ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోంది' అన్నట్లుగా తయారైంది సర్కారీ వైద్యసేవల రంగం దుస్థితి! నలభై మంది రోగులకు ఒక్క వైద్యుడైనా లేని బీఆర్డీ ఆసుపత్రిలో, సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందవని, పాలనాధికారుల స్థాయిలో ప్రైవేటు ప్రాక్టీసు రూపేణా అవినీతి పుష్కలమని ఈసరికే వెల్లడైంది. ప్రాణాంతక మెదడువాపు వ్యాధి వానకాలంలో తీవ్రంగా ప్రబలడానికి అత్యంత అనుకూలమైన భౌగోళిక స్థితిగతులు ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతంలో సమృద్ధంగా ఉన్నాయని, టీకాల ద్వారా దాన్ని నివారించే చొరవ కొరవడటంతో దేశవ్యాప్తంగా సంభవిస్తున్నవాటిలో 90 శాతం మరణాలు అక్కడే నమోదవుతున్నాయని ఎంపీలు పలుమార్లు లోకసభలో ప్రస్తావించారు. బీఆర్డీ ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాల పరిమితుల్ని ఏకరువు పెట్టి, ఎయిమ్స్ లాంటి సంస్థనొకదాన్ని నెలకొల్పాల్సిన ఆవశ్యకత పైనా ఎలుగెత్తారు. సంక్షోభ పూర్వాపరాలపట్ల అంతగా సదవగాహనగల ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిత్వంలో కూడా బీఆర్డీ ఆసుపత్రికి ప్రాణవాయువులు, అందకపోవడం - పసిమొగ్గలు నేలరాలిపోవడానికి కారణమైంది. గత సంవత్సరంతో పోల్చి మరణాల సంఖ్య ఎక్కువ తక్కువల్ని సరిపోల్చుకోవడం కాదు- తమ ఆత్మీయుల ఆయుర్దాయానికి భరోసా దక్కుతుందన్న నమ్మకం ప్రజల్లో కలిగేలా దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల పరిపుష్టీకరణ జరిగి తీరాలి. పోతే తిరిగి తీసుకురాలేనిది ప్రాణం అన్న స్పృహతో వ్యాధి నివారణ, చికిత్సలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలి! సరైన వైద్యసేవలు అందుబాటులో ఉంటే ప్రాణాంతకంగా పరిణమించని 32 రకాల వ్యాధులు, గాయాల పాలబడి ఏయే దానిమీద దేశాల్లో ఎంతెంతమంది మరణించారన్న పాతికేళ్ల గణాంకాల్ని అంతర్జాతీయ పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. మొన్న మే నెలలో వెలుగుచూసిన ఆ నివేదిక మొత్తం 195 దేశాల్లో వైద్య సేవల అందుబాటు నాణ్యతలపై ఆవిష్కరించిన సూచీలో ఇండియాకు 154వ స్థానం దక్కింది. సంపద ఎంత వృద్ధి చెందినా అనేక దేశాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు దిగనాసిగా ఉన్నాయన్న అధ్యయనం- అక్కడి నుంచే దిద్దుబాటు మొదలుకావాలని స్పష్టీకరించింది. నిరుడు ఇండియా మానవాభివృద్ధి సూచీలో ఒక స్థానం దిగజారి 131కి చేరడానికి కొరగాని వైద్య సేవలే పుణ్యం కట్టుకొన్నాయి. నివారించదగ్గ వ్యాధుల పాలబడి అయిదేళ్లలోపు పసివాళ్లు 2015లో ప్రపంచవ్యాప్తంగా 59 లక్షల మంది కనుమూయగా, అందులో సగంమంది అభాగ్యులు ఇండియా, నైజీరియా, కాంగో, ఇథియోపియా, పాకిస్థాన్లకు చెందినవారే! అవసరాలకు తగ్గట్లు వైద్యరంగానికి సర్కారీ కేటాయింపులు లేకపోవడంతో, ప్రసవకాల సమస్యలు, న్యుమోనియా, డయేరియా, ఇన్ ఫెక్షన్ల వంటివి పసివాళ్ల ఉసురు తీసేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, ఒక్కో దానిమీద 61 వేలమంది ఆధారపడి ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. కోట్లుపోసి వైద్యసీట్లు కొనుగోలు చేసినవాళ్లు సర్కారీ సేవలకు మొహం చాటేస్తుంటే- ఆసుపత్రులకు అదనంగా ఏడున్నర లక్షల మంది వైద్యులు కావాలను అంచనాలను సాధించేదెలా? డాక్టర్లతోపాటు రోగ నిర్ధారణ సేవలు, మందులు, పారామెడికల్ సిబ్బంది కోసమూ ప్రభుత్వాలు గణనీయంగా వ్యయీకరించాల్సిన అవసరం కాదనలేనిది. ఆరోగ్యమే మహాభాగ్యమన్నది ఉత్తుత్తి నానుడి కాదు. పెను సంక్షోభంలో చిక్కుకొన్న వైద్య ఆరోగ్య రంగాన్ని సముద్ధరించే దిశగా విస్తృత కేటాయింపులతో పటిష్ఠ కార్యాచరణ పట్టాలకెక్కనిదే భావిభారత భాగ్యోదయం సాధ్యపడదు! ఇప్పటికే ఈఎన్ఏ మందుల స్కామ్ అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది.
సంక్షోభంలో ఆరోగ్యరంగం!