సారథ్యం వహించే వ్యక్తుల నడతనుబట్టే ఆయా వ్యవస్థలు రాణిస్తా యన్న రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేడ్కర్, కీలక నియామకాల విషు సంలో ఎంత జాగరూకత అవసరమో ఏనాడో అన్యాపదేశంగా ఉద్బోధిం చారు. వాస్తవంలో అటువంటి జాగ్రత్తలు గాలికెగిరిపోయిన దుష్పరిణా మాల్ని జాతిజనులు దశాబ్దాలుగా నిర్వేదంతో పరికిస్తున్నారు. నిన్నటి విశిష్ట తీర్పులో 1997 డిసెంబరు నాటి వినీత్ నారాయణ్ కేసును పలు మార్లు ప్రస్తావించిన సర్వోన్నత న్యాయస్థానం, ఆ స్ఫూర్తికి అనుగుణంగా రాజకీయ జోక్యానికి తావే లేని పటిష్ఠ దర్యాప్తు సంస్థగా కేదస వన్నె లీనాలని అభిలషిస్తోంది. రాజకీయ పనిముట్టుగా దిగజారిన కేదస దుస్థితిని ఎలుగెత్తిన ఆనాటి కేసు విచారణలో- పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి వ్యవస్థలూ స్వేచ్ఛగా స్వతంత్రంగా వ్యవహరించే వాతావరణం నెలకొనాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బ్రిటన్లోని డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ తరహాలో పటుతర సంస్థనొకదాన్ని అవతరింపజేసి కేదస, ఈడీ సాగించే విచారణల పర్యవేక్షణ బాధ్యతను దానికి కట్టబెట్టాలని దిశానిర్దేశం చేసింది. సంయుక్త కార్యదర్శి, ఆపై అధికారుల మీద దర్యాప్తు చేసేందుకు సంబంధిత విభాగం ముందస్తు అనుమతి తప్పనిసరి అంటున్న నిబంధనను సుప్రీం అప్పట్లో కొట్టేసినా- అనంతర కాలంలో వాజ్ పేయీ జమానా మళ్ళీ చేర్చింది. 2014 మే నెలలో సర్వోన్నత న్యాయస్థానం వేటు వేసినా, అది తిరిగి మొలుచుకొచ్చి- అవినీతిపరులకు రక్షాకవచమై వర్దిల్లుతోంది. న్యాయస్థానం వద్దన్న ముందస్తు నిబంధనను ముద్దుచేస్తున్న పాలక పక్షాలకు, అత్యావశ్యకమన్న సమర్థ నిష్పాక్షిక సంస్థ ఏర్పాటు సంగతి పరగడుపున పడిపోయింది. న్యాయస్థానం హితబోధను ప్రభుత్వాలు పెడచెవిన పెట్టిన పర్యవసానంగానే, దర్యాప్తు సంస్థల పరువు ప్రతిష్ఠలకు నేడిలా తూట్లు పడుతున్నాయి. , వీరప్ప మొయిలీ సారథ్యంలోని రెండో పరిపాలన సంస్కరణల సంఘం- దర్యాప్తులో రాజకీయ జోక్యం తాలూకు దుష్ప్రభావ తీవ్రతను సోదాహరణంగా విశదీకరించింది. బ్రిటన్లో రామ్ సె మెక్ డొనాల్డ్ నేతృత్వాన ఏర్పడ్డ మొట్టమొదటి లేబర్ ప్రభుత్వం ఒక దేశద్రోహం కేసులో నేరాభియోగాల్ని కేవలం రాజకీయ కారణాలతో ఉపసంహరించాలని నిర్ణయించింది. నాడు రేగిన పెనురాజకీయ దుమారంలో ప్రభుత్వమే పతనమైంది. ఆ దెబ్బతో దర్యాప్తు, విచారణల్లో వేలు పెట్టడానికి బ్రిటన్ మంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పటికీ హడలెత్తిపోతుంటారు. అక్కడికి ఇక్కడికి ఎంత తేడా! తెరచాటు నియంత్రణల పుణ్యమా అని సరైన సాక్ష్యాధారాలు దొరకలేదన్న సాకుతో ఎన్నో కేసులు మూతపడుతుండటాన్ని సుప్రీంకోర్టే తప్పుపట్టింది. ఉన్నత స్థానాల్లో అవినీతిపై ముక్కుసూటిగా దర్యాప్తు చేపట్టే 'స్వతంత్రత' కేదసలో కొరవడిందని గతంలో కేంద్ర హోంశాఖ నియమించిన మాధవ మీనన్ కమిటీయే నిగ్గుతేల్చింది. దేశానికి స్వాతంత్ర్యం లభించి ఏడు దశాబ్దాలు గతించినా సరైన వ్యవస్థల్ని నిర్మించుకోలేకపోవడమే దురదృష్టకరం. పరిశ్రమ, నిష్పక్షపాతం, నిజాయతీ స్వీయ లక్ష్యాలని కేదస ఘనంగా చాటుకుంటున్నావాటిని గాలికిపోయే పేలపిండి చేసి, జోహుకుం శాలీల్ని ముఖ్య పదవుల్లో కొలువుతీర్చి వ్యవస్థల్ని నీరుకారుస్తుండబట్టే, దిగ్ర్భాంతకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చిత్తశుద్ది, నైతిక నిష్ఠ, సజ్జనత్వం కలగలిసిన బ్యురాక్రాట్ల నుంచే సీవీసీ ఎంపిక జరగాలంటూ దాదాపు రెండు పుష్కరాల నాడు సర్వోన్నత న్యాయస్థానం నిర్దిష్ట విధివిధానాల్ని ఖరారు చేసింది. ఆ కొలమానాన్నే కేదస, ఈడీలకూ ఎందుకు వర్తింపజేయకూడదు? దురాజకీయాల భల్లూక పట్టు నుంచి దర్యాప్తు విచారణ సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు విముక్తం కావడమే- వ్యవస్థల్లో విలువల పతనానికి సరైన విరుగుడు!
నీరుగారుతున్న కీలక దర్యాప్తు సంస్థలు