మట్టి తవ్వకాలతో భూమి ఘోషిస్తుంది. పాతాలాన్ని తలపించే విదంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఇందుకు వరంగల్ రూరల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల సరిహద్దు కోట వెంకటాపురం ప్రాంతంలో మాఫియాను తలప్పించే విధంగా యధేచ్చగా మట్టి తవ్వకాలు జరుగటమే మట్టి మాఫియా కు ప్రత్యక్ష సాక్ష్యం గా నిలుస్తోంది. ఇంత జరుగుతుంటే అరికట్టాల్సిన సంబంధిత శాఖలు అందుకనుగుణమైన చర్యలు చేపట్టడం లేదు. దీనికి తోడు జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు,అసైన్డ్ భూములు అవసరమైతే కొన్ని చోట్ల రైతుల వద్ద ప్రత్యేకంగా భూములను కొనుగోలు చేసి మరీ మట్టి తవ్వకాలు చేస్తున్నారంటే మట్టి మాఫియా ఏవిధంగా యధేచ్చగా సాగుతుందో అర్థంచేసుకోవచ్చు. “కోట వెంకటాపురం” మట్టి తవ్వకాలతో పాటు, ఆత్మకూర్ మండలం పెద్దాపూర్ చెరువులో మట్టితవ్వకాలు, శాయంపేట మండలంలోని పలు చెరువులు, కుంటలు, పత్తిపాక గ్రామ ప్రాంతంలోని గుట్ట వాగు ప్రాంతంలోని మట్టి తవ్వకాలు,ఏనుమాముల, గీసుగొండ, గొర్రెకుంట, నక్కలపల్లి, దామెర మండలాల పరిధిలోని ఇప్పటికే చేసినా, చేస్తున్న మట్టి తవ్వకాలపై సంబంధిత శాఖాధిపతులు అలసత్వం వీడాలి. సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే మరోవైపు అధికారుల ఆశీస్సులతోనే మట్టి తవ్వకాలు యధేచ్చగా జరుగుతున్నాయనేది గమనించాల్సిన అంశం. నిబంధనలు అతిక్రమిస్తుంటే చర్యలు చేపట్టాల్సిన సంబంధిత శాఖలు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. అధికారుల అలసత్వం వెనుక రహస్యపు ఒప్పందాలే పని చేస్తున్నాయంటే అధికారులు నొచ్చుకుంటారేమో కానీ ఎందుకు చర్యలు చేపట్టడం లేదో.. పర్యవేక్షణ ఎందుకు చేయటం లేదో చెప్పగలరా..? మట్టి తవ్వకాలకు ఉన్న అనుమతులు, చెల్లిస్తున్న పన్నులు సక్రమంగానే ఉన్నాయనే సాహసం చేయగలరా..? మిషన్ భగీరధ, ఇతర ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఈ మట్టిని ఉపయోగిస్తున్నామనే కబుర్లు ఎవరైనా చెప్పితే అది ఒక 'ముసుగు' మాత్రమే అనేది గుర్తించకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుంది. ఎందుకంటే పర్మిషన్లకు మించి మట్టి తవ్వకాలు చేపట్టడం, ఇంకాస్తా ఓ అడుగు ముందుకేసిన పలుకుబడి కలిగిన వ్యక్తులు, శక్తులు మట్టి తవ్వకాలకు పర్మిషన్ లు ఉన్నా.. లేకపోయినా అడిగేవారెవరన్నట్లుగా యధేచ్చగా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారనటంలో అతియోశక్తి లేదు. ఎక్కడైతే మట్టి తవ్వకాలు చేశారో... చేస్తున్నారో అక్కడ సమగ్రంగా విచారణ చేపట్టినట్లైతే మట్టి తవ్వకాల దందా "గుట్టు రట్టు అవుతుంది. ఆ తవ్వకాలే సాక్ష్యంగా నిలుస్తాయనేది గుర్తించాలి. అయితే అక్రమంగా నుమతులకు మించి, నిబంధనలకు విరుద్ధంగా తోడేస్తున్న మట్టిని వెంచర్లకు, ప్రయివేటు నిర్మాణాలకు లాభాలకోసం అమ్మటం బహిరంగ రహస్యమే. ఇంత బహిరంగంగా సాగుతున్న మట్టి తవ్వకాల పట్ల రెవెన్యూశాఖ గానీ, మైనింగ్ అధికారులు గానీ కనీసం పర్యవేక్షణ చేసి చర్యలు చేపట్టడం లేదంటే సంబంధిత శాఖలు పనితీరు ఎలా ఉందో...ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారో తేలిపోతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన మరో అంశం ఏమిటంటే చెరువులు, కుంటల్లో చెపట్టే మట్టి తవ్వకాల వల్ల రైతులకు అక్రమంగా వంగా నిలుస్తాయట్టు రట్టు అవుతుందారణ సాగుతున్న మట్టి తనసం పర్యవేక్షణ చేసేలా ఉందో...ఎవరి చెరువులు, కుంటల్లో చెపట్టే మట్టి తవ్వకాల వల్ల రైతులకు పంటపొలాలకు సాగునీటి సమస్య కూడా తలెత్తక తప్పదని గమనించాలి. అడ్డగోలుగా చెరువులు, కుంటల్లోని మట్టిని తోడెయ్యటం వల్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని కొల్పోతాయి. తద్వారా నీటిని నిల్వచేసే స్వభావం చేరువులు, కుంటలకు లేకుండాపోతుంది. భూగర్భజలాలు అనేకరేట్లు అడుగంటిపోతాయి. అందుకోసమే చెరువులు, కుంటలలో ఒక ట్రాక్టర్ మట్టిని తోడాలన్నా కూడా “చిన్న నీటి పారుదల శాఖ” నుంచి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూశాఖ అనుమతులు సైతం తీసుకోవాలి. గ్రామ పంచాయతీ నోటీసులో ఉండాలి. తవ్వకాలు నిబంధనలకు మించి చేయరాదు. ఈ తవ్వకాలను పై శాఖలు పర్యవేక్షణ చేయాలి. ఇప్పటికైనా ఓరుగలులో యధేచ్చగా సాగుతున్న మట్టి తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చెరువులు,కుంటల్లోని తవ్వకాలపై రెవెన్యూశాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములలో సాగుతున్న మట్టి తవ్వకాలపై భూగర్భ జల వనరులశాఖ అధికారులు, విజిలెన్స్, రెవెన్యూ తదితర సంబంధిత శాఖలు సమగ్రమైన విచారణ చేపట్టాలి. భూమి ఘోషించే విధంగా అడ్డూ అదుపు లేకుండా చేపడుతున్న మట్టి తవ్వకాల మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాజేందర్ దామెర (జర్నలిస్ట్)
వ్యవస్థాపక అధ్యక్షులు సహజ వనరుల పరిరక్షణ వేదిక - వరంగల్
సెల్ : 80962 02751