్ని ఎకాయెకి పది దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. 2000 సంవత్సరంనాటి సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టంలోని 69(1) సెక్షన్ అనుసారం అంటూ- ఏ కంప్యూటర్ లోనైనా రూపొందిన, ప్రసారమైన, స్వీకరించిన లేదా నిల్వ చేసిన ఎలాంటి సమాచారాన్ని అయినా నిలువరించడానికి, పర్యవేక్షించడానికి, 'డిక్రిప్ట్' చేసేందుకు నిఘా దర్యాప్తు సంస్థలకు కేంద్రం విశృంఖల అధికారాలు దఖలు పరచింది. 2009నుంచి అమలులో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయని మోదీ ప్రభుత్వం చెబుతున్నా- కొత్తగా ఆదేశాల జారీ అవసరం ఇప్పుడెందుకొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం లేదు. శాంతి భద్రతలు, జాతి సమగ్రతకు ముప్పు వాటిల్లజేసే వ్యక్తులకు సంబంధించిన సైబర్ వ్యవహారాలపై మాత్రమే దర్యాప్తు సంస్థలు నిఘా పెడతాయన్న తాజా వివరణ సంతృప్తికరం కాదు. ఆ పని ఇప్పటికే పలు దశల్లో జరుగుతున్న ప్పుడు- వ్యక్తిగత గోప్యతకు భంగకరంగా డేగకళ్ల నిఘాను సర్వవ్యాప్తం చేసేందుకే ఇప్పుడీ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రజానీకం ఆందోళన చెందడం పూర్తిగా అర్థవంతమే. అంతకుమించి పదేళ్లనాటి నిబంధనల్ని వల్లెవేస్తూ, మారిన కాలమాన పరిస్థితుల్ని గుర్తించకుండా ఒంటెత్తు ధోరణితో వ్యవహరించడమూ అసమంజసమే! కోట్లాది పౌరుల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాల సవిస్తృత వేదికగా మారిపోయిన సైబర్ ప్రపంచంలో- జాతి ద్రోహుల పనిపట్టే పేరిట సామాన్య జనావళి హక్కుల్ని కర్కశంగా అణిచేసే దుశ్చర్యగా తాజా ఉత్తర్వులు సందేహాస్పదమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయుల్లో సమీక్ష కమిటీలు ఆయా కేసుల్ని పరిశీలిస్తాయంటున్నా- నిఘా రాజ్యం ఆనవాళ్లపై భయానుమానాలు ముప్పిరిగొంటున్నాయి! రాజకీయ ప్రత్యర్థుల గుట్టుమట్లను పసిగట్టేందుకు నైతిక నియమాలకు నిలువు పాతరేసి టెలిఫోన్లకు 'దొంగచెవులు' మొలిపించిన ప్రభుత్వాలు - స్వీయ నిర్వాకాల్ని సమర్థించుకొనేందుకు వందేళ్ల క్రితంనాటి టెలిగ్రాఫ్ - చట్ట నిబంధనల్ని ఉటంకించిన ఉదాహరణలెన్నో పోగుపడిన దేశం మనది. టెలిగ్రాఫ్ చట్టంకింద ఫోన్ ట్యాపింగుకు అనుమతించిన తరహాలోనే జారీ అయినా, ప్రస్తుత ఆదేశాలు సర్కారీ నిఘా పడగనీడ పరిధిని దేశవ్యాప్తం చెయ్యనున్నాయి. మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలోనే అగ్రస్థానాన నిలుస్తున్న ఇండియాలో ప్రతి నెలా వెలుగు చూస్తున్న 10 చూస్తున్న 150 కోట్ల గిగాబైట్ల డేటా- అమెరికా, చైనాల ఉమ్మడి వాడకం గగాజిట్ల ఉదా- అమెరికా, చైనాల ఉమ్మడి వాడక కన్నా అధికం. ఏటికేడు ఇంతలంతలవుతున్న డిజిటల్ ప్రపంచంలో సైబరాసురుల దాడులనుంచి పౌరుల ప్రయోజనాల్ని కాపాడటానికి పరిశ్రమించాల్సిన ప్రభుత్వం- ఇటీవలి