తలూతి మారదా! అంది సంవత్సరాల లో సర్దార్ పాపన్న పాలకులందరణ బిడ్డ. అప్పటి తరతరాలుగా గీత కార్మికులు విద్యా ఉద్యోగ ఆర్థిక, రాజకీయ సాంఘిక, సంక్షేమ రంగాల్లో చెందవలసినంత అభివృద్ధి చెందడం లేదు. గౌడ కులస్తుల ఆర్థిక మూలాలపై దెబ్బతీసి సీమాంధ్రులు కల్లు వృత్తిని దెబ్బతీసారు. మరో పక్క ఏజెన్సీలో ఉన్న లైసెన్సులను రద్దుచేసి సరైన ఉపాధి మార్గం చూపకుండా గీత వృత్తి నుండి గెంటివేసినారు. బతుకు భారమై, ఉపాధి కరువై, జీవితం భారమై పొట్ట చేత పట్టుకుని వేలాది మంది కార్మికులు గల్స్ దేశాలు, ముంబాయి వంటి నగరాలకు, వలస బాట పట్టినారు. జీ.వో నెం. 767 ద్వారా యాభై కిలోమీటర్ల పరిధి అనే శరతుని పెట్టి గీత కార్మికుల జీవితాలను ఆగం ఆగం చేశారు. గ్రామాల్లో ఏరులై పారుతున్న గుడుంబా కానీ, వాడ వాడ వెలసిన బెల్టు షాపులను గానీ నియంత్రించనందు వల్ల గీత కార్మికుల బతుకు అంధకారమయింది. భారత దేశ చరిత్రలో 35 కోటలను కొల్లగొట్టి 25 సంవత్సరాల గోల్కొండ సామ్రాజ్యం పై దాడి చేసి బహుజనుల జండా ఎగరవేసిన సర్దార్ పాపన్న గురించి పట్టించుకునే నాధుడే లేడు. తెలంగాణ గడ్డ మీద గత పాలకులందరూ వలస వచ్చిన వారే. ఒక సర్దార్ పాపన్న గౌడ్ మాత్రమే తెలంగాణ బిడ్డ. అప్పటి వలస వాద పాలనకు వ్యతిరేకంగా దోపిడి అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన సర్దార్ పాపన్న గౌడ్ చరిత్రను వలసవాదులు చరిత్రలోంచి తొలగించి తమ కసిని తీర్చుకున్నారు. ఇప్పటి కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం సర్వాయి పేటలో పాపన్న గుట్టల మీద క్వారీలకు అనుమతి ఇచ్చి పాపన్న గౌడ్ పేరును చరిపి వేద్దామని కుట్ర పన్నారు. దీనికి వ్యతిరేకంగా గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్దకు తీసుకువెళ్లి అక్రమ క్వారీలను రద్దు చేసినారు. గౌడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 1996లో మహాసభ నిర్వహించి తమ ఉద్యమ కాంక్షను ప్రజలకు తెలియజేయడమైనది. దళిత బహుజనులను అనగారిన వర్గాలను ఐక్యం చేసి గత పాలకుల విధానాలను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గీత కార్మికులకు రెండు చక్రాల వాహనాలు ఉండే విధంగా ఏజెన్సీ గౌడ కులస్థులకు చట్ట ప్రకారం ఎస్టీలుగా గుర్తించి లైసెన్సును పునరుద్ధరించాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నీరా ప్రాజెక్టును అమలు చేసి సర్కారే మార్కెటింగ్ చేయాలి. గ్రామాల్లో అక్రమ బెల్టు షాపులను తొలగించాలి. గీత వృత్తిని ఎక్సైజ్ శాఖ నుండి తొలగించి కల్లు గీతను ఒక పరిశ్రమగా గుర్తించి ఏటా బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించాలి. జనాభాలో 20% ఉన్న గీత కార్మికులకు ప్రయోజనాలు కూడా అంతే శాతం ఉండేట్లుగా కృషి చేయాల్సి ఉంది. గీత కార్మిక వృత్తి అత్యంత ప్రమాదకరమైన వృత్తి. గీత కార్మిక భీమాను ఐదు లక్షల నుండి పదిహేను లక్షలకు పెంచాలి. ప్రతి సంవత్సరం వేలాది మంది గీత కార్మికులు చెట్టు ఎక్కుతూ పడి ప్రాణాలను కోల్పోతున్నారు. వారికి ప్రమాద భీమా రావడానికి నెలలు, ఏండ్లు పడుతున్నాయి. బేషరతుగా ప్రమాద భీమా వచ్చేటట్టు చట్టం చేయాలి. తాటి గీత వనాలను ఎక్కే యంత్రాలను సర్కారే ఉచితంగా పంపిణీ చేయాలి. యాదవ, మత్స్య కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించినట్లే గీత కార్మికులకు కూడా అన్నీ ప్రయోజనాలు కల్పించాలి. ప్రభుత్వమే ప్రతి గ్రామంలో కల్లు మండువాలు నిర్మించి ఇవ్వాలి. జీ.వో.నెం. 360 ని అంతటా అమలు చేసి ప్రతి గ్రామ సొసైటీకి ఐదు నుండి పది ఎకరాల భూమిని పంపిణీ చేసి విరివిగా తాటి, ఈత చెట్లను పెంచాలి. గ్రామాల్లో ఉన్న బ్రాండీ షాపుల్లో యాభై శాతం షాపులను గీత కార్మికులకు రిజర్వు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. ప్రభుత్వం జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు మార్పిడి చేయాలి. అందరూ మహనీయుల జయంతి, వర్గంతి వలె సర్దార్ పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. హైద్రాబాద్ ట్యాంక్ బండ్ పై తెలంగాణ ముద్దు బిడ్డ విప్లవ యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. గోల్కొండ రాజ్యంలో సర్దార్ పాపన్న గౌడ్ పాలించిన ప్రాంతాలు, కోటలను తెలంగాణ టూరిస్టు ప్రాంతాలుగా మార్చాలి. వాటికి తగిన నిధులను మంజూరు చేయాలి. నైజాం పాలకులను ఎదురించి పోరాడి దేశం కోసం బలిదానం చేసిన బత్తిని మొగిలయ్యగౌడ్ (ఖిలా వరంగల్) ఎమర్జన్సీ కాలంలో ఉరితీయ బడ్డ గున్నాల కిష్టాగౌడ్, బలహీన వర్గాల సంక్షేమ జ్యోతి బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, గీత కార్మిక వృత్తి రక్షణ కోసం పోరాటం చేసిన తెలంగాణ బిడ్డ దేశిని చిన్న మల్లయ్యగౌడ్, టి. బాలగౌడ్ వంటి గౌడ అమరవీరుల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం.
(నోట్ : మార్చి 2 సోమవారం, హైద్రాబాద్లో తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి మహాసభ సందర్భంగా)
వ్యాసకర్త : రావుల లావణ్య-రాజేశం
లెక్చరర్-సెల్ :7780185674