జవాబుదారీ ఏదీ!?

అంతర్జాతీయంగా ఆధిపత్యం కోసం తహతహ లాడుతున్న చైనా దేశీయంగానూ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. స్వదేశంలో మానవ హక్కులను మంటగలుపుతోంది. జిజియాంగ్ ప్రావిన్సులోని మైనారిటీల పట్ల ఆసియా దిగ్గజ దేశం మొరటుగా వ్యవహరిస్తోంది. వారి ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతోంది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిటీ స్వయంగా ఎలుగెత్తి చాటిన విషయమిది. ఇటీవల జెనీవాలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఐరాస జాతి విచక్షణ నిర్మూలన కమిటీ (యూఎన్ కమిటీ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్- సీఈఆర్డీ) సభ్యురాలైన గే మెక్ డౌగల్ బీజింగ్ తీరును బహి రంగంగా ఎండగట్టారు. చైనాలోని అయిదు స్వయంపాలిత ప్రాంతాల్లో జిజియాంగ్ ఒకటి. 1930ల్లో ఇది తూర్పు టర్కిస్థాన్ పేరుతో స్వతంత్ర దేశంగా ఉండేది. 1949లో పూర్తిగా చైనా ఆధీనంలోకి వచ్చింది. భౌగోళికంగా జిజియాంగ్ పలు ప్రత్యేకతలతో కూడి ఉంది. ఇక్కడ జనాభా తక్కువ, భూభాగం ఎక్కువ. అత్యంత ఎత్తయిన ఎడారి ప్రాంతం. చైనాకు వాయవ్య ప్రాంతంలో టిబెట్ సరిహద్దుల్లో విస్తరించి ఉంది. మంగోలియా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, భారత్ తదితర దేశాలు ప్రావిన్స్ సరిహద్దులో ఉన్నాయి. అందువల్లే భౌగోళికంగా ఇది చాలా కీలకమైన ప్రాంతం. అపారమైన చమురు, ఖనిజ నిక్షేపాలు ఇక్కడ ఉన్నట్లు ఇటీవలి కాలంలో గుర్తించారు. ఉరుంక్వి రాజధాని. 45.84 శాతం ముస్లిములు ఉన్నారు. వీరు వీఘర్ తెగకు చెందినవారు. పూర్వం టర్కీ నుంచి వలస వచ్చినట్లు చెబుతారు. అందువల్లే టర్కీ భాష మాట్లాడతారు. చైనాలో గుర్తింపు పొందిన 55 మతపరమైన మైనారిటీ వర్గాల్లో వీరూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కోటి మంది వరకు వీఘర్ తెగవారు ఉంటారని అంచనా. ఇటీవలి కాలంలో వీరిపై దాడులు శ్రుతి మించాయన్న వాదన బలంగా వినపడుతోంది. తమది ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయమంటూ ప్రత్యేక దేశం కోసం వీఘర్లు చేస్తున్న పోరాటాన్ని బీజింగ్ ఉక్కుపాదంతో | అణచివేస్తోంది. జిజియాంగ్ లో వీఘర్ ముస్లిముల ప్రాబల్యాన్ని దెబ్బతీసేందుకు బీజింగ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వీరికి పోటీగా హన్ | చైనా జాతీయుల వలసలను పెద్దయెత్తున ప్రోత్సహిస్తోంది. దీంతో స్థానిక వీఘర్ ముస్లిములు మైనారిటీలయ్యారు. రాజధాని ఉరుంక్వీలోనూ హన్ జాతీయులదే పైచేయి. ప్రావిన్స్ ఇతర ప్రాంతాల్లోనూ హన్ జాతీయులు విస్తరిస్తున్నారు. ఫలితంగా హన్ చైనీయులకు, వీఘర్లకు మధ్య తరచూ ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. హన్ చైనీయులు తమ సంస్క ృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను దెబ్బతీస్తున్నారని, వారి వల్ల తమ మనుగడకే ముప్పు కలుగుతోందని వీఘర్ ముస్లిములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రావిన్స్ లో చైనా భాషను తప్పనిసరి చేశారు. పురుషులు గడ్డాలు పెంచడం, మహిళలు బురఖాలు ధరించడంపై నిషేధం విధించారు. మతవిద్యను నిషేధించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీఘరేతరులకు ప్రాధాన్యం ఇస్తున ఇస్తున్నారు. 2013లో బీజింగ్, 2014లో కుమ్మింగ్, ఉరుంక్వేల్లో జరిగిన ఘటనలతో జిజియాంగ్ ముస్లిముల ఆందోళన అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చింది. 2015లో అధ్యక్షుడు జిన్‌పింగ్ కఠిన చర్యలకు ఉపక్రమించారు. పుస్తకాల దుకాణాల నుంచి ఖురాన్, ఇతర ఇస్లాం గ్రంథాలను తొలగించారు. అరబ్ పాఠశాలల్ని మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులైన వీఘర్లు టోపీలే ధరించడాన్ని నిషేధించారు. ప్రభుత్వం మసీదుల కూల్చివేత కూడా చేపట్టిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సుమారు పది లక్షల మంది వీఘర్లను సామూహిక నిర్బంధ శిబిరాలకు అత్యంత రహస్యంగా తరలించారు. దాదాపు 1,300 శిబిరాలను నిర్వహిస్తున్నట్లు అంచనా. ఇవి నిర్బంధ కారాగారాలను తలపిస్తున్నాయి. మతపరమైన అంశాలను విస్మరించాలని, వామపక్ష భావజాలాన్ని పాటించాలని వారికి ఇక్కడ నూరిపోస్తున్నారు. శిబిరాలు నిర్వహించే ప్రాంతాల్లో పోలీసుల భద్రతను పటిష్ఠపరచారు. ఈ ప్రాంతం హక్కుల రహిత జోన్ గా మారింది. ఇస్లాం సంప్రదాయాలు బదులు చైనా సంప్రదాయాలను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇస్లామీకరణను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టారు. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఉపగ్రహ సాయంతో శిబిరాల చిత్రాలను వెలుగులోకి తెచ్చింది. ఈ దురాగతాలపై మానవహక్కుల మండలికి పలు నివేదికలు అందాయి. వీఘర్ ఇతర ముస్లిం మైనారిటీలను కేవలం మతపరమైన గుర్తింపు ఆధారంగా శత్రువులుగా చైనా భావిస్తోందని ఐరాస ధ్వజమెత్తింది. వీఘర్లు తమ ఆచారాలను, సంప్రదాయాలను కొనసాగించడాని కి చట్టపరంగా గల రక్షణలపై ఐరాస మానవహక్కుల కమిటీ మరో సభ్యురాలు ఫాతిమా బింట్టాదాహ్ ఆందోళన వ్యక్తీకరించారు. ఒక్క జిజ్యాంగ్ లోనే కాదు మరో స్వయంపాలిత ప్రాంతమైన టిబెట్ లో సైతం స్థానికుల పట్ల ప్రభుత్వం విచక్షణ ప్రదర్శిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో, న్యాయస్థానాల్లో స్థానిక భాషకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన వ్యక్తమవుతోంది.