సుప్రీం తీర్పుల్నీ పరిగణనలోకి తీసుకోకపోవడమే విడ్డూరం. వ్యక్తి గౌరవం రాజ్యాంగ మౌలిక సూత్రమని, వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) దాని పరిధిలోకి వస్తుందంటూ తొమ్మిదిమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నిరుడు ఆగస్టులో ఇచ్చిన తీర్పు సంస్తుతిపాత్రమైనది. ఏనాడో 1791లో అమెరికా రాజ్యాంగానికి చేసిన నాలుగో సవరణ పౌరుల వ్యక్తిగత గోప్యతకు పెద్దపీట వేసింది. పరిణత ప్రజాస్వామ్య దేశంగా ప్రజాస్వామ్య దేశ భారత్ స్థాయిని ఉన్నతీకరిస్తూ రాజ్యాంగ ధర్మాసనం- వ్యక్తిగత గోప్యతను పౌరుల ప్రాథమిక హక్కుగా నిర్ధారించిన తరవాత, ఆ తీర్పు స్ఫూర్తికి పూర్తి విఘాతకరంగా సార్వత్రిక నిఘాకు దారులుపరచే అసంబద్ద ఆదేశాలతో మోదీ ప్రభుత్వం- కోరి కొరివితో తలగోక్కున్నట్లయింది! - రాజ్యాంగబద్దమైన జీవన హక్కు సమానత్వ హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ మాదిరిగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కానే కాదంటూ కేంద్రం చేసిన వాదన నిర్దేతుకమైనదని రాజ్యాంగ ధర్మాసనం నిరుడు నిష్కర్షగా తేల్చేసింది. అంతేకాదు, పౌరుల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించే బాధ్యతను ప్రభుత్వాలకు కట్టబెట్టింది! కేంద్రప్రభుత్వ తాజా ఆదేశాలు ఆ కర్తవ్య నిర్వహణ పరిధిలోకి వస్తున్నాయా లేక పౌరుల ప్రాథమిక హక్కును తొక్కిపడుతున్నాయా? పౌరుల హక్కుల్ని పరిరక్షించడం, ప్రభుత్వాల బాధ్యతల్ని నిర్వచించడం, వ్యాపార - పరిశ్రమల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా కాచుకోవడం- ఈ మూడింటి పైనా దృష్టి సారించామంటూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సారథ్యంలోని నిపుణుల కమిటీదేశంలో సమాచార నిధి భద్రతకు ఓ ముసాయిదా చట్టాన్ని మొన్న జులైలో సమర్పించింది. అదింకా పండిత చర్చల్లో నలుగుతుండగానే, ప్రభుత్వమే అడ్డగోలు ఆదేశాలతో నెటిజనులను భయభ్రాంతం చేస్తోంది. ఐటీ చట్టానికి 2008లో చేసిన సవరణ ద్వారా అమలులోకి వచ్చిన 66ఏ నిబంధన పిచ్చివాడి చేతిలో రాయి చందమై దారుణంగా దుర్వినియోగం కాబట్టే- దేశీయంగా యువజనం భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్రాఘాతకరమంటూ దాన్ని 2015లో సుప్రీంకోర్టు కొట్టేసింది. తాజాగా నిఘా దర్యాప్తు సంస్థలకు దఖలుపడిన అధికారాలు అలా పౌరుల స్వేచ్చను చెండాడవనే భరోసా ఎక్కడుంది? జాతి భద్రతాకారణాలే ఈ చొరవకు ప్రాతిపదికైతే- ఏయే ఉపకరణాలపై నిఘా పెట్టాలన్నా కోర్టు ఆదేశాల్ని తప్పనిసరి చెయ్యడం, మొత్తం వ్యవహారంపై పార్లమెంటు సమీక్షకూ చోటు పెట్టడం వంటి చర్యలు అభిలషణీయం. అపారదర్శకంగా విశృంఖల అధికారాలతో జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరించడం- ప్రజాస్వామ్యానికి శరాఘాతం!
పడగనీడలో నిఘా