ప్రగతి పథాన దూసుకెళ్తున్న భారత్ జనచైనాను తోసిరాజని ప్రపంచ ఆర్థిక వృద్ధికి కేంద్రంగా అవతరించిందని వారంక్రితమే హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రస్తుతించింది. ఇండియా ఆధిపత్యం వచ్చే పదేళ్లపాటు ఇలాగే కొనసాగుతుందనీ అది భవిష్యదర్శనం చేసింది! వాస్తవంలో, ఏడు శాతానికి పైగా వృద్ధిరేటుతో వెలుపలి ప్రపంచాన్ని ఇండియా అబ్బురపరుస్తున్నా, ఆ స్థాయిలో ఉద్యోగిత వూపందుకొనకపోవడం దేశీయంగా కలవర కారకమవుతోంది. విధానపరంగా దిద్దుబాట పట్టాల్సిన ఆవశ్యకతను స్పురింపజేస్తూ సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) చేసిన తాజా సూచనను ఈ దృక్కోణం నుంచే పరికించాలి. దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పుడు రూపుదాల్చిన పారిశ్రామిక విధానమే ఇప్పటికీ అమలులో ఉంది. ఈ రెండున్నర దశాబ్దాల్లో ఇ-కామర్స్ సహా ఎన్నో వాణిజ్య వేదికలు రంగప్రవేశం చేసిన దృష్ట్యా నూతన జాతీయ పారిశ్రామిక విధానం జరూరుగా కొలువు తీరాల్సి ఉందనడంపై మరోమాట లేదు. యాదృచ్చికంగా, సీఐఐ సూచన వెలువడిననాడే- ఆ మేరకు వివిధ మంత్రిత్వశాఖలు, రాష్ట్రప్రభుత్వాలతో సంప్రతింపులు ఇప్పటికే ఆరంభించినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి లోకసభకు వెల్లడించారు! పారిశ్రామిక సమూహాల్ని (క్లస్టర్స్) ప్రోత్సహించడంలో భాగంగా విస్తృత కసరత్తు చేపట్టిన మోదీ ప్రభుత్వం, ఉపాధి కల్పనకు వూతమిచ్చే ప్రణాళికలకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంది. సీఐఐ ప్రస్తావించిన దేశీయ పెట్టుబడులు, పారిశ్రామిక ఉత్పత్తిలో మందగతి, బలహీన రుణవసతి... మూడింటి పైనా అర్థవంతమైన విధాన రచన వడివడిగా సాగాలి. బహుశా సెప్టెంబరు నాటికి సిద్ధం కాగలదంటున్న విధాన ముసాయిదాలో ఈ దినుసులన్నీ సమపాళ్లలో పడితే- అభివృద్ధి స్థిరకక్ష్యలో కుదురుకోవడానికి అది దోహదపడుతుంది! చైనా ఒక్కటే కాదు- తైవాన్, దక్షిణకొరియా ప్రభృత దేశాలూ ఆర్థిక వ్యవస్థ విస్తృతికి దీటుగా ఉపాధి కల్పన కృషితో ముందడుగేస్తున్నాయి. అభివృద్ధి ఫలాలు ప్రజానీకానికి చేరువయ్యేలా ఏ దేశమైనా నిష్ఠగా అమలుపరచాల్సిన వ్యూహమే అది! ఎకాయెకి 65 శాతం యువతరంతో పోటెత్తుతున్న నవభారతంలో అత్యధికులు సరైన వృత్తి నైపుణ్యాలు కొరవడి ముడిసరకుగా మిగిలిపోవడం- దూరదృష్టి కరవైన మునుపటి పాలకుల విధాన వైఫల్యాల దుష్పరిణామమే. దేశవ్యాప్తంగా సుమారు 58 శాతం పట్టభద్రులు, 62 శాతం మేర స్నాతకోత్తర పట్టభద్రులు నిరుద్యోగంతో సతమతమవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ జటిల సమస్యకు పరిష్కారం ఎక్కడుందో సీఐఐ సూచిస్తోంది. అది చెబుతున్నట్లు పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు నెలకొన్నాయన్నది నిజం. తదనుగుణంగా మానవ వనరుల నిర్మాణం ఎప్పటికి చురుకందుకుంటుందన్నదే ప్రశ్న! నిరుద్యోగాన్ని కట్టడి చేయడమే ధ్యేయమంటూ భారత్ లో తయారీ, నైపుణ్య భారత్, అంకుర పరిశ్రమలు, డిజిటల్ భారత్, ముద్రా యోజనలకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం తెలిసిందే. భారత పారిశ్రామిక భాగ్యరేఖను తిరగరాయడంలో పునరుత్తేజిత తయారీ రంగానిదే కీలకభూమికగా కేంద్రం సంభావిస్తోంది. తద్వారా రైల్వేలు, రహదారులు, నౌకాశ్రయాలు, జౌళి, ఆటోమొబైల్స్, రసాయన, నిర్మాణ తదితర రంగాల్ని తళుకులీనేలా చేయాలన్నది ప్రభుత్వ ప్రవచిత లక్ష్యం. భారీ ఉపాధి అవకాశాలకు గొడుగుపట్టే రంగాల్లో అవసరాలు, సవాళ్లను మదింపు వేసి అందుకు తగ్గ నైపుణ్యాలతో మానవ వనరులకు పదును పెట్టాలి. 2022 నాటికి దేశవ్యాప్తంగా 50 కోట్ల మందిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దు తామంటున్న కేంద్రం - యువత బలిమిని జాతి కలిమిగా మలచగలిగితే, భారతావని ముఖచిత్రమే మారిపోతుంది!ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, విద్య, ఐటీ రంగాల్ని పరిపుష్టీకరించి వ్యవసాయాన్ని తేజరిల్లజేస్తే ఉపాధి అవకాశాలు ఇతోధికమవుతాయన్న మేలిమి సిఫార్సులెన్నింటినో గత యూపీఏ సర్కారు పేరబెట్టింది. పేరుకు వ్యవసాయ ప్రధాన దేశమే అయినా సేద్య రంగాన ఒడుదొడుకులు ఆరు లక్షల పైచిలుకు గ్రామాల్లో తీరని అసంతృప్తి రగిలిస్తున్నాయి! పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం మూడింటా సమధిక ప్రగతే భారత వృద్ధి ప్రస్థానాన్ని అర్థవంతం చేస్తుంది. ఉపాధి సహిత వృద్ధిని సుసాధ్యం చేసే క్రమంలో వ్యవసాయాన్ని, అనుబంధంగా విస్తరించాల్సిన పరిశ్రమల్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. సాగులాయకీ అయిన భూముల విస్తృతి, పంటల వైవిధ్యం, అపార శ్రామిక సంపద కలిగిన దేశంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు కట్టబెట్టే విశేష ప్రాధాన్యం- సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో మేలుమలుపవుతుంది. అందుకు అనుగుణమైన 'మాస్టర్‌ప్లాన్' సత్వరం రూపుదిద్దుకోవాలి. ఫిషరీస్ నుంచి పౌలీ దాకా, రకరకాల భోజ్య పదా ర్థాలు మొదలు పళ్ల రసాల వరకు భిన్న పరిశ్రమలు నెలకొల్పడానికి కావాల్సిన సకల వసతుల పరికల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. అలాగే 2022 నాటికి రిటైల్ రంగాన అయిదు కోట్లు, సౌందర్య స్వస్ల రంగాల్లో కోటీ 42 లక్షలు, టెలికాం రంగంలో 21 లక్షల మేర ఏర్పడతాయంటున్న అదనపు అవకాశాల్ని అందిపుచ్చుకొనేలా నిపుణ శ్రామికుల సృజన ప్రణాళికాబద్ధంగా సాగాలి. 'భారత్ లో తయారీ' కేవలం వస్తూత్పాదనలకే పరిమితం కాకూడదు. దేశమే ఇతర దేశాల్లో నిపుణ శ్రామికులకు పెరుగుతున్న గిరాకీని సద్వినియోగపరచుకొనే బృహత్తర కార్యాచరణకూ మోదీ ప్రభుత్వం నాంది పలకాలి. వృద్ధిరేటుతోపాటు ఉపాధి కల్పనలో, మానవ వనరుల గరిష్ఠ సద్వినియోగంలో వేసే బలమైన ముద్ర 'బ్రాండ్ ఇండియా'ను అంతెత్తున నిలబెడుతుంది!
భారతావనిలో అభివృద్ది... ఉపాధి